కట్టుదిట్టంగా కర్ఫ్యూ అమలు

ABN , First Publish Date - 2021-05-12T06:58:20+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ లింగసముద్రంలోని ప్రజల్లో భయాన్ని పుట్టించింది. దీనికితోడు గ్రామంలో కూడా సుమారు 50కి పైగా కరోనా కేసులు వచ్చాయి.

కట్టుదిట్టంగా కర్ఫ్యూ అమలు
కందుకూరులో కర్ఫ్యూ పర్యవేక్షిస్తున్న అధికారులు

లింగసముద్రం, మే 11: కరోనా సెకండ్‌ వేవ్‌ లింగసముద్రంలోని ప్రజల్లో భయాన్ని పుట్టించింది. దీనికితోడు గ్రామంలో కూడా సుమారు 50కి పైగా కరోనా కేసులు వచ్చాయి. దీంతో లింగసముద్రం పంచాయతీలోని నాలుగైదు గ్రామాల ప్రజలతో పాటు, ఈ పంచాయతీకి చుటు పక్కల ఉండే గ్రామాల ప్రజలు కూడా కర్ఫ్యూ లేని సమయంలో కూడా నిత్యావసరాల కోసం పెద్దగా రావడం లేదు.  

నాలుగైదు రోజుల క్రితం వరకు లింగసముద్రం గ్రామంలో కరోనా కేసులు ఎక్కువగా వస్తుండడంతో ప్రజలు భయానికి లోనయ్యారు. గత మూడు నాలుగు రోజుల నుంచి లింగసముద్రంలో కేసులు రాకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ ప్రజలు నిత్యావసరాల కోసం గ్రామానికి పెద్దగా రావడం లేదు. సరుకులు గానీ, కూరగాయలు గానీ ఒకేసారి మూడు నాలుగు రోజులకు తీసుకెళుతున్నారు. ప్రతిరోజూ సరుకుల కోసం లింగసముద్రం వస్తే కరోనా ఎక్కడ వస్తుందోనని ఈ విధంగా చేస్తున్నట్టు కొందరు వినియోగదారులు చెప్పారు. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో పట్టుమని 40 మంది కూడా జనం కూడా లేరు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ లేనిదే బయటకు రావడం లేదు. మధ్యాహ్నం 12 గంటల తరువాత కర్ఫ్యూ ఉన్న సమయంలో జన సంచారం ఉండటంలేదు.  ఎవరైనా అనవసరంగా వచ్చే వాహనదారులను మాత్రం వాహనాలతో సహా పోలీస్‌స్టేషన్‌లకు తరలించి పోలీసులు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు.

పోలీస్‌ సిబ్బంది జాగ్రత్తలు పాటించాలి : డీఎస్పీ

దొనకొండ, మే 11: పోలీస్‌ సిబ్బంది తగిన జాగ్రత్తలు పాటిస్తూ విధులు నిర్వర్తించాలని దర్శి డీఎస్పీ కె.ప్రకాశరావు సూచించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విధి నిర్వాహణలో కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. పోలీస్‌ సిబ్బందికి బీపీ, షుగర్‌ తదితర ఆరోగ్య పరిస్థితులను ఆర్‌ఎంపీ వైద్యుడి ద్వారా పరిశీలించి తెలుసుకున్నారు. అనంతరం దొనకొండలో నివసిస్తున్న కానిస్టేబుల్‌ కరుణ ఇంటికి వెళ్లి బయటకు వెళ్లే సమయంలో మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించాలి, కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను కుటుంబసభ్యులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్సై బి.ఫణిభూషణ్‌, ఏఎస్సై రంగారావు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

కాగా, పోలీస్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు దొనకొండ మెడికల్‌ షాప్స్‌ అసోసియేషన్‌ సభ్యులు రూ.20వేలు ఆర్థికసాయాన్ని ఎస్సై బి.ఫణిభూషన్‌కు అందజేశారు. కార్యక్రమంలో మెడికల్‌ షాపుల నిర్వాహకులు ఎం.సత్యనారాయణ, ఆలంపల్లి, పిచ్చయ్య, ఎం.చంద్ర తదితరులు పాల్గొన్నారు.

మాలకొండరాయునిపాలెంలో పారిశధ్య కార్యక్రమాలు 

మాలకొండరాయునిపాలెం(లింగసముద్రం), మే 11: మండలంలోని మాలకొండరాయునిపాలెంలో సర్పంచ్‌ వంటేల శ్రీనివాసులు ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం గ్రామ పంచాయతీలోని పలు గ్రామాలలోని మురుగు కాలువలు, వీధులలో పంచాయతీ సిబ్బందిచే బ్లీచింగ్‌ చల్లించారు. ఈ సందర్బంగా సర్పంచ్‌ శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలోని ప్రజలు తప్పని సరిగా కరోనా రాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. 

కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలి 

వలేటివారిపాలెం, మే 11: కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ అమలుకు ప్రజలు పూర్తిగా సహకరించాలని  ఎస్‌ఐ చావా హజరత్తయ్య తెలిపారు. మండలంలోని పోకూరు బస్టాండు సెంటరులో మంగళవారం ఎస్‌ఐ హజరత్తయ్య కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ కరోనా నివారణకు స్వీయ నియంత్రణ ఒక్కటే మార్గమన్నారు.

కొవిడ్‌ బాధితులకు అండగా నిలవాలి : బుర్రా

కనిగిరి, మే 11 : కొవిడ్‌ బాధితులకు అండగా నిలవాలని వైసీపీ శ్రేణులకు ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో మంగళవారం పార్టీ  నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ  కనిగిరి ప్రాంతంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో బాధితులకు భరోసా ఇచ్చేందుకు ఆయా ప్రాంతాల వైసీపీ నాయకులు, సర్పంచ్‌లు ఆర్థిక సహకారం అందించాలని కోరారు. పట్టణంలో కౌన్సిలర్లు కూడా తమ వంతు చేయూతనివ్వాలని సూచించారు. తన సామాజికవర్గం వారికే పెద్ద పీట వేస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. పార్టీకి సేవ చేసిన వారు తనవారా, పరాయి వారా అని చూడకుండా పదవులను ఇస్తూ సముచిత స్థానం కల్సిస్తున్నానని చెప్పారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌గఫార్‌, వైసీపీ నాయకులు సానికొమ్ము రంగనాయకులరెడ్డి, సూరసాని మోహన్‌రెడ్డి, తమ్మినేని సుజాత, మడతల కస్తూరిరెడ్డి, ఎంపీపీ ప్రకాశం, రామనబోయిన శ్రీనివాసులు యాదవ్‌, చింతం శ్రీనివాసులుయాదవ్‌, దాసరి మురళీయాదవ్‌, కౌన్సిలర్లు దేవకి రాజీవ్‌, వేల్పుల వెంకటేశ్వర్లు యాదవ్‌, పసుపులేటి దీప తదితరులు పాల్గొన్నారు.

 గ్రామాల్లో అధికారుల పర్యటన  

కందుకూరు, మే 11: మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం టాస్క్‌ఫోర్స్‌ కమిటీ అధికారులు పర్యటించి కరోనాపై ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. మండల టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ డి. సీతారామయ్య ఆధ్వర్యంలో డాక్టర్‌ స్వాతి, ఎస్‌ఐ కె.అంకమ్మ, ఎంపీడీవో విజయశేఖర్‌ తదితరులు కరోనా పాజిటివ్‌ కేసులు అధికంగా ఉన్న విక్కిరాలపేట, కమ్మవారిపాలెం, బలిజపాలెం, కొండి కందుకూరు, పలుకూరు గ్రామాలలో పర్యటించారు.కరోనా బాధితులు ఉన్న గృహాలకు వెళ్లి ఇంట్లోని వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  చుట్టుపక్కల వారికి కరోనా సోకకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించటంతో పాటు కరోనా బాధితులు పాటించాల్సిన జాగ్రత్తలపై వారిని అప్రమత్తం చేశారు.  గ్రామాలలోని ప్రధాన కూడళ్లలో సమావేశాలు నిర్వహించటంతో పాటు కూలీల పని ప్రదేశంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. 

Updated Date - 2021-05-12T06:58:20+05:30 IST