మూత్ర విసర్జనకు దిగగానే రూ.15 లక్షల బ్యాగుతో ఉడాయించిన డ్రైవర్‌

ABN , First Publish Date - 2022-04-08T16:06:43+05:30 IST

కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి మూత్ర విసర్జన కోసం దిగగా, అతడి బ్యాగులో ఉన్న రూ.15 లక్షలతో ఉడాయించాడో కారు డ్రైవర్‌. బాధితుడి ఫిర్యాదుతో మైలార్‌దేవుపల్లి

మూత్ర విసర్జనకు దిగగానే రూ.15 లక్షల బ్యాగుతో ఉడాయించిన డ్రైవర్‌

సాయంత్రానికల్లా పట్టుకున్న పోలీసులు 

హైదరాబాద్/ రాజేంద్రనగర్‌: కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి మూత్ర విసర్జన కోసం దిగగా, అతడి బ్యాగులో ఉన్న రూ.15 లక్షలతో ఉడాయించాడో కారు డ్రైవర్‌. బాధితుడి ఫిర్యాదుతో మైలార్‌దేవుపల్లి పోలీసులు, శంషాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు వలపన్ని డ్రైవర్‌ను పట్టుకున్నారు. శంషాబాద్‌ డీసీపీ ఆర్‌.జగదీశ్వర్‌రెడ్డి, రాజేంద్రనగర్‌ ఏసీపీ బి.గంగాధర్‌ రాజేంద్రనగర్‌ ఏసీపీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. జీడిమెట్ల బ్యాంక్‌ కాలనీ రోడ్‌ నెంబర్‌ 8లో నివాసం ఉండే గంజి జగదీశ్వర్‌ రావు(49) మహబూబ్‌నగర్‌ జిల్లాలోని స్పిన్నింగ్‌ మిల్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు.


గురువారం పేట్‌బషీరాబాద్‌ సుచిత్ర నుంచి ఊబర్‌ క్యాబ్‌ బుక్‌ చేసుకున్నాడు. రూ.15 లక్షలు తీసుకుని కంపెనీకి బయలుదేరాడు. డబ్బు తెస్తున్నట్లు కారులో ఉండగానే సిబ్బందితో ఫోన్‌లో చెప్పాడు. కారు పీవీ నర్సింహ్మరావు ఎక్స్‌ప్రెస్‌ వే దిగగానే ఏకేఆర్‌ పెట్రోల్‌ బంకు వద్ద కారు ఆపమని డ్రైవర్‌కు చెప్పిన జగదీశ్వర్‌ మూత్ర విసర్జనకు వెళ్లాడు. బ్యాగులో రూ. 15 లక్షలు ఉన్నట్లు తెలుసుకున్న డ్రైవర్‌ బొడ్డు రాజు (28) డబ్బులతో అక్కడి నుంచి ఉడాయించాడు. దీంతో బాధితుడు మైలార్‌దేవుపల్లి ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. ఆయన ఉన్నతాధికారులకు విషయం చెప్పాడు.


డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి ఆదేశాల మేరకు రాజేంద్రనగర్‌ ఏసీపీ బి.గంగాదర్‌ నేతృత్వంలో మైలార్‌దేవుపల్లి ఇన్‌స్పెక్టర్‌ కె.నర్సింహ్మ, డీఐ జి.రాజేందర్‌గౌడ్‌, డీఎ్‌సఐ ఎం.కుమార్‌గౌడ్‌, శంషాబాద్‌ ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డి టీమ్‌గా ఏర్పడి కారు నెంబర్‌, డ్రైవర్‌ సెల్‌ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా కుత్బుల్లాపూర్‌ ఎం.ఎన్‌ రెడ్డి నగర్‌లోని ఆయన ఇంటి వద్ద కాపు కాశారు. ఇంటికి వచ్చిన రాజు ఆ డబ్బును స్వగ్రామమైన వరంగల్‌ సమీపంలోని నర్మెట్ట మండలం, వెన్దండకు తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తుండగా పట్టుకున్నారు.రూ. 15లక్షల సొమ్మును, కారును, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని రాజును రిమాండ్‌కు తరలించారు. సాయంత్రంలోగా నిందితుడిని పట్టుకున్న పోలీస్‌ టీమ్‌ను డీసీపీ ఆర్‌.జగదీశ్వర్‌రెడ్డి అభినందించి రివార్డులను అందజేశారు. 

Updated Date - 2022-04-08T16:06:43+05:30 IST