కంటోన్‌‘మంట’.. KTR-Bandi వ్యాఖ్యల కలకలం.. ఎక్కడ మొదలైందీ వివాదం..!!

ABN , First Publish Date - 2022-03-15T14:58:22+05:30 IST

కంటోన్మెంట్‌ రోడ్ల మూసివేత వ్యవహారం చినికిచినికి గాలివానలా మారుతోంది. టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య రాజకీయ దుమారం రేపుతోంది...

కంటోన్‌‘మంట’.. KTR-Bandi వ్యాఖ్యల కలకలం.. ఎక్కడ మొదలైందీ వివాదం..!!

  • వివాదాస్పదంగా రోడ్ల మూసివేత
  • బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య రాజకీయ దుమారం
  • నిరసనగా స్థానికుల సంతకాల సేకరణ
  • బైసన్‌ పోలో నుంచి వివాదం మొదలు   
  • పలుమార్లు సమావేశాలు
  • ఎటూ తేలని పంచాయితీ

హైదరాబాద్‌ సిటీ/సికింద్రాబాద్‌ : కంటోన్మెంట్‌ రోడ్ల మూసివేత వ్యవహారం చినికిచినికి గాలివానలా మారుతోంది. టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య రాజకీయ దుమారం రేపుతోంది. అసెంబ్లీలో కేటీఆర్‌ ప్రకటన నేపథ్యంలో కంటోన్మెంట్‌లో రోడ్ల మూసివేతపై లోకల్‌ మిలిటరీ అథారిటీ(ఎల్‌ఎంఏ) తీరుపై స్థానికులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. రహదారులు తెరవాలంటూ టీఆర్‌ఎస్‌ నేతలు సంతకాల సేకరణ చేపట్టారు. బోర్డు విషయంలో కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆర్మీ మాజీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ వైరంతో కంటోన్మెంట్‌, పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కారణం లేకుండా రహదారులు మూసి వేస్తున్నారని ప్రభుత్వం చెబుతుంటే, తప్పని పరిస్థితుల్లోనే మూసేయాల్సి వస్తోందని మిలిటరీ అధికారులంటున్నారు. సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే పలుమార్లు సమావేశాలు జరిగినా ఫలితం లేకుండా పోయింది. సులువుగా పరిష్కారం కావాల్సిన సమస్య జఠిలంగా మారడానికి రాజకీయాలే పరోక్ష కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


వారలా.. వీరిలా...

ఏఓసీ రోడ్లు మూసివేసినా ఇబ్బందులు తలెత్తకుండా వెస్ట్‌మారేడ్‌పల్లిలోని సికింద్రాబాద్‌ క్లబ్‌ వెనుక వైపు నుంచి ఆర్‌కే పురం వరకు 4 కి.మీల మేర రూ.400 కోట్లతో ప్రత్యామ్నాయ రహదారి నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు రూపొందించింది. ఇందుకు బోర్డు పరిధిలోని 42 ఎకరాల స్థలం కావాల్సి ఉంది. స్థలానికి సమాన విలువైన భూమి లేదా పరిహారం ఇవ్వాలని ఎల్‌ఎంఏ కోరింది. తమ డబ్బుతోనే రోడ్డు నిర్మిస్తున్నం దున స్థలానికి పరిహారం ఇవ్వబోమని రాష్ట్ర సర్కారు పేర్కొన్నట్టు తెలిసింది. ఇలా ఎవరికి వారు అదే మాటపై ఉండడంతో సమస్యలు కొలిక్కి రావడం లేదు.


పోస్ట్‌ చేశారు.. తొలగించారు..

అసెంబ్లీలో కేటీఆర్‌ చేసిన ప్రకటనపై రిటైర్డ్‌ ఆర్మీ మేజర్‌ చేసిన ట్వీట్‌ తీవ్ర దుమారం రేపింది. నువ్వు మంచి గాలి పీలుస్తున్నావంటే దానికి కంటోన్మెంట్‌ ముఖ్య కారణమని చెప్పడంతో పాటు మంత్రిని జోకర్‌తో పోలుస్తూ శౌర్య చక్ర అవార్డు గ్రహీత, మేజర్‌ పవన్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు. కొద్ది సేపటికి ఆ ట్వీట్‌ను తొలగించారు. ఇదిలా ఉండగా కేటీఆర్‌ క్షమాపణలు చెప్పాలని బీజేపీ, రోడ్లు మూసివేయడం దారుణమని టీఆర్‌ఎస్‌ నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి.


ఎక్కడ మొదలైందీ వివాదం..

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు సచివాలయం, వంతెనలు, ఇతర అవసరాల కోసం కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలోని 174.22 ఎకరాల స్థలాలు ఇవ్వాలని ఎల్‌ఎంఏను కోరింది. దీనిపై పలుమార్లు రక్షణ శాఖకు లేఖలు రాసింది. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎంపీలు వేర్వేరుగా కేంద్ర రక్షణ శాఖ మంత్రిని పలుమార్లు కలిశారు. ఈ క్రమంలో కొన్ని సార్లు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎల్‌ఎంఏ అధికారులు సమావేశమై చర్చించారు. సచివాలయ నిర్మాణానికి, ఎలివేటెడ్‌ కారిడార్ల కోసం రాజీవ్‌ రహదారి (ఎన్‌హెచ్‌-44) విస్తరణకు, గఫ్‌ రోడ్‌ వెడల్పునకు స్థలాలు ఇవ్వాలని, ఇందుకు ప్రతిగా ఏం ఇవ్వాలనే అంశంపై ఎల్‌ఎంఏ అధికారులతో సర్కారు చర్చలు జరిపింది.


విలువైన స్థలం ఇస్తున్నందున మరో చోట 500 ఎకరాల భూమి, నష్టపరిహారంగా ఏడాదికి రూ.30 కోట్లు ఇవ్వాలని ఎల్‌ఎంఏ కోరింది. భూమి ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేసిన సర్కారు ఏటా పరిహారం చెల్లింపునకు అనాసక్తత చూపింది.  ఆ తర్వాత జరిగిన చర్చ లు కొలిక్కి రాలేదు. కొంత కాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పట్లో రక్షణ శాఖ భూములిచ్చే అవకాశం దాదాపుగా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


‘బుల్కాపూర్‌ నాలాలో చెక్‌ డ్యాం కట్టారు. శాతం చెరువు నుంచి నీళ్లను గోల్కొండ కిందకు తీసుకెళ్దామంటే అటు ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్ఐ), ఇటు కంటోన్మెంట్‌ అడ్డుగా ఉన్నాయి. కారణాల్లేకుండా కంటోన్మెంట్‌ రోడ్లు మూసి వేస్తున్నారు. ప్రజల హితం కోసం అవసరమైతే కంటోన్మెంట్‌కు నీళ్లు, కరెంట్‌ సరఫరా బంద్‌ చేస్తం. అప్పుడైనా దిగిరారా చూస్తం. ఒకసారి పిలిచి మాట్లాడండి. వినకపోతే కఠిన చర్యలకూ వెనుకాడొద్దు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున శాసనసభలో చెప్తున్నా - పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌.


‘భారత సైనికుల మనో ధైర్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం అత్యంత దుర్మార్గం. ఇది ముమ్మాటికీ దేశద్రోహ చర్యే. కంటోన్మెంట్‌ నీ అయ్య జాగీరా..? టచ్‌ చేసి చూడు. మాడి మసైపోతావ్‌. తెలంగాణ ప్రజలు ఉరికిచ్చి.. ఉరికిచ్చి కొడ్తరు’- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.


సహకార లోపమే శాపం..

రాష్ట్ర ప్రభుత్వానికి రక్షణ శాఖ సహకరించకపోవడం కంటోన్మెంట్‌ ప్రజలకు శాపంగా మారింది. కంటోన్మెంట్‌కు బకాయి ఉన్న రూ. 650 కోట్లను చెల్లిస్తే వేగవంతమైన అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. బస్తీలోని పేదలకు కేంద్రం పట్టాలివ్వాలి. స్థలాలు ఇచ్చి ఉంటే రెండు స్కైవేల నిర్మాణం జరిగి, ప్రజలకు లబ్ధి చేకూరేది. ఎన్ని సార్లు లిఖితపూర్వకంగా కోరినా రక్షణ శాఖ పట్టించుకోవడం లేదు. - సాయన్న, ఎమ్మెల్యే, కంటోన్మెంట్‌.


రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణం..

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగానే కంటోన్మెంట్‌ అభివృద్ధి చెందడం లేదు. రక్షణ శాఖను నిందించి ప్రయోజనం లేదు. స్కైవేల నిర్మాణానికి స్థలాలు ఇవ్వడానికి రక్షణ శాఖ సుముఖత వ్యక్తం చేసింది. సచివాలయ నిర్మాణం కోసం బైసన్‌పోలో, జింఖాన్ గ్రౌండ్‌ ఇవ్వడానికీ అంగీకరించింది. అయితే నష్టపరిహారంగా ఏడాదికి రూ. 30 కోట్లు ఇవ్వాలని కోరగా.. ప్రభుత్వం అంగీకరించలేదు. మిలిటరీ స్థావరాలు ఉండే రెండు అంతర్గత రోడ్లు మినహా ఏ రోడ్డూ మూసివేయలేదు.  - జె.రామకృష్ణ, కంటోన్మెంట్‌ సివిల్‌ నామినేటెడ్‌ సభ్యుడు.



Updated Date - 2022-03-15T14:58:22+05:30 IST