ప్లాస్టిక్‌ను వదులుకోలేమా?

ABN , First Publish Date - 2022-08-20T05:51:07+05:30 IST

పర్యావరణానికి పెనుభూతంగా పరిణమించిన నిషేధిత ప్లాస్టిక్‌పై నియంత్రణ కొరవడింది.

ప్లాస్టిక్‌ను వదులుకోలేమా?

  1. ప్రజల్లో కొరవడిన చైతన్యం
  2. యథేచ్ఛగా కొనసాగుతున్న వాడకం
  3. మొక్కుబడి దాడులతో సరిపెడుతున్న అధికారులు


కర్నూలు(న్యూసిటీ), ఆగస్టు 19: పర్యావరణానికి పెనుభూతంగా పరిణమించిన నిషేధిత ప్లాస్టిక్‌పై నియంత్రణ కొరవడింది. యథేచ్ఛగా విక్రయాలు, విచ్చలవిడిగా వినియోగం సాగుతోంది. అవగాహన రాహిత్యంతో ప్రజలు ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులను అవసరం తీరిన తరువాత మురుగు కాలువల్లో పడేస్తున్నారు. దీంతో నీరు ఎక్కడికక్కడే నిలిచి రోడ్లపైకి ప్రవహిస్తోంది. స్వచ్ఛ భారత, స్వచ్ఛ ఆంధ్రాకు ప్లాస్టింగ్‌ బ్యాగులే నిరోధకాలుగా మారాయి. అధికారులు మాత్రం మొక్కుబడిగా దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. 

నిబంధనలు గాలికి..

వంద మైక్రాన్ల కంటే ఎక్కువ ఉండే ప్లాస్టిక్‌నే వినియోగించాలని కేంద్ర పర్యావరణ శాఖ జూలై 1న అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వంద లోపు మైక్రాన కలిగి ఉన్న ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేయడం, విక్రయించడం, వాడటం నేరం. ప్లాస్టిక్‌ వస్తువులను తయారు చేసే సంస్థల పేరు, చిరునామా, పరిమాణం తప్పనిసరిగా ముద్రించాలి. నిబంధనలు ఉల్లంఘించిన ఉత్పత్తి సంస్థలకు రూ.లక్ష  జరిమానా విధించడంతోపాటు ఐదు సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. ఈ క్రమంలో నగర పాలక సంస్థలో గత సంవత్సరం నూతన పాలకవర్గం ఏర్పడ్డాక మందంతో సంబంఽధం లేని ప్లాస్టిక్‌ వస్తువులను నిషేధిస్తూ తీర్మానం చేశారు. అప్పటి నుంచి మున్సిపల్‌ అధికారులు అడపాదడపా దాడులు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ప్రధానంగా నగర పాలక సంస్థకు కూత వేటు దూరంలోనే ప్లాస్టిక్‌ హోల్‌సేల్‌ దుకాణం ఉండటం గమనార్హం. దీంతోపాటు సంస్థకు చుట్టుపక్కల ఉండే దుకాణాల్లో నిత్యం నిషేధిత ప్లాస్టిక్‌ను విక్రయిస్తున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నగరంలో ప్రతి నెలా సుమారు రూ.కోటి వరకు నిషేధిత ప్లాస్టిక్‌ విక్రయాలు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 నిషేధిత వస్తువులు..

ప్లాస్టిక్‌ ప్లేట్లు, గ్లాసులు, స్పూనలు, కప్‌లు, సా్ట్రలు, ఫోర్క్‌లు, స్వీట్‌బాక్స్‌లు, ఫుడ్‌ ప్యాకింగ్‌వాడే కవర్లు, ప్లాస్టిక్‌ పుల్లలతో ఉండే ఇయర్‌ బడ్స్‌, బెలూన్లకు వాడే ప్లాస్టిక్‌ స్టిక్స్‌, ప్లాస్టిక్‌ జెండాలు, లాలీపాప్‌, చాక్లెట్లు ప్లాస్టిక్‌ స్టిక్స్‌, ఐస్‌క్రీమ్‌ పుల్లలు, థర్మాకోల్‌, వంద మైక్రాన్లలోపు పీవీసీ బ్యానర్లు, ప్లాస్టిక్‌ ఇన్విటేషన కార్డులు ఇవన్నీ నిషేధిత జాబితాలో ఉన్నాయి. 

ప్రజారోగ్యానికి హానీ

ఫ వంద మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ వస్తువులను వినియోగించరాదని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు. 

ఫ అతి తక్కువ మందం, పలుచగా ఉండే ప్లాస్టిక్‌ వస్తువులు అంత త్వరగా భూమిలో కలిసి పోవని, ఇవి పూర్తిగా భూమిలో కరిగి పోవాలంటే వందల సంవత్సరాలు పడుతుందంటూ పరిశోధనలో తేలింది. 

ఫ నిషేధిత ప్లాస్టిక్‌కు నిప్పు పెడితే దాని నుంచి వెలువడే టాక్సక్‌ పొగ వాయు కాలుష్యాన్ని కలిగిస్తుంది.

ఫ పెట్రో రసాయనాల నుంచి వీటిని తయారు చేయడంతో ప్రజారోగ్యానికి హానీ కలిగించే ప్రమాదకర రసాయనాలు వీటిలో ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. 

ఫ ప్లాస్టిక్‌ వ్యర్థాలు తిని పశువులు మృత్యువాతపడుతున్నాయి.

ఫ ప్రత్యామ్నాయం ఉన్నా..

ఫ ప్లాస్టిక్‌ వాడకుండా ప్రత్యామ్నాయాలు ఎన్నో ఉన్నా విక్రయదారులు, వినియోగదారులు ఆ దిశగా ఆసక్తి చూపడం లేదు. 

ఫ ప్లాస్టిక్‌ స్థానంలో బట్ట,కాగితం, నారాసంచులు, వెదురు బుట్టలు వాడవచ్చు

ఫ ప్లాస్టిక్‌ సీసాలకు బదులుగా గాజు, పింగాణి వస్తువులను వినియోగించుకోవచ్చు.

ఫ విక్రయదారులు, వినియోగదారులపై భారీ జరిమానాలను సైతం నిర్బంధంగా అమలు చేయాలి. 

 అధికారులు మత్తులో ఉన్నారు. 

నంద్యాల నాగేంద్రకుమార్‌, రాష్ట్ర కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ

నగరంలో విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ అమ్మకాలు జరుగుతున్నా అధికారులు మామూళ్ల మత్తులో తూగుతున్నారు. నగరాల్లో ఎక్కువ శాతం ప్లాస్టిక్‌వైపే మొగ్గు చూపుతున్నాం. పాతకాలం నాటి వస్తువులైన వెదురుబుట్టలు, కాగితం ప్లేట్లు వాడుకుని పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం. 

 దాడులు చేస్తూనే ఉన్నాం 

-డా.భాస్కర్‌రెడ్డి, మెడికల్‌ హెల్త్‌ ఆఫీసర్‌, నగర పాలక సంస్థ, కర్నూలు

దుకాణాల్లో నిత్యం దాడులు జరుపుతూనే ఉన్నాం. గత పాలక వర్గంలోనే మందానికి సంబంధంలేని ప్లాస్టిక్‌ వస్తువులను నిషేధించాలని తీర్మానం చేశారు. వంద మైక్రాన్ల కంటే తక్కువ ఉంటే ప్లాస్టిక్‌ వస్తువులు విక్రయిస్తున్నట్లు సమాచారం అందిస్తే దాడులు చేసి దుకాణాలను సీజ్‌ చేస్తాం. ఈ సంవత్సరం డిసెంబరు 31కి 125 మైక్రాన్ల కంటే తక్కువ ఉంటే ప్లాస్టిక్‌ను నిషేధించాలని కేంద్ర పర్యావరణ శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. 


Updated Date - 2022-08-20T05:51:07+05:30 IST