కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఆలేరు!

ABN , First Publish Date - 2021-06-05T06:35:28+05:30 IST

జిల్లాలో కొత్తగా ఆలేరు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ప్రభుత్వానికి కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ నివేదిక అందజేశారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న రెండు రెవెన్యూ డివిజన్లను విభజిస్తూ మూడు డివిజన్లుగా ఏర్పాటుకు ప్రతిపాదించారు.

కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఆలేరు!

ప్రభుత్వానికి ప్రతిపాదించిన కలెక్టర్‌ 

ఆలేరు పరిధిలో ఐదు మండలాలు 

భువనగిరి డివిజన్‌ విభజన 

యాదాద్రి, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా ఆలేరు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ప్రభుత్వానికి కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ నివేదిక అందజేశారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న రెండు రెవెన్యూ డివిజన్లను విభజిస్తూ మూడు డివిజన్లుగా ఏర్పాటుకు ప్రతిపాదించారు. భువనగిరి డివిజన్‌లో ప్రస్తుతం 12 మండలాలు ఉండగా, వీటిని విభజించి ఐదు మండలాలతో కొత్తగా ఆలేరు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు అధికారులు నివేదించారు. భువనగిరి డివిజన్‌ ఏడు మండలాలతో కొనసాగనుంది. ఆధ్యాత్మికంగా ప్రసిద్ధిచెందిన యాదాద్రి జిల్లాలో ప్రస్తుతం రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 17 మండలాలు ఉండగా, 12 మండలాలు భువనగిరి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఉన్నాయి. ఐదు మండలాలతో చౌటుప్పల్‌ డివిజన్‌ ఉంది. భౌగోళికంగా 3,795 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 17 మండలాలు, 321 రెవెన్యూ గ్రామాలు, 421 గ్రామపంచాయతీలు, ఆరు మునిసిపాలిటీలు ఉన్నాయి. జిల్లా జనాభా 7,70,833. జిల్లాలో ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలు పూర్తిగా, నకిరేకల్‌, తుంగతుర్తి, మునుగోడు నియోజకవర్గాలు పాక్షికంగా ఉన్నాయి. అయితే పరిపాలనా సౌలభ్యం కోసం ఆలేరును రెవెన్యూ డివిజన్‌ చేయాలని ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి ప్రభుత్వానికి నివేదించారు. ఈ మేరకు కొత్తగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు అంశంపై ప్రభుత్వానికి కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ జిల్లా భౌగోళిక స్వరూపం, జనాభా, రెవెన్యూ అంశాలతో సమగ్ర నివేదిక అందజేశారు.


భువనగిరిలో ఏడు, ఆలేరులో ఐదు మండలాలు

ప్రభుత్వానికి కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ అందించిన నివేదిక ప్రకారం ప్రస్తుతం 12 మండలాలుగా ఉన్న భువనగిరి డివిజన్‌ను రెండుగా విభజించనున్నారు. దీంతో భువనగిరి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఏడు మండలాలు, కొత్తగా ఏర్పాటు కానున్న ఆలేరు డివిజన్‌లో ఐదు మండలాలు ఉండనున్నాయి. భువనగిరి, బీబీనగర్‌, బొమ్మలరామారం, తుర్కపల్లి, ఆత్మకూర్‌, మోత్కూరు, అడ్డగూడూరు మండలాలు భువనగిరి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో మిగలనుండగా, ఆలేరు, యాదగిరిగుట్ట, రాజాపేట, మోటకొండూరు, గుండాల మండలాలతో ఆలేరు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకానుంది. విభజన తర్వాత భువనగిరి రెవెన్యూ డివిజన్‌ 1,555 చదరపు కిలోమీటర్ల భౌగోళిక విస్తీర్ణంతో 3,08,254 జనాభా ఉండనుంది. ఈ డివిజన్‌ పరిధిలో 139 రెవెన్యూ గ్రామాలు, 183 గ్రామ పంచాయతీలు, రెండు మునిసిపాలిటీలు మిగులుతాయి. కొత్తగా ఏర్పాటు కానున్న ఆలేరు రెవెన్యూ డివిజన్‌ 1020 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంతో 1,83,028 జనాభా ఉండనుంది. ఈ డివిజన్‌ పరిధిలో 72 రెవెన్యూ గ్రామాలు, 98 గ్రామ పంచాయతీలు, రెండు మునిసిపాలిటీలు ఉండనున్నాయి. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉంది.

Updated Date - 2021-06-05T06:35:28+05:30 IST