నిధులు కేటాయించలేరా?

ABN , First Publish Date - 2022-07-03T05:21:57+05:30 IST

జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మాతా, శిశు మరణాలను అరికట్టేందుకు ఏర్పాటుచేసిన గర్భిణుల వసతి గృహాల పరిస్థితి దయనీయంగా మారింది. వాటి నిర్వహణను పట్టించుకునే వారే కరువయ్యారు.

నిధులు కేటాయించలేరా?
గుమ్మలక్ష్మీపురం వైటీసీలో నిర్వహిస్తున్న గర్భిణుల వసతి గృహం

  గిరిజన గర్భిణుల వసతి గృహాలకు మంజూరు కాని జడ్పీ నిధులు

  ఎనిమిది నెలలుగా సిబ్బందికి జీతాలు చెల్లించని వైనం

  ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించాలని విన్నపం

  (పార్వతీపురం - ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మాతా, శిశు మరణాలను అరికట్టేందుకు ఏర్పాటుచేసిన గర్భిణుల వసతి గృహాల పరిస్థితి దయనీయంగా మారింది. వాటి నిర్వహణను పట్టించుకునే వారే కరువయ్యారు. సుమారు ఎనిమిది నెలలుగా అక్కడి సిబ్బందికి జీతాలు కూడా చెల్లించడం లేదు. మొత్తంగా గిరిజన గర్భిణుల ఘోష ఎవరికీ పట్టడం లేదు.  గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఈ వసతి గృహాలపై రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం వహిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇదీ పరిస్థితి.. 

ఏజెన్సీ ప్రాంతాల్లో సరైన రహదారుల సదుపాయం లేక, పూర్తిస్థాయిలో వైద్యం అందక గతంలో మతా, శిశు మరణాలు ఎక్కువగా సంభవించేవి. వాటిని అరికట్టేందుకు పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం మం డలంలోని భద్రగిరి, సాలూరులో ఉన్న వైటీసీల్లో గిరిజన గర్భిణుల కోసం వసతిగృహాలను ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వాటి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో వాటికి ప్రత్యేక అంబులెన్సులను కూడా ఏర్పాటు చేశారు. డెలివరీకి ముందు వసతి గృహాల్లో చేరుకునే గర్భిణులకు సకాలంలో పౌష్టికాహారం, వైద్యసేవలు అందించే వారు. ప్రసవం జరిగిన తరువాత తల్లీ బిడ్డను క్షేమంగా ఇంటికి పంపించే కార్యక్రమం చేపట్టేవారు. అదే పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి మాత్రం జీతాలు ఇవ్వడం లేదు. భద్రగిరి, సాలూరు గర్భిణుల వసతి గృహాల్లో 18 మంది వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి జీతాల కోసం ప్రతి ఏడాది రూ. 40 లక్షలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు లేకపోవడంతో ఐటీడీఏ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్‌ మారింది. రాష్ట్ర సర్కారు నుంచి ఐటీడీఏలకు కూడా నిధులు రాకపోవడంతో జీతాల సమస్య కొనసాగుతుంది. గతంలో డిపాజిట్లపై వచ్చిన వడ్డీలతో జీతాలను చెల్లించేవారు. అయితే క్రమంగా డి పాజిట్లు కూడా తరిగిపోతున్నాయి. సుమారు 8 నెలలుగా జీతాలు లేకపోవడంతో సిబ్బంది అనేక ఇబ్బందులు ిఎదుర్కొంటున్నారు. దీనిపై ప్రశ్నిస్తే  విధుల నుంచి ఎక్కడ తొలగిస్తారోనని ఆందోళన చెందుతున్నారు. అప్పులపాలై కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇదిలా ఉండగా గిరిజన గర్భిణుల వసతి గృహాల నిర్వహణకు జడ్పీ నిధులు కేటాయించనున్నట్లు గత ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. అయితే నేటికీ ఆ హామీ అమలు కాలేదు. దీంతో వాటి నిర్వహణ అధ్వానంగా మారింది. వాటిపై స్పందించే వారే కరువయ్యారు. గతంలో ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృంద సభ్యులతో పాటు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రశంసలు అందుకున్న ఈ గిరిజన గర్భిణుల వసతిగృహాలపై ప్రభుత్వం, ఉన్నతాఽధికారులు దృష్ట సారించాలని జిల్లావాసులు కోరుతున్నారు. 

  లేఖ రాశాం

 జిల్లా పరిషత్‌ నుంచి నిధులు మంజూరు చేయాలని లేఖ రాశాం. త్వరలోనే నిధులు మంజూరు జరుగుతాయి. ఏడాదికి రూ. 40 లక్షలు జీతాల కోసం చెల్లిస్తున్నాం. 8 నెలలుగా బకాయి పడిన సిబ్బంది జీతాలను త్వరలోనే చెల్లిస్తాం.

-ఆర్‌.కూర్మనాథ్‌, ఐటీడీఏ పీవో, పార్వతీపురం



Updated Date - 2022-07-03T05:21:57+05:30 IST