పదోన్నతుల్లో కోటా వర్తింపుపై జోక్యం చేసుకోలేం

ABN , First Publish Date - 2021-09-15T09:40:35+05:30 IST

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్‌ వర్తింపుపై గతంలో వెలువరించిన తీర్పులను పునఃసమీక్షించాలనుకోవడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

పదోన్నతుల్లో కోటా వర్తింపుపై జోక్యం చేసుకోలేం

  • అమలుపై రాష్ట్రాలదే నిర్ణయం
  • సుప్రీంకోర్టు త్రిసభ్య బెంచ్‌ స్పష్టీకరణ


న్యూఢిల్లీ, సెప్టెంబరు 14 : ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్‌ వర్తింపుపై గతంలో వెలువరించిన తీర్పులను పునఃసమీక్షించాలనుకోవడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోటా విధానం అమలు ఎలా అనేది రాష్ట్రాలే నిర్ణయించుకోవాలని అభిప్రాయపడింది. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో కోటా అమలుకు వేర్వేరు రాష్ట్రాల్లో ప్రతిబంఽధకాలు ఎదురవుతున్నాయంటూ దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్‌ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణను కొనసాగించింది. ఈ వ్యవహారంలో నిర్దిష్ట అంశాలను గుర్తించి రెండు వారాల్లో నివేదించాలని రాష్ట్రాల అడ్వకేట్స్‌ ఆన్‌ రికార్డ్‌ను ఆదేశించింది. కోర్టు జోక్యం అవసరమని రాష్ట్ర ప్రభుత్వాలు తాము భావించిన అంశాలతో ముందుకొస్తే.. ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తామని గతంలోనే బెంచ్‌ స్పష్టం చేసింది. పదోన్నతుల అంశంపై మూడు రాష్ట్రాల (మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, త్రిపుర) హైకోర్టులు భిన్న వైఖరులు తీసుకోవడం సమస్యగా మారిందని అటార్నీ జనరల్‌ అన్నారు. రెండు రాష్ట్రాల హైకోర్టులు పదోన్నతుల్లో ఎస్సీ,ఎస్టీలకు కోటా వర్తింపునకు సుముఖత వ్యక్తం చేస్తే, ఒక రాష్ట్ర హైకోర్టు దాని అమలుపై స్టేట్‌సకో విధించిందని తెలిపారు. 


ఈ వివరాలు నమోదు చేసుకున్న బెంచ్‌ తదుపరి విచారణను అక్టోబరు ఐదో తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. ప్రజా ప్రయోజన వ్యాజ్యాల(పిల్‌) పేరుతో కొంతమంది న్యాయవాదులు వేస్తున్న బోగస్‌ పిటిషన్లను అనుమతించబోమని సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది. 60 ఏళ్ళలోపు న్యాయవాదులు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలంటూ దాఖలైన ఒక వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.


న్యాయవాదుల జీవితాలు ఇతరుల జీవితాల కన్నా ఎక్కువ విలువైనవిగా భావించరాదని న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. న్యాయవాది ప్రదీప్‌ కుమార్‌ యాదవ్‌ ‘ప్రచార ప్రయోజన వ్యాజ్యం’ వేశారని పేర్కొంటూ ఆయనకు రూ.10 వేలు జరిమానా విధించింది. ఇక.. న్యాయస్థానంలో జడ్జి పదేపదే హెచ్చరించినప్పటికీ దురుసుగా ప్రవర్తించి, పెద్ద గొంతుతో వాదనలకు దిగినట్లుగా ఆరోపణలు వచ్చిన ఒక న్యాయవాదిపై ఢిల్లీలోని కోర్టు క్రిమినల్‌ చర్యలకు ఉపక్రమించింది. ఈ నెల 8న అదనపు సెషన్స్‌ కోర్టులో జడ్జి పలుసార్లు హెచ్చరించినప్పటికీ సదరు న్యాయవాది లెక్కచేయకుండా ప్రాసిక్యూటర్‌తో గొంతు పెంచి వాదించడమే కాక, సంజాయిషీ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆ న్యాయవాదిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు.

Updated Date - 2021-09-15T09:40:35+05:30 IST