అధికార పార్టీకి అభ్యర్థి కరువు

ABN , First Publish Date - 2021-07-25T05:39:23+05:30 IST

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో..

అధికార పార్టీకి అభ్యర్థి కరువు
ఇల్లందకుంటలో మాట్లాడుతున్న బండి సంజయ్‌

దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడు కేసీఆర్‌

ఈటల గెలుపు ఖాయం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌


ఇల్లందకుంట: హుజూరాబాద్‌ నియోజకవర్గంలో త్వరలో జరుగనున్న ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి అభ్యర్థి కరువయ్యాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. శనివారం ఇల్లందకుంట మండల కేంద్రంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ చేపట్టిన ప్రజాదీవెన పాదయాత్ర ఆరో రోజుకు చేరుకోగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సంఘీభావం తెలిపారు. అనంతరం కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడు సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి సాక్షిగా చెబుతున్నా ఈటల గెలుస్తున్నాడని ధీమా వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్‌ గెలిచిన తరువాత ఇక్కడ దర్శనం చేసుకొని నేరుగా అయోధ్యరామున్ని దర్శించుకుంటానని తెలిపారు. ప్రతి సర్వేలో ఈటల గెలుస్తున్నాడని చెప్పడంతో భయానికి సీఎం కేసీఆర్‌ తెల్లవారు జామున నిద్రపోతున్నాడని పేర్కొన్నారు. ఏ ఎన్నికలోచ్చినా అక్కడికి వచ్చి హామీలివ్వడం కేసీఆర్‌కు అలవాటని, దళితబంధు కూడా కొందరికి ఇచ్చి మోసం చేసే కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. ఆయనే దళితబంధుపై కోర్టులో పిటిషన్‌ వేసి రాజేందర్‌ వేయించాడని కూడా ప్రచారం చేస్తాడని చెప్పారు.


రూ.10లక్షలు ఒక్క దళితులకే కాదు అన్ని వర్గాల పేదలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ గల్లంతు కాబోతుందని జోస్యం చెప్పారు. నీతి నిజాయితీకి మారు పేరు ఈటల రాజేందర్‌ అని ఆయనను చూడగానే నాకు కన్నీళ్లు వచ్చాయని చెప్పారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఈటలను అధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు. కేసీఆర్‌ అనే మూర్కుని చేతుల్లో తెలంగాణ తల్లి బందీ అయిపోయిందని, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నాయని మండిపడ్డారు. మాట మార్చి మాట్లాడడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. సమావేశంలో మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మీనారాయణ, ధర్మారావు, శోభ, మాజీ జడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, వరంగల్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ తదితరులు పాల్గొన్నారు.


కేసీఆర్‌ మోసాలను చెప్పేందుకే పాదయాత్ర: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌

ఇల్లందకుంట: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ చేపట్టిన ప్రజా దీవెన పాదయాత్ర శనివారం ఆరో రోజు ఇల్లందకుంట, వాగోడ్డురామన్నపల్లె, మాల్యాల, లక్ష్మాజిపల్లె, కనగర్తి గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా లక్ష్మాజిపల్లెలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈటల మాట్లాడుతూ కేసీఆర్‌ అధికారాన్ని, డబ్బును, దౌర్జాన్యాలను ఎదుర్కొనే సత్తా నాకు లేదని, ఆ సత్తా మీకు మాత్రమే ఉంటుందన్నారు. కేసీఆర్‌ చేసిన మోసాలను వివరించి మీ ఆశీర్వాదాలను కోరెందుకు వచ్చానని చెప్పారు. నేను నా మిత్రడు హరీష్‌రావు కేసీఆర్‌కు కుడి వైపు ఒకరం, ఎడమ వైపు ఒకరం అండగా నిలిచామన్నారు. ఉద్యమాల సమయంలో ఎక్కడ తిన్నామో, ఎక్కడ పడుకున్నామో తెలియకుండా పనిచేశామని చెప్పారు. అలాంటి రైట్‌ అండ్‌ లెప్ట్‌గా పనిచేసిన ఇద్దరిలో నేను దయ్యమెట్లయ్యానో కేసీఆర్‌ చెప్పాలని పేర్కొన్నారు. వడ్లు కొనమంటే మాదెమైనా మార్వాడి దుకాణమా, రైస్‌మిల్లు వ్యాపారమా అని కేసీఆర్‌ ఆనలేదా అన్నారు. వడ్లు ఎక్కడైనా అమ్ముకొమ్మని కేసీఆర్‌ అంటే బీజేపీ కొనాల్సిందేనని కోరింది. నేను కాదా అని ప్రశ్నించాడు. ఐకేపీ సెంటర్లు ఎత్తేస్తే ఇంత పంటను కొనే శక్తి రైస్‌మిల్లర్లకు ఉంటుందా, రైతులకు ఇబ్బందులు ఉండకూడదని, నేను ఐకేపీ సెంటర్లు ఉంటాయని, వడ్లు కొంటారని చెప్పానని తెలిపారు. కేసీఆర్‌కు తనొక్కడినే మేధావిని అనే అహంకారం ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఖజానాతో ఈ దేశంలో ఓట్లు దండుకునే వ్యక్తి కేసీఆర్‌ మాత్రమేనని అన్నారు.

Updated Date - 2021-07-25T05:39:23+05:30 IST