ఇదేమి తీరు!

ABN , First Publish Date - 2020-07-07T11:17:46+05:30 IST

ఇళ్లు, ఇళ్ల స్థలాల కేటాయింపులో ప్రభుత్వ తీరును నిరసిస్తూ టీడీపీ నేతలు ఆందోళన బాట పట్టారు. పేదలకు పట్టాల పంపిణీలో భాగంగా స్థలాల

ఇదేమి తీరు!

ఇళ్లను రద్దు చేస్తే సహించేది లేదు

స్థలాల కేటాయింపులో పారదర్శకత ఏదీ?

ప్రభుత్వ వైఖరిపై టీడీపీ ఆందోళన బాట


పలాస, జూలై 6 : ఇళ్లు, ఇళ్ల స్థలాల కేటాయింపులో ప్రభుత్వ తీరును నిరసిస్తూ టీడీపీ నేతలు ఆందోళన బాట పట్టారు. పేదలకు పట్టాల పంపిణీలో భాగంగా స్థలాల కేటాయింపులో పారదర్శకత లేదంటూ ఆరోపించారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపు మేరకు జిల్లాలో సోమవారం వివిధ ప్రాంతాల్లో నిరసనలు తెలిపారు. టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లను ఇంతవరకూ పేదలకు అందించలేదు సరికదా వాటిని రద్దు చేయాలని నిర్ణయించడం సరికాదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


నిర్మించిన ఇళ్లకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ‘అందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా గత ప్రభుత్వం ఏహెచ్‌పీ గృహాలను మంజూరు చేసింది. ఇందులో భాగంగా పలాస జాతీయ రహదారి కోసంగిపురం వద్ద 1,950 గృహాలకు శంకుస్థాపన చేశారు. వీటిలో కొన్ని నిర్మాణం పూర్తయ్యాయి. లబ్ధిదారులను ఎంపిక చేసినా.. గృహాలు కేటాయించలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఈ ఇళ్లను రద్దు చేసేందుకు చర్యలు చేపడుతోంది. దీనిని నిరసిస్తూ.. పలాసలో టీడీపీ నాయకులు ఏహెచ్‌పీ గృహాల సముదాయం వద్ద సోమవారం ఆందోళన చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు లొడగల కామేశ్వరరావు యాదవ్‌, మాజీ మునిసిపల్‌ చైర్మన్‌ వజ్జ బాబూరావు మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ నిర్ణయం.. పేదల పొట్ట కొట్టినట్లుగా ఉంది. ఎంతోమంది పేదలు అప్పు చేసి.. ఈ గృహాల కోసం డీడీలు చెల్లించారు. వారికి ఇళ్లను కేటాయించకపోగా ఉన్న వాటిని రద్దు చేస్తామనడం అన్యాయం’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ వైస్‌చైర్మన్‌ గురిటి సూర్యనారాయణ, నాబిలి శ్రీనివాసరావు, సత్యం, యవ్వారి మోహనరావు, కొరికాన శంకర్‌, కృష్ణనాయక్‌, మార్పు బైరాగి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-07-07T11:17:46+05:30 IST