నియామకాలు రద్దు

ABN , First Publish Date - 2022-05-28T06:58:48+05:30 IST

తీవ్ర దుమారం రేపిన నిర్మల్‌ పురపాలక సంఘం పారిశుధ్య కార్మికుల నియామకాలు త్వరలోనే పూర్తి స్థాయిలో రద్దు కానున్నాయా!?

నియామకాలు రద్దు
మహేశ్వర్‌ రెడ్డి నివాసంలోనే దీక్ష చేపట్టిన దృశ్యం

కలకలం రేపిన ‘ఆంధ్రజ్యోతి’ కథనం 

మున్సిపల్‌ పారిశుఽధ్య కార్మికుల నియామకాలకు తాత్కాలిక బ్రేక్‌ 

వీలైనంత త్వరలోనే పూర్తిస్థాయిలో రద్దు!?

కలెక్టర్‌ను విచారణకు ఆదేశించిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి 

నిర్మల్‌, మే 27 ( ఆంధ్రజ్యోతి ) : తీవ్ర దుమారం రేపిన నిర్మల్‌ పురపాలక సంఘం పారిశుధ్య కార్మికుల నియామకాలు త్వరలోనే పూర్తి స్థాయిలో రద్దు కానున్నాయా!? అంటే అవుననే సమాధానం చెప్పాలి. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పారిశుధ్య కార్మికుల నియా మకాలకు సంబంధించి ప్రస్తుతానికైతే తాత్కాలిక బ్రేక్‌ పడింది. శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ మెయిన్‌లో ప్రచురితమైన ‘అడ్డదారిలో పోస్టులు ఊడ్చేశారు’ అన్న కథనం అటు అధికార యంత్రాంగంతో పాటు ఇటు రాజకీయ వర్గాలను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఉద యాన్నే కలెక్టర్‌తో పాటు స్థానికంగానే ఉన్న రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి స్పందించి ఆగమేఘాల మీద స్పందించి.. నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే నియామక ప్రక్రియను నిలిపివేయాల్సిందిగా ఆదేశిస్తూ నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ శుక్రవారం ఉదయం నోట్‌ విడుదల చేశారు. వెంటనే సమగ్ర విచారణ జరపాలని ఆదేశించిన కలెక్టర్‌.. పదిహేను రోజుల్లోగా పూర్తిస్థాయిలో నివేదిక అందించాలని నిర్మల్‌ ఆర్డీవోను ఆదేశించారు. దీంతో నియామకాల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్‌ పడి నట్లయ్యింది. అయితే ఈ నియామకాల ప్రక్రియను పూర్తిగా రద్దు చేసేందుకే కలెక్టర్‌ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచార ం. అడ్డదారిలో పోస్టులు కట్టబెట్టారన్న ఆరోపణల మేరకు మీడియాలో వస్తున్న కథనాలతో పాటు రాజకీయ పార్టీల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇందులో భాగంగా నే వీలైనంత త్వరలోనే పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి స్థాయిలో రద్దు చేయనున్నారని సమాచారం. ఏడో తరగతి చదివిన అభ్యర్థు లతో భర్తీ చేయాల్సిన మున్సిపల్‌ పారిశుధ్య కార్మిక పోస్టులను పోస్టు గ్రాడ్యుయేట్‌లు, ఉన్నత చదువులు చదివిన అభ్యర్థులతో భర్తీ చేసేందుకు వ్యూహత్మకంగా ప్రణాళికలు రచించిన వ్యవహారంపై అన్ని వర్గాల నుంచి తీ వ్ర వ్యతిరేకత ఎదురైంది. దీనిపై ముఖ్యమంత్రి దాక ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో నియామక ప్రక్రియను పూర్తిగా రద్దు చేయడం వల్లే ఈ అవినీతి వ్యవహారం అధికార పార్టీకి అంటకుండా ఉంటుందన్న ఆలోచనతోనే రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా శుక్రవార ం ఉదయం మంత్రి తన నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ వ్యవహారం పై మాట్లాడారు. మీడియాతో పాటు రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యం లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించనట్లు చెప్పారు. కలెక్టర్‌ ఇచ్చే నివేదికను తాము ప్రభుత్వానికి పంపుతామన్నారు. ఆరోపణలు నిజమా!? కా దా!? అన్న విషయమై నివేదిక వచ్చిన తరువాత మాట్లాడతామన్నారు. అప్పటి వరకు నిర్మల్‌ ప్రజలు సామరస్యంగా ఉండాలని, రాజకీయ పార్టీలు సృష్టించే వివాదాలకు దూరంగా ఉం డాలని మంత్రి ఐకే రెడ్డి పిలుపునిచ్చారు. 

నియామకాల ప్రక్రియకు బ్రేక్‌ : కలెక్టర్‌ 

నిర్మల్‌ మున్సిపాలిటీలో 44 పారిశుధ్య కార్మికుల పోస్టుల ఎంపిక ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. నిర్మల్‌ ఆర్డీవోకు విచారణ బాధ్యతలను అప్పగించారు. పదిహేను రోజుల్లోగా సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆర్డీవోను కలెక్టర్‌ ఆదేశించారు. ఈ వ్యవహారం నిర్మల్‌ జిల్లాలో పురపాలక శాఖతో పాటు అటు అధికార వర్గాల్లో ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగాల భర్తీ వ్యవహారంలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పాటు అధికార పార్టీ సహా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డికి తలనొప్పిగా మారుతుందన్న నేపథ్యంలో.. ఈ నియామకల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్‌ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. 

‘ఆంధ్రజ్యోతి’కి ప్రశంసల వెల్లువ 

నిర్మల్‌ మున్సిపాలిటీలోని పారిశుధ్య కార్మిక పోస్టుల భర్తీలో చోటు చేసుకున్న అక్రమాలను ఆధారాలతో సహా వెలికి తీసిన ‘ఆంధ్రజ్యోతి’పై జిల్లాలోని అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఉద్యోగాల పేరిట జరిగిన కోట్లాది రూపాయల కుంభకోణాన్ని వెలికి తీసినందుకు నిరుద్యోగులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నిజాన్ని నిక్కచ్చిగా రాయడంలో ‘ఆంధ్రజ్యోతి’ ఎప్పుడూ ముందుంటుందని మరోమారు నిరూపితమైందని వారు కొనియాడారు.


Updated Date - 2022-05-28T06:58:48+05:30 IST