ఏఎమ్మార్పీ కాల్వలు ఆధ్వానం

ABN , First Publish Date - 2020-06-01T10:08:48+05:30 IST

జిల్లాలోని రెండున్నర లక్షల ఎకరాలకు సాగు, హైదరబాద్‌ జంట నగరాలతో పాటు జిల్లాలోని గ్రామాలకు తాగునీరు ఏఎమ్మార్పీ ప్రాజె క్టు నుంచే

ఏఎమ్మార్పీ కాల్వలు ఆధ్వానం

ఏపుగా పెరిగిన కంపచెట్లు 

శిథిలావస్థకు చేరిన కాల్వలు

అమలుకు నోచని లస్కర్‌ వ్యవస్థ

వృథాగా పోతున్న కాల్వల నీరు


ఏఎమ్మార్పీ ప్రాజెక్టు కాల్వల   మరమ్మతుల గురించి అధికారులు, నాయకులు పట్టించుకోకపోడంతో కంపచెట్లు ఏపుగా పెరిగి  శిథిలావస్థకు చేరాయి. దీంతో సీజన్‌లో కాల్వల నీరు వృథాగా పోయి కింది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం కాల్వలపై లస్కర్‌ వ్యవస్థ సైతం లేకపోవడంతో వాటిని పట్టించుకునే వారు కరువయ్యారు. అధికారులు కాల్వల మరమ్మతుల విషయమై ప్రతిపాదలనతో నే సరిపెడుతున్నారు. దీంతో రైతులకు ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో సైతం కష్టాలు తప్పేలా లేవు. 


దేవరకొండ:  జిల్లాలోని రెండున్నర లక్షల ఎకరాలకు సాగు, హైదరబాద్‌ జంట నగరాలతో పాటు జిల్లాలోని గ్రామాలకు తాగునీరు ఏఎమ్మార్పీ ప్రాజె క్టు నుంచే అందుతుంది. దీని పరిధిలో 55 డిస్ర్టిబ్యూటరీలు, 93చెరువు లు ఉన్నాయి. 17ఏళ్లుగా తాగునీటి అవసరాలతో పాటు చెరువులు నింపడం, వారబంధీ పద్ధతిన సాగు నీరు విడుదల చేస్తున్నారు. ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వ 135కి.మీ పారుతుంది. ప్రధాన కాల్వతో పాటు మేజర్లకు, డిస్ర్టిబ్యూటరీలకు పర్యవేక్షణ లేకపోవడంతో కాల్వల చుట్టూ ఏపుగా కంపచెట్లు పెరిగాయి. కాల్వల నిర్వహణ, పర్యవేక్షణ కాపలకాస్తూ నీటిని వదలడం, నిలిపివేయడం, గండ్లుపడితే తక్షణమే అధికారులకు సమాచారం అందించడం వంటి పనులు నిర్వహించేందుకు లస్కర్‌(కాపలాదారుడు) వ్యవస్థ ఉపయోగపడుతుంది. కానీ ఏఎమ్మార్పీ ఆయకట్టు పరిధిలో ఈ వ్యవస్థ లేకపోవడంతో ప్రాజెక్టు నిర్వహణ ప్రాజెక్టు ఏఈలు, డీఈల పర్యవేక్షణలోనే కొనసాగుతోంది. డిస్ర్టిబ్యూటరీలు, కాల్వలు ధ్వంసం కావడంతో ప్రధాన కాల్వకు నీరు వదిలితే సాగు నీరు వృథాగా పోతోంది. గతేడాది శ్రీశైలం ఎగువ భాగాన వర్షాలు సమృద్ధిగా  పడడంతో శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి.


దీంతో ఏఎమ్మార్పీ పరిధిలో రబీ సీజన్‌కు వారబంధీ పద్ధతి లో 1.70లక్షల ఎకరాలకు సాగు నీరందించారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవుతుండడం, సాగర్‌లో నీరు ఉండడంతో ఏఎమ్మార్పీ నీటిపై రైతు లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రధాన కాల్వలతో  పాటు మేజర్‌ కాల్వల్లో కంపచెట్లు పెరిగి  శిథిలావస్థకు చేరడంతో నీరు వదిలినా వృథాగా పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఏఎమ్మార్పీ నుంచి నాలుగు మోటర్లతో 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌ జంట నగరాలకు 525క్యూసెక్కులు, జిల్లాలో ని 93చెరువులు నింపేందుకు తాగునీటి అవసరాలకు 1200 క్యూసెక్కు లు, మిషన్‌ భగీరథకు 60క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 


మరమ్మతులకు నిధుల కేటాయింపులో జాప్యం 

 ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వతో పాటు మేజర్లు, డిస్ర్టిబ్యూటరీలు కోత కు గురవడంతో పాటు ఇరువైపులా కంపచెట్లు పెరిగాయి. రెండేళ్లుగా కాల్వల మరమ్మత్తులు నిర్వహించకపోవడంతో నీరు వదిలితే  వృథా అయ్యే అవకాశముంది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవుతుండంతో రైతు లు నీటిని విడుదల చేస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాల్వల మరమ్మత్తులు నిర్వహించి, కంపచెట్లను తొలగించాలని ఆయకట్టు రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 


కాల్వలకు మరమ్మతులు నిర్వహించాలి

ఏఎమ్మార్పీ కాల్వల్లో కంపచెట్లు పెరిగి శిథిలావస్థకు చేరుకున్న ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో నీటిని వదిలితే నీరంతా వృథా పోతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాల్వలకు మరమ్మత్తులు చేయించాలి.

- రమావత్‌ కిషన్‌, పీఏపల్లి. 


ప్రతిపాదనలు పంపించాం 

ఏఎమ్మార్పీ కాల్వల మరమ్మతులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. త్వరలో నిధులు మంజూరు అవుతాయి. కంపచెట్ల ను తొలగించి నీరు వృథాగా పోకుండా చర్యలు చేపడుతాం. ప్రస్తుతం తాగునీటి అవసరాలకు జిల్లాకు 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నాం. 

- సాయిబాబా, ఎస్‌ఈ, ఏఎమ్మార్పీ

Updated Date - 2020-06-01T10:08:48+05:30 IST