మూడుసార్లు పంట వేయలే

ABN , First Publish Date - 2022-05-27T06:47:32+05:30 IST

జిల్లాకేంద్ర సమీపంలోని పానగల్‌లో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ కారణంగా ఆ ప్రాంత రైతులు పంటలు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.

మూడుసార్లు పంట వేయలే
బావిలోకి చేరుతున్న మురుగు నీరు

భూముల్లో మురుగు నీటితో రైతుల ఇబ్బందులు 

పానగల్‌ రైతులకు రూ.43లక్షలకు పైగా నష్టం 

నల్లగొండ, మే 26: జిల్లాకేంద్ర సమీపంలోని పానగల్‌లో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ కారణంగా ఆ ప్రాంత రైతులు పంటలు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల వైఫల్యంతో మురుగు నీరు వ్యవసాయ భూములకు చేరి మూడు సీజన్లుగా పంట పండని పరి స్థితి. దీంతో రైతులు ఆ భూములను పడావుపెట్టారు. వరి సేద్యం కావా ల్సిన భూమిలో గడ్డి పెరగడంతో ప్రస్తుతం భూమి పనికిరాకుండా పోతోం ది. అభివృద్ధి పనుల్లో భాగంగా చేపడుతున్న ప్రధాన డ్రైనేజీ అసంపూర్తిగా ఉంది. ఆ నిర్వాహణ ఎటూ పూర్తి చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర వుతున్నాయి. పానగల్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న డ్రైనేజీ నీటిని వ్యవసాయ బావిలోకి వదలడంతో ఆ నీరంతా సమీపంలోని సుమారు 80ఎకరాల్లోకి వెళ్తోంది. దీంతో ఆ ప్రాంత రైతులు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిని కలిసి తమ ఇబ్బందులను చెప్పుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే పానగల్‌లో నిర్మిస్తున్న డ్రైనేజీని పూర్తిస్థాయిలో నిర్మించి కాల్వలోకి నీరు వెళ్లేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యే ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ నిర్మాణాన్ని పూర్తి చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినందున మురుగు నీటిని పొలాల్లోకి వదలవద్దని రైతులు కాంట్రాక్టర్లను కోరినా కాంట్రాక్టర్లు లెక్కచేయకుండా నీటిని పొల్లాల్లోకి వదిలేలా కాల్వ తీయించారు. దీంతో ఇటీవల ఆ ప్రాంత రైతులు పానగల్‌ సూరారం రోడ్డులో రాస్తారోకో చేశారు. పొలాలకు మురుగు నీరు రాకుండా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 


ఆర్థికంగా నష్టపోతున్న రైతులు

మూడు సీజన్లుగా రైతులు నష్టపోతున్నారు. ఎకరాకు సుమారు 40బ స్తాలు పండుతుండగా 80ఎకరాలకు కలిపి మొత్తం ప్రతి సీజన్‌లో 3,200 బస్తాల ధాన్యం దిగుబడి వస్తుంది. ప్రతి సీజన్‌లో రైతులు 2,200 క్విం టాళ్లకు పైగా ధాన్యాన్ని విక్రయించుకునే వారు. రైతులు మూడు సీజన్లలో రూ.43లక్షలకు పైగా నష్టపోయారు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోనే నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు, కాం ట్రాక్టర్‌, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి చెప్పిన విధంగా ప్రతిపాదనల ప్రకారం నిధులు కేటాయిస్తే తమకు నష్టం వాటిల్లేది కాదని, కానీ ఎమ్మెల్యే చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. 

ఎమ్మెల్యే న్యాయం చేస్తామన్నారు 

ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. డ్రైనేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు, కాం ట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనివల్ల మూడుసార్లు పం టలు పండ కుండాపోయాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తాం. రైతులం మరోసారి ఎమ్మెల్యేను కలుస్తాం. 

 కొప్పు ప్రశాంతం, పానగల్‌


ప్రతిపాదనలు పంపించాం 

డ్రైనేజీ పూర్తి చేయడం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు వచ్చిన వెంటనే పనులను పూర్తి చేస్తాం. రైతులకు ఎలాంటి నష్టంరాకుండా చర్యలు తీసుకుంటాం. డ్రైనేజీ నీటిని పొలాల్లోకి వెళ్లకుండా చూస్తాం. పొలాలకు మురుగునీరు వెళ్లకుండా అవసరమైతే పైపు వేస్తాం. 

  ప్రవీణ్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ డీఈ.


Updated Date - 2022-05-27T06:47:32+05:30 IST