వచ్చాడు.. దోచాడు..!

ABN , First Publish Date - 2021-04-11T05:12:59+05:30 IST

ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. ఆశ్రమంలో చేరాడు. మాటలు, చేతలతో అందరినీ మచ్చిక చేసుకున్నాడు.

వచ్చాడు.. దోచాడు..!
నిరసన వ్యక్తం చేస్తున్న బాధితులు, ఇన్‌సెట్‌లో నిందితుడు వెంకటతిప్పారెడ్డి

  1. ఆశ్రమంలో చేరి.. అందరినీ నమ్మించి..
  2. ఉద్యోగాల పేరిట రూ.18 లక్షలు వసూలు
  3. మద్దికెరలో మోసం 
  4. మధ్యవర్తి ఇంటి వద్ద వంటావార్పుతో నిరసన


మద్దికెర, ఏప్రిల్‌ 10: ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. ఆశ్రమంలో చేరాడు. మాటలు, చేతలతో అందరినీ మచ్చిక చేసుకున్నాడు. రాజ కీయ నాయకులు, ఉన్నతాధికారులు తనకు తెలుసన్నాడు. వ్యాపా రాలు చేస్తుంటానని, మనశ్శాంతి కోసం ఆశ్రమంలో చేరానని వైరా గ్యం నటించాడు. నలుగురికి నాలుగు రూపాయలు ఖర్చు పెట్టేవా డు. ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోతే చూసుకునేవాడు. అంతే..! అందరూ నమ్మేశారు. ఇక ప్రణాళిక అమలు చేశాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ముగ్గురి వద్ద రూ.18 లక్షలు తీసుకుని ఉడాయించాడు. మధ్యవర్తి  ఇరుక్కుపోయాడు. మద్దికెరలో జరిగిన ఈ సంఘటన గురించి, బాధితులు తెలిపిన వివరాలు..

మద్దికెరలోని శివజ్యోతి వృద్ధాశ్రమంలో ఎనిమిది నెలల క్రితం ఎం.వెంకటతిప్పారెడ్డి అనే వ్యక్తి చేరాడు. ఆశ్రమ నిర్వాహకులకు నెలకు రూ.5 వేలు చెల్లించేవాడు. ఆశ్రమంలో అందరితో చనువుగా ఉండేవాడు. ఆ పనిమీద ఈ పనిమీద బజారుకి వెళ్లేవాడు. అలా వ్యాపారులు, వాకింగ్‌కు వెళ్లే వారిని పరిచయం చేసుకున్నాడు. వీరిలో పట్టణానికి చెందిన శ్రీకాంత్‌లాల్‌ బాగా దగ్గర అయ్యాడు. ఆయన ద్వారానే పథకం అమలు చేశాడు. చాలామంది పెద్దోళ్లు తనకు తెలుసునని, అధికార పార్టీ నాయకులు, ఉన్నతస్థాయి అధికారులు బాగా పరిచయమని నమ్మించాడు. విశాఖపట్నంలో మూడు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, రూ.18 లక్షలు ఇస్తే ఉద్యోగాలు ఇప్పిస్తానని శ్రీకాంత్‌లాల్‌కు తెలిపాడు. ఎలాంటి అనుమానాలూ అవసరం లేదని, తాను చూసుకుంటానని నమ్మించాడు. దీంతో పట్టణానికి చెందిన రవి, గాదిలింగప్ప, మరో వ్యక్తి రూ.18 లక్షలు మధ్యవర్తి అయిన శ్రీకాంత్‌లాల్‌కు ఇచ్చారు. ఆ డబ్బును వెంకట తిప్పారెడ్డికి ఇచ్చానని శ్రీకాంత్‌లాల్‌ చెబుతు న్నాడు. ఆ డబ్బులు చేతిలో పడగానే వెంకట తిప్పారెడ్డి ఉడాయించాడు. సెల్‌ఫోన్‌ కూడా స్విచ్‌ ఆఫ్‌ వస్తోంది. బాధితులు మధ్యవర్తి శ్రీకాంత్‌లాల్‌ ఇంటి వద్ద నిరసనకు దిగారు. అక్కడే వంటావార్పు చేశారు. తమకు వెంకటతిప్పారెడ్డితో పరిచయం లేదని, శ్రీకాంత్‌ లాల్‌కు డబ్బులు ఇచ్చామని బాధితులు అంటున్నారు. తమ డబ్బులు తమకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వెంకటతిప్పారెడ్డి ఆధార్‌ కార్డులో విశాఖపట్నం చిరునామా ఉంది. సిమ్‌ కర్ణాటకలో తీసుకున్నట్లు తెలిసింది. అతని స్కూటీ తమినాళడులో రిజిస్ట్రేషన్‌ అయింది. అతను ఇచ్చిన చెక్కులు శ్రీకాకుళంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బారోడాకు చెందినవి. ఆ ఖాతాలో ఒక్క రూపాయి కూడా లేదని తెలిసింది. వారం రోజులుగా గాలించినా ఫలితం లేకపోవడంతో ఎస్‌ఐ మస్తాన్‌వలికి బాధితులు ఫిర్యాదు చేశారు. 


మోసపోయాం

ఉద్యోగం ఇప్పిస్తానంటే రూ.8 లక్షలు ఇచ్చాను. మాకు శ్రీకాంత్‌లాల్‌తోనే సంబంధం. మేము మోసపోయాం. మా డబ్బులు మాకు చెల్లించాలి. - గాదిలింగ, మద్దికెర 

Updated Date - 2021-04-11T05:12:59+05:30 IST