కాల్‌ సెంటరు ఖాళీ!

ABN , First Publish Date - 2022-05-18T06:29:18+05:30 IST

ప్రభుత్వాసుపత్రులకు వచ్చే పేద రోగులకు మెరుగైన వైద్యసేవలందించడంలో ఏ మాత్రం అలసత్వం వహించొద్దు.

కాల్‌ సెంటరు ఖాళీ!

ఉద్యోగుల డిప్యుటేషన్ల రద్దు 

అత్యవసర సేవలకు మంగళం 

అలంకారప్రాయంగా కాల్‌ సెంటరు 

‘‘ప్రభుత్వాసుపత్రులకు వచ్చే పేద రోగులకు మెరుగైన వైద్యసేవలందించడంలో ఏ మాత్రం అలసత్వం వహించొద్దు. ఆసుపత్రుల నుంచి రోగులు సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్లాలనేదే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అభిమతం. అందుకనుగుణంగా డాక్టర్లు, సిబ్బంది అంకితభావంతో పని చేయాలి. ప్రభుత్వాసుపత్రుల్లో ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి 104 కాల్‌ సెంటరును ఈ వారంలోనే మరింత పటిష్టం చేస్తాం. రోగులు, వారి బంధువుల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే ఆరా తీసి చర్యలకు ఉపక్రమిస్తాం’’ 

-  ఇటీవల జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు చేసిన వ్యాఖ్యలివి. 


వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కృష్ణబాబు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన రెండో రోజునే విజయవాడ సబ్‌ కలెక్టరు కార్యాలయంలోని 104 కాల్‌సెంటరులో పని చేస్తున్న డాక్టర్లు, ఉద్యోగులు, వైద్య సిబ్బంది డిప్యుటేషన్లను రద్దు చేసి ఎవరి స్థానాల్లోకి వారిని పంపేశారు. కరోనా ప్రభావం ఉన్నప్పుడు ఈ కాల్‌ సెంటరులో వైద్యాధికారులు, సిబ్బంది కలిసి మొత్తం 30 మందికిపైగా పనిచేయగా.. ఇప్పుడు కేవలం నలుగురే మిగిలారు. ఇక్కడ అందుతున్న సేవలన్నీ దాదాపుగా నిలిచిపోయి కాల్‌ సెంటర్‌ అలంకారప్రాయంగా మిగిలింది.


(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకలు దొరకక.. సకాలంలో సరైన వైద్యసేవలందక జనం పిట్టల్లా రాలిపోతున్న తరుణంలో ఉమ్మడి కృష్ణా జిల్లాకు 104 కాల్‌సెంటరును విజయవాడ సబ్‌ కలెక్టరు కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ కాల్‌ సెంటరులో 24 గంటలూ షిఫ్టుకు 10 మంది చొప్పున మూడు షిఫ్టుల్లో 30 మందిని డిప్యూటేషన్లపై నియమించారు. ఇక్కడి సిబ్బంది విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రితోపాటు గన్నవరంలోని పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రిలోనూ, ఇబ్రహీంపట్నంలోని నిమ్రా ఆసుపత్రిలోనూ కొవిడ్‌ బాధితులకు ప్రభుత్వపరంగా ఉచిత వైద్యసేవలు అందించేవారు. వీటితోపాటు 70 ప్రైవేటు ఆసుపత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో పడకలు కేటాయించడం, హోంఐసోలేషన్‌లో ఉన్నవారికి వైద్యసేవలందించడం, అత్యవసర వైద్యం అవసరమైనవారిని వెంటనే 108 వాహనాల్లో ఆసుపత్రులకు తరలించడం జరిగేవి. మరోవైపు కొవిడ్‌ టెస్టింగ్‌, ట్రేసింగ్‌, వ్యాక్సినేషన్‌ ప్రక్రియలు వేగవంతం చేయడం లాంటి పనులకు 104 కాల్‌సెంటరు ఉపయోగపడింది. వీటికోసం విభాగాల వారీగా బృందాలను ఏర్పాటు చేయడంతో ఎవరి విధులు వారు సక్రమంగా నిర్వర్తించేవారు. జిల్లాలోని కొవిడ్‌ బాధితులకు ఫోన్లు చేసి వారికి అవసరమైన సేవలందించేవారు. ఈ కాల్‌ సెంటరు పనితీరును జాయింట్‌ కలెక్టరు, సబ్‌ కలెక్టరు, అసిస్టెంట్‌ కలెక్టరు పర్యవేక్షించేవారు. 


కరోనా తగ్గిపోయిందనే.. 

గత జనవరి నుంచి కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతూ ఇప్పుడు పూర్తిగా అదుపులోకి రావడంతో 104 కాల్‌సెంటరులో పని చేస్తున్న వైద్యాధికారులను, కొంతమంది సిబ్బందిని మెడికల్‌ ఆఫీసర్లు డీఎంహెచ్‌వోకు లేఖలు రాసి వారి డిప్యూటేషన్లను రద్దు చేయించుకుని తీసుకువెళ్లిపోయారు. గత మార్చిలో వైద్యఆరోగ్యశాఖలో జరిగిన సాధారణ బదిలీల్లో మరికొంత మంది ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లిపోయారు. కొవిడ్‌ సేవల కోసం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో నియమించిన సిబ్బందిని ప్రభుత్వం నిలిపివేసింది. జిల్లాల విభజనకు ముందు వరకూ 104 కాల్‌ సెంటరులో 10 మంది మాత్రమే మిగిలారు. జిల్లాల విభజన తర్వాత 104 కాల్‌ సెంటరులో విధులు నిర్వహిస్తున్న వైద్య ఉద్యోగులను కూడా కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలకు సర్దుబాటు చేశారు. ఈ క్రమంలో కృష్ణా డీఎంహెచ్‌వో తమ జిల్లాకు చెందిన ఆరుగురు ఉద్యోగుల డిప్యూటేషన్లను రద్దు చేయించుకుని వెనక్కి తీసుకువెళ్లిపోవడంతో ప్రస్తుతం ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన నలుగురు ఉద్యోగులు మాత్రమే 104 కాల్‌ సెంటరులో మిగిలారు. దీంతో 104 కాల్‌ సెంటరు ఖాళీ అయిపోయు అలంకారప్రాయంగా మారింది. 


రోగుల బాధలను పట్టించుకునేదెవరు? 

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యసేవల తీరును పర్యవేక్షించేందుకు విజయవాడ సబ్‌ కలెక్టరు జీఎ్‌సఎస్‌ ప్రవీణ్‌చంద్‌ సీసీటీవీ కెమెరాలను తన కార్యాలయంలో ఉన్న 104 కాల్‌ సెంటరుకు అనుసంధానం చేయించారు.  ఆ కాల్‌సెంటరు అలంకార ప్రాయంగా మారడంతో ఆ సీసీటీవీ మానిటర్‌ను చూసేవారు కూడా లేరు. మొత్తంగా 104 కాల్‌ సెంటరు అలంకార ప్రాయంగా మారిన నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కృష్ణబాబు చెప్పినట్టుగా ప్రభుత్వాసుపత్రుల్లో అందుతున్న వైద్యసేవలపై వచ్చే ఫిర్యాదులను ఎలా పరిష్కరిస్తారనేది అధికారులకే తెలియాలి. 

Updated Date - 2022-05-18T06:29:18+05:30 IST