గుట్టుగా పేకాట!

ABN , First Publish Date - 2021-08-21T04:43:42+05:30 IST

గురజాల మండలంలోని కొన్ని ప్రాంతాల్లో గుట్టుగా పేకాట స్థావరాలు నడుస్తున్నాయి. అక్కడి స్థానిక నేతలు వీటిని నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

గుట్టుగా పేకాట!

పెద్దల కనుసన్నల్లో జూదం

గురజాల మండలంలో స్థావరాలు

రూ.కోట్లు పోగొట్టుకుంటున్న బాధితులు 

పిడుగురాళ్ల, ఆగస్టు20: గురజాల మండలంలోని కొన్ని ప్రాంతాల్లో గుట్టుగా పేకాట స్థావరాలు నడుస్తున్నాయి. అక్కడి స్థానిక నేతలు వీటిని నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఓ గ్రామంలో రాత్రింబవళ్లు పేకాట నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. రమ్మీ, భంకినీ, లోపల-బయట ఆట ఇక్కడ నిరంతరం జరుగుతోంది. ఇక్కడ పేకాటకు ఓ నేత అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు. వచ్చిన వారికి మందు, విందు అన్నీ ఇక్కడే అందుబాటులో ఉంచుతున్నారు. ఇక్కడికి ఇతర జిల్లాలు, తెలంగాణా నుంచి కూడా జూదరులు చాలామంది వస్తున్నారని తెలుస్తోంది. గురజాల మండలానికి చెందిన ఓ వ్యాపారి ఈ ఆటతో  ఏకంగా రూ.కోటిన్నర వరకు పోగొట్టుకున్నట్లు చెప్తున్నారు. మరో వ్యక్తికూడా రూ.50లక్షలు పోగొట్టుకొని తనకున్న రెండు ఆస్తులను కూడా అమ్మకానికి పెట్టాడు. రోజూ బ్యాచలు బ్యాచలుగా రమ్మీ, భంకినీ, లోపల-బయట ఆట ఆడుతుంటారు. ఒక్కో గేమ్‌కు నిర్వహణదారుడు రూ.10వేల వరకు తీసుకొంటాడు. ఇంత జరుగుతున్నా పోలీసులు చూసీచూడనట్లు ఉంటున్నారు అన్న వాదన వినిపిస్తోంది. ఆట నిర్వహిస్తున్న నేత పలుకుబడి కలిగిన వారు కావటంతో పోలీసులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదన్న భావన కలుగుతుంది. ఇటీవల రాజుపాలెం, పిడుగురాళ్ల, మాచవరం మండలాల్లోని కొన్ని మామిడితోటలు పేకాట స్థావరాలుగా మారాయి. తెలంగాణా నుంచి కొందరు నాటుపడవల సాయంతో పల్నాడుకు వచ్చి  కృష్ణానది పరివాహక ప్రాంతంలో గుట్టుగా పేకాట ఆడి వెళ్లేవారు. ప్రస్తుతం కృష్ణానదికి వరద అఽధికంగా రావటంతో నాటుపడవల రాకపోకలు నిలిచిపోయాయి. 


Updated Date - 2021-08-21T04:43:42+05:30 IST