కాడెడ్లు కనుమరుగు

ABN , First Publish Date - 2022-06-17T04:55:11+05:30 IST

వ్యవసాయమంటే పశువులతో మనుషులకు విడదీయరాని

కాడెడ్లు కనుమరుగు

  • సేద్యంలో పెరుగుతున్న యాంత్రీకరణ
  • భారమవుతున్న పశు పోషణ
  • రైతన్నతో దూరమవుతున్న భావోద్వేగ బంధం


ఆదిభట్ల, జూన్‌ 16 : వ్యవసాయమంటే పశువులతో మనుషులకు విడదీయరాని బంధం ఉంది. ఒకప్పుడు మానవ జీవితంలో పశువులు ప్రముఖ పాత్ర పోషించేవి. దుక్కి దున్నడం నుంచి గుంటకలు తోలడం వంటి తదితర వ్యవసాయ పనులన్నీ పశువులతోనే చేసేవారు. పెంచిన పశువులు చనిపోతే ఇంట్లో మనిషి పోయి నంతగా రైతులు బాధపడేవారు. అంతేకాకుండా పశువుల పేడను సేంద్రియ ఎరువుగా పొలంలో పోసేవారు. అంతేకాకుండా ఎండాకాలంలో దుమ్ము గుంటకలు, పొడి దుక్కులు, మలి దుక్కులు దున్ని, తర్వాత నీల్లుపెట్టి కరిగట్టు, జంబులు తిప్పి, వరినాట్లకు పొలం సిద్ధం చేయడం లాంటి పనులన్నీ పశువులతో చేసేవారు. అదేవిధంగా పంటలను కోతలు కోసి, కుప్ప నూర్చిన తరువాత బంతులు తిప్పడం, వడ్లను ఇంటికి చేర్చడం వరకు అప్పట్లో రైతులు పశువులపైనే ఆధారపడేవారు. కానీ యంత్రాల రాకతో పశువుల ప్రాధాన్యత తగ్గింది.


యాంత్రీకరణ నేపథ్యంలో..

అనేక రంగాలతోపాటు వ్యవసాయ రంగంలోనూ యాంత్రీకరణ పెరిగిపోయింది. సాగులో భాగంగా నేడు వ్యవసాయానికి ఉపయోగపడే అనేక ఆధునిక యం త్రాలు అందుబాటులోకి వచ్చాయి. దుక్కులు దున్నే దగ్గర నుంచి పంట కోత కోసి ధాన్యం ఇంటికి చేరేవరకు అనేక యంత్రాలను ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా వ్యవసాయరంగాన్ని ఆధునికీకరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యంత్రాలను ప్రోత్సాహిస్తున్నాయి. అదేవిధంగా తక్కువ సమయంలో ఎక్కువ పనులు జరుగుతుండటంతో రైతులు కూడా యంత్రాలను ఉపయోగించడానికే మొగ్గు చూపుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాలలో కాడెడ్ల ప్రాధాన్యం క్రమేపీ తగ్గుతూ వస్తుంది. 


భారమైన పశుపోషణ

ప్రస్తుత పరిస్థితుల్లో పశు పోషణ భారంగా మారింది. దానికి తోడు వ్యవసాయానికి అవసరమవుతున్న కాడెడ్లు మరీ ఖరీదైపోతున్నాయి. ప్రస్తుత మార్కెట్లో కాడెడ్ల జత లక్ష రూపాయల వరకు ధర పలుకుతుంది. అంతపెట్టుబడి పెట్టి కాడెడ్లను తీసుకొచ్చి వాటిని పోషించడం అంతకు మించిన భారంగా మారుతుంది. 


పశుపోషణ కష్టమవుతుంది

వ్యవసాయం లాభం లేకుండాపోతోంది. కూలీల కొరత, గిట్టుబాటు ధర లేక రైతు పరిస్థితి దారుణంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పశు పోషణ భారంగా మారుతుంది. వ్యవసాయ పనులు యంత్రాలతో తొందరగా అవుతున్నాయి. అంతేకాకుండా ఎడ్ల ధరలు కూడా విపరీతంగా ఉన్నాయి. దీంతో వాటిని కొనుగోలు చేయడం లేదు.

- తాళ్ల శ్రీనివాస్‌గౌడ్‌  రైతు, ఆరుట్ల


Updated Date - 2022-06-17T04:55:11+05:30 IST