పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్లు

ABN , First Publish Date - 2020-10-28T10:18:15+05:30 IST

పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్లు

పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్లు

 మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు


మచిలీపట్నం టౌన్‌ : పోలవరం, అమరావతి రెండూ రాష్ట్రానికి రెండు కళ్లని, వీటిని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, దీని వల్ల రాష్ట్రాభివృద్ధి పదేళ్లు వెనక్కి వెళుతుందని మాజీ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు. మంగళవారం ఘంటసాల గ్రామం నుంచి ఎస్సీ సెల్‌ నాయకులు దిరిశం సుధీర్‌, జువనపూడి సుధాకర్‌, కె.సునీల్‌, మట్టా అంబేద్కర్‌, నాగేంద్రబాబు మాజీ ఎంపీని కలిశారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ, వరద ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్లిన టీడీపీ జాతీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌పై అక్రమ కేసులు బనాయించడం దురదృష్టకరమన్నారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు హంద్రీనీవా, గాలేరు నగిరి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటి నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాలు చతికిలపడ్డాయన్నారు. వాటాల కోసం కాంట్రాక్టులు, పారిశ్రామికవేత్తలను భయపెట్టి తరిమేశారన్నారు. దీనివల్ల దేశ విదేశాల్లో రాష్ట్రానికి చెడ్డపేరు వచ్చిందన్నారు. చంద్రబాబు హయాంలో రైతుల సంక్షేమం కోసం పోలవరం, పట్టిసీమ వంటి ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టారన్నారు.


చంద్రబాబు నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు వల్లే కృష్ణా డెల్టా ప్రాంతానికి ఇప్పటికీ సాగునీరు అందుతోందన్నారు. కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేసి 120 టీఎంసీల నీటిని కృష్ణాడెల్టాకు తీసుకుని వచ్చామన్నారు. వరదలు, భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య, పి.వి. ఫణికుమార్‌, కాసాని భాగ్యారావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-28T10:18:15+05:30 IST