బైరిసన్స్‌.. బురిడీ

ABN , First Publish Date - 2022-01-13T06:59:56+05:30 IST

స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులను ఆర్థికంగా పరిపుష్ఠం చేస్తామన్న బైరిసన్స్‌ సంస్థ నిండాముంచింది. బడా వ్యాపారులుగా తీర్చిదిద్దుతామని, జిల్లా ప్రజలకు నాణ్యమైన సరుకులు తక్కువ ధరకే అంద జేస్తామని చెప్పి బురిడీ కొట్టించింది.

బైరిసన్స్‌.. బురిడీ

డ్వాక్రా మహిళలను బోల్తా కొట్టించిన బైరిసన్స్‌

స్టోర్స్‌ పేరిట మహిళల సొమ్ము గల్లంతు

చేతులెత్తేసిన డీఆర్‌డీవో అధికారులు


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-నల్లగొండ) : స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులను ఆర్థికంగా పరిపుష్ఠం చేస్తామన్న బైరిసన్స్‌ సంస్థ నిండాముంచింది. బడా వ్యాపారులుగా తీర్చిదిద్దుతామని, జిల్లా ప్రజలకు నాణ్యమైన సరుకులు తక్కువ ధరకే అంద జేస్తామని చెప్పి బురిడీ కొట్టించింది. ఉన్న ఊరిలో నెలకు రూ.25వేలకు తక్కువ కాకుండా ఆదాయం చూపిస్తామని అప్పుల ఊబిలోకి నెట్టింది. సరుకులు ఇవ్వడం, ఇతర పనులన్నీ తామే చూస్తామంటూ చెప్పి చివరికి చేతులెత్తేసింది. హంగు ఆర్భాటంగా స్టోర్స్‌ ప్రారంభించిన డీఆర్‌డీవో అధికారులు ఇప్పుడు ఆ ప్రైవేటు కంపెనీతోనే మాట్లాడుకోండి అంటూ ముఖం చాటేస్తున్నారు. 


జిల్లా నలుమూలల నుంచి మహిళలు ముందుకొచ్చి రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి స్టోర్స్‌ ప్రారంభించారు. నాణ్యమైన సరుకులు, తక్కువ ధరకు అందిస్తామని చెప్పడంతో మహిళలు ఆసక్తి చూపారు. ఈ ప్రయత్నం అంతా తమదే అంటూ నల్లగొండ జిల్లా డీఆర్‌డీవో అధికారులు గొప్పలకుపోయారు. ఆర్భాటంగా దుకాణాలు ప్రారంభించారు. తీరా చూస్తే నాసిరకం సరుకులు, వివిధ పేర్లతో పెట్టుబడి మాయం. బహిరంగ మార్కెట్‌కు మించి ధరలు నిర్ణయించడంతో ఎస్‌హెచ్‌జీ మహిళలు అప్పులపాలయ్యారు. ఇదేమిటని అధికారులను ప్రశ్నిస్తే ఆ ప్రైవేటు కంపెనీతోనే మాట్లాడుకోండి అంటూ సమాధానమిచ్చారు. డ్వాక్రా మహిళలకు ఆర్థిక చేయూతనిస్తామని బైరిసన్స్‌ అనే సంస్థ జిల్లా డీఆర్‌డీవో అధికారులతో ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌ కేం ద్రంగా పనిచేసే ఈ సంస్థ సభ్యులు తమకు భారీ వ్యాపారం ఉందని, జిల్లా డ్వాక్రా మహిళలు ఉత్పత్తి చేసే సరుకులను రాష్ట్ర వ్యాప్తంగా మార్కెటింగ్‌ చేస్తామని ప్రచారం చేశారు. ఇందుకు జిల్లా డీఆర్‌డీవో అధికారులు ముందుకొచ్చి మహిళలను వ్యాపార రంగం వైపు సిద్ధంచేశారు. కిరాణ స్టోర్స్‌ పెట్టుకునేవారు ఒకరు రూ.లక్ష బైరిసన్స్‌కు డిపాజిట్‌ చేయాలని, వివిధ రకాల వస్తువులు ఉత్పత్తి చేసేవారు, రాబోయే రోజుల్లో భారీ మొత్తంలో సరుకులు అందించాల్సిన నేపథ్యంలో ప్యాకింగ్‌ యంత్రాలు, వాహనాలు ఇతరత్రా కొనుగోలు చేయాలంటూ నిబంధనలు విధించారు. ఈ తరహా వ్యవస్థ జనగాం, నల్లగొండ జిల్లాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టినట్లు ప్రకటించారు. ప్రైవేటు సంస్థ, డీఆర్‌డీవో అధికారుల మాటలతో విశ్వాసం పెంచుకున్న ఔత్సాహికులు సుమారు 32 మండలాల నుంచి స్టోర్స్‌ తెరిచేందు కు ముందుకొచ్చారు. ఆ మేరకు డిపాజిట్‌ మొ త్తాన్ని కంపెనీకి అందజేశారు. మహిళలను ప్రోత్సహించాలన్న యోచనతో అధికారులు స్వయంగా వచ్చి ఆర్భాటంగా మహిళా స్టోర్స్‌ను ప్రారంభించారు. 


 ఏడాదిలోపే మాయం

ఒప్పందం మేరకు నాణ్యమైన సరుకులు, తక్కువ ధరకు మహిళా స్టోర్స్‌కు అందించాల్సి ఉండగా, జిల్లాలో అలా చేయలేదు. నాసిరకం సరుకులు టోకున కొనుగోలు చేసి అధిక ధరకు స్టోర్స్‌ సభ్యులకు సరఫరా చేశారు. మరోవైపు జిల్లా మహిళలు ఉత్పత్తి చేస్తున్న సరుకులు కొనుగోలు చేస్తామని ఒప్పందం చేసుకుని ఆ తర్వాత ఆ విషయాన్ని గాలికి వదిలేశారు. సభ్యుల నుంచి రూ.లక్ష వసూలు చేసిన బైరిసన్స్‌ అందుకు సంబంధించి చెప్పే లెక్కలతో సంఘం సభ్యులు విస్తుపోతున్నారు. వ్యాపార ప్రకటనల ఖర్చు రూ.5వేలు, వ్యాపారం చేసుకునేందుకు ఇచ్చిన సర్టిఫికెట్‌ ఖరీదు రూ.5,900, మూడు నాసిరకం ర్యాక్‌లు, ఒక టేబుల్‌ ఖరీదు రూ.30వేలు, ఒక ఫ్రిజ్‌.. రూ.10వేలు విలువైన కూ ల్‌డ్రింక్స్‌కు కలిపి రూ.43వేలుగా నిర్ణయించడంతో సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధి లభిస్తుందన్న యోచనతో రూ.3 వడ్డీ చొప్పున లక్షల రూపాయలు అప్పులు చేసిన సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.  



ఉన్న ఉపాధి పోయింది : సలీం, తిరుమలగిరి, నాంపల్లి మండలం 

నేను పిల్లలని చదివించుకుంటూ చండూరులో కుటుంబం వెల్లదీస్తున్నాను. అలాంటిది నెలకు రూ.25వేలు ఆదాయం చూపిస్తామ ని డీఆర్‌డీ ఓ అధికారులు, బైరిసన్స్‌ ఉద్యోగులు అరచేతిలో వైకుం ఠం చూపించారు. ఉన్న ఊరిలో (నీ భార్య పేరిట) ఉపాధి పొందం డి అనడంతో చండూరులో ఇల్లు ఖాళీ చేసి తిరుమలగిరికి వచ్చి స్టోర్స్‌ ప్రారంభించాం. ఎక్కడో బేగంబజారులో నాణ్యతలేని సరుకు తెచ్చి వాటికి కంపెనీ స్టిక్కర్లు అంటించి అధిక ధరకు మాకు సరుకులు వేస్తున్నారు. కిలో చక్కెర మాకు రూ.46కు ఇస్తున్నారు. బయట ఇంతకన్న నాణ్యమైన చక్కెర రూ.40కి లభిస్తుంది. నెలకు రూ.3 వడ్డీ చొప్పున రూ.1లక్ష అప్పుచేసి దుకాణం తెరిచాను. అప్పుల కుప్పఅయ్యింది. కలెక్టరే వచ్చి ప్రారంభిస్తే మా జీవితమే మారిపోయింది అని ఊహల్లో తేలిపోయా. 


ఇల్లు కుదవపెట్టి రూ.8లక్షలు అప్పు చేశా : నాగలక్ష్మీ, నకిరేకల్‌

ఉప్పు కానుంచి మొదలుపెడితే పిండి, కారం, జిలకర్ర ఇలా.. 55 రకాల వస్తువులు నేను ఉత్పత్తి చేస్తుంటాను. నా దగ్గరికి వచ్చి మాకు భారీగా సరుకులు సప్లయ్‌ చేయాలి అని ఒప్పందం చేసుకున్నారు. అన్ని వివరాలు తీసుకున్నారు. ఒక వ్యాన్‌, ప్యాకింగ్‌ మిషన్‌ అన్నీ సమకూర్చుకోండి, పెద్ద మొత్తంలో మీకు బిజినెస్‌ ఇస్తున్నాం అని బైరిసన్స్‌ సిబ్బంది, డీఆర్‌డీఓ అధికారులు వెంటపడ్డారు. దీంతో నా ఇంటిని కుదవపెట్టి రూ.8లక్షలు అప్పు తెచ్చాను. రెండుసార్లు మాత్రమే నాకు ఆర్డర్‌ ఇచ్చారు. నేను నెలకు రూ.30వేలు వడ్డీ కడుతున్నాను. 


విచారణ చేయిస్తా : కాళిందిని, డీఆర్‌డీవో పీడీ

ఇప్పటి వరకు ఈ విషయంపై ఎవరూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. ఈ విషయంపై విచారణకు అడిషనల్‌ పీడీని కేటాయిస్తున్నాను. విచారణ జరిపి, తగు చర్యలు తీసుకుంటాను. 


Updated Date - 2022-01-13T06:59:56+05:30 IST