MLA వర్సెస్ Byreddy.. భగ్గుమన్న విబేధాలు.. సర్దిచెప్పాల్సింది పోయి చిచ్చు పెట్టిన మంత్రి..!?

ABN , First Publish Date - 2022-01-14T16:32:12+05:30 IST

ఓ నాయకుడికి దగ్గరగా, మరో నాయకుడిని దూరంగా ఉంచుతూ సదరు నేతల మధ్య విభేదాలకు మరింత ఆజ్యం పోస్తున్నారట. ఇటీవల జిల్లా పర్యటనకు వెళ్లిన ఇన్‌ఛార్జి మంత్రి వ్యవహరించిన తీరుతో.. ఆ ఇద్దరు వైసీపీ నేతల మధ్య...

MLA వర్సెస్ Byreddy.. భగ్గుమన్న విబేధాలు.. సర్దిచెప్పాల్సింది పోయి చిచ్చు పెట్టిన మంత్రి..!?

కొంతకాలంగా అధికార వైసీపీకి చెందిన ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరికి సర్ది చెప్పి కలహాలకు చెక్ పెట్టాల్సిన మంత్రి... ఓ నాయకుడికి దగ్గరగా, మరో నాయకుడిని దూరంగా ఉంచుతూ సదరు నేతల మధ్య విభేదాలకు మరింత ఆజ్యం పోస్తున్నారట. ఇటీవల జిల్లా పర్యటనకు వెళ్లిన ఇన్‌ఛార్జి మంత్రి వ్యవహరించిన తీరుతో.. ఆ ఇద్దరు వైసీపీ నేతల మధ్య విభేదాలు మళ్లీ రాజుకున్నాయి. ఇంతకీ ఆ ఇద్దరు వైసీపీ నేతలు, సదరు మంత్రి ఎవరు? ఇదెక్కడి పరిణామం? అనే మరిన్ని విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..


నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జ్‌ బైరెడ్డి సిద్దార్థరెడ్డికి మద్దతు

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోట అయిన కర్నూలు జిల్లాలో, పార్టీలో తలెత్తే పరిస్థితులను, జిల్లా అభివృద్ధిని ప్రగతిపథంలో నడిపిస్తారని వైసీపీ అధినాయకత్వం రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను కొంతకాలం క్రితం జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా నియమించింది. అప్పటినుంచి మంత్రి అనిల్ జిల్లా పాలిటిక్స్‌పై పెద్దగా ఫోకస్ పెట్టకపోయినా... నందికొట్కూరు నియోజకవర్గంపై మాత్రం ప్రత్యేక దృష్టి సారించారనే టాక్ నడుస్తోంది. నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జ్‌ బైరెడ్డి సిద్దార్థరెడ్డికి మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్‌ పూర్తి స్థాయిలో మద్దతుగా వ్యవహరిస్తున్నారట. అభివృద్ధి పనుల కేటాయింపు, పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో సీట్లు, మార్కెట్ యార్డు ఛైర్మన్‌ల నియామకం వంటి విషయాల్లో బైరెడ్డి సిద్దార్ధరెడ్డి వర్గీయులకే  పెద్దపీట వేశారనే విమర్శలు భగ్గుమంటున్నాయి.


ఎమ్మెల్యే ఆర్థర్‌ వర్గాన్ని అనిల్ దూరం పెట్టారని చర్చ

మరోవైపు ఎమ్మెల్యే ఆర్థర్‌ వర్గాన్ని జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి అనిల్‌ దూరం పెట్టారని చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో జరిగిన పంచాయతీ ఎన్నికలు, పరిషత్‌ ఎన్నికల సమయంలోనే సీట్ల సర్దుబాటు విషయంగా కర్నూలులో మంత్రుల సమక్షంలోనే పంచాయితీ జరిగింది. ఇందులో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. సీట్ల విషయంలో లెక్కలు కొలిక్కిరాక బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి అనుచరులు, ఎమ్మెల్యే ఆర్థర్ అనుచరులు బాహాబాహీకి దిగారు. మంత్రుల కళ్లెదుటే సీట్ల కోసం ఘర్షణకు దిగడంతో వారు ఒకింత షాక్‌కు గురయ్యారు. మంత్రి అనిల్ కుమార్... బైరెడ్డి సిద్దార్ధరెడ్డి వర్గానికి సపోర్టుగా ఉండటమే ఘర్షణకు కారణమని అప్పట్లో జిల్లా వైసీపీలో జోరుగా చర్చ జరిగింది. 


ఎమ్మెల్యే ఆర్థర్, బైరెడ్డి సిద్దార్థ రెడ్డి వర్గాల మధ్య నెలకొన్న వివాదం

ఇక పంచాయతీ, పరిషత్ ఎన్నికలప్పుడు కూడా బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి, ఎమ్మెల్యే ఆర్ధర్ వర్గాల మధ్య గొడవలు జరిగాయి. ఎన్నికల తర్వాత కూడా అప్పుడప్పుడు ఇరువర్గాల మధ్య ఏదో ఒక విషయంలో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మంత్రి అనిల్ కుమార్ నందికొట్కూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఎమ్మెల్యే ఆర్థర్, బైరెడ్డి సిద్దార్థ రెడ్డి వర్గాల మధ్య నెలకొన్న విభేదాలకు మంత్రి అనిల్ చెక్ పెడతారని పార్టీ శ్రేణులు, ప్రజలు భావించారు. అయితే మంత్రి అనిల్ పర్యటనలో వారి అంచనాలు తలకిందులయ్యాయి. మంత్రి ప్రోగ్రామ్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఎమ్మెల్యే ఆర్థర్ ఫోటోలు కనిపించలేదు. దీంతో ఆయన వర్గీయులు తీవ్ర అసహనానికి గురయ్యారు.


నువ్వెంత అంటే- నువ్వెంత అంటూ కయ్యాని...

మంత్రి అనిల్ పర్యటనకు ఎమ్మెల్యే ఆర్థర్‌ను కూడా పిలవలేదనే చర్చ జరుగుతోంది. అనిల్ వ్యవహారశైలి నచ్చకనే ఎమ్మెల్యే ఆర్థర్ సైతం మంత్రి పాల్గొన్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లలేదట. ఇలా నందికొట్కూరు వైసీపీలో ఇద్దరు కీలక నేతల వర్గీయులు నువ్వెంత అంటే- నువ్వెంత అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. వారి మధ్య విభేదాలను పరిష్కరించి, పరిస్థితులను చక్కబెట్టాల్సిన మంత్రి అనిల్‌ మాత్రం... ఒక వర్గానికి దగ్గరై, మరో వర్గాన్ని పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 


మంత్రి అనిల్‌ దూరంగా ఉంచడం ఎంతవరకు సబబు?

నందికొట్కూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు స్థానం. 2014 ఎన్నికల్లో ఆర్ధర్ భారీ మెజారిటీతో గెలిచారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎమ్మెల్యే హోదాలో ఆర్థర్ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నందికొట్కూరు నియోజకవర్గంలోని వాడవాడలా బైక్‌పై తిరుగుతూ.. ప్రజలు కరోనా బారిన పడకుండా అప్రమత్తం చేశారు. ఇందుకు గాను ఆర్థర్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం దక్కింది. అలాంటి ఆయన్ను మంత్రి అనిల్‌ దూరంగా ఉంచడం ఎంతవరకు సబబు? అని ఆర్థర్‌ వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. అయినా దళిత ఎమ్మెల్యే కోటలో మంత్రి అనిల్‌ పెత్తనం ఏమిటని దళిత సంఘాల నాయకులు సైతం మండిపడుతున్నారు.


మంత్రి అనిల్ రానున్న రోజుల్లో ఎమ్మెల్యే ఆర్థర్‌ను దగ్గరకు తీసుకుంటారా?

మొత్తంమీద నందికొట్కూరు వైసీపీలో ఇద్దరు కీలక నేతల మధ్య నెలకొన్న పోరుకి మంత్రి అనిల్‌ తెరదించాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారు. మరి మంత్రి అనిల్ రానున్న రోజుల్లో ఎమ్మెల్యే ఆర్థర్‌ను దగ్గరకు తీసుకుంటారా? లేక ఆయన పట్ల ఇలాగే వ్యవహరిస్తారా? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

Updated Date - 2022-01-14T16:32:12+05:30 IST