ఉప ఎన్నికలకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2021-04-17T04:19:04+05:30 IST

రుపతి ఉప ఎన్నికలు శనివారం జరుగనుండడంతో శుక్రవారం స్థానిక జడ్పీ బాలుర ఉన్నతపాఠశాలలో ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామగ్రిని అందజేసి ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు.

ఉప ఎన్నికలకు సర్వం సిద్ధం
ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు, గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ్‌వర్మ, ఆసరా జేసీ బాపిరెడ్డి

భోజనాలు సక్రమంగా లేవని కలెక్టర్‌కు ఫిర్యాదు

 సబ్‌కలెక్టర్‌, కమిషనర్‌ మధ్య వాగ్వివాదం

గూడూరురూరల్‌, ఏప్రిల్‌ 16: తిరుపతి ఉప ఎన్నికలు శనివారం జరుగనుండడంతో శుక్రవారం స్థానిక జడ్పీ బాలుర ఉన్నతపాఠశాలలో ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామగ్రిని అందజేసి ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో 366 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వీటిలో 100 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలున్నట్లు గుర్తించామన్నారు. ఈ కేంద్రాల వద్ద 11 సీఐఎస్‌ఎఫ్‌, 7 ఏపీఎస్‌పీ బలగాలను అదనంగా ఉంచుతున్నామన్నారు. 94 కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్‌లు, 183 కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్‌, 28 కేంద్రాల్లో వీడియోగ్రఫీ ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 6 గంటల నుంచి మాక్‌పోల్‌ నిర్వహించనున్నామన్నారు. 28 మంది పీవోలు, 874 మంది ఏపీవోలు, 2100 మంది పోలింగ్‌ సిబ్బందిని నియమించామన్నారు. 

ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్‌, డీఐజీ....

స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎన్నికల ఏర్పాటును కలెక్టక్‌ చక్రధర్‌బాబు, గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ్‌వర్మ పరిశీలించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా పలు సూచనలు అందజేశారు. కార్యక్రమంలో ఆసరా జేసీ బాపిరెడ్డి, డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు. 

భోజనాలు సక్రమంగా లేవని ఉద్యోగులు ఆవేదన...

భోజనం, తాగునీటి వసతి సక్రమంగా లేవని ఎన్నికల విధులకు హాజరైన ఉద్యోగులు కలెక్టర్‌ చక్రధర్‌బాబు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. డ్యూటీలకు రాకపోతే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు, కానీ ఇక్కడ చూస్తే ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని వాపోయారు. దీంతో కలెక్టర్‌ ఉద్యోగులకు భోజనం, తాగునీటి వసతి సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. 

సబ్‌కలెక్టర్‌, కమినషర్‌ వాగ్వాదం....

ఉప ఎన్నికల ఏర్పాట్ల సందర్భంగా సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణకు, మున్సిపల్‌ కమిషనర్‌ వైవో నందన్‌ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎన్నికల సిబ్బందికి స్టేషనరీ పంపిణీలో జాప్యం జరుగుతోందని సబ్‌కలెక్టర్‌ సూచించడంతో, తాను కొవిడ్‌ కేసుల విషయమై సిబ్బందితో మాట్లాడుతున్నానని కమిషనర్‌  సమాధానమిచ్చారు. అయితు, ఎన్నికల విధులు నిర్వహించ లేనని రాతపూర్వకంగా విజ్ఞప్తి చేస్తే కలెక్టర్‌ దృష్టికి తీసుకెళతామని సబ్‌కలెక్టర్‌ అన్నారు.  ఇతర అధికారులు వచ్చి సర్దిజెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

నియోజకవర్గంలో 2,48, 222 మంది ఓటర్లు.....

ఈ ఉప ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గంలో 2, 48, 222మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1,21,083 మంది పురుషులు, 1,27,092 మంది మహిళలు, 47 మంది ఇతరులు ఉన్నారు. 

వెంకటగిరి(టౌన్‌): వెంకటగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 366 పోలింగ్‌ స్టేషన్లు, 44 రూట్లు ఏర్పాటు చేశామని రిటర్నింగ్‌ అధికారి సాంబశివారెడ్డి తెలిపారు.   142 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించామన్నారు. 183 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, 108 వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇద్దరు డీఎస్పీలు, 12 మంది సీఐలు, 18 మంది ఎస్‌ఐలు, 400 మంది కానిస్టేబుళ్లతో  బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ నాగమల్లేశ్వరరావు తెలిపారు. 

రాపూరు:  పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మండలంలో 39226 మంది ఓటర్లు ఉండగా 61 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. 





Updated Date - 2021-04-17T04:19:04+05:30 IST