రూ.25 వేలను తిరిగి తెచ్చిచ్చిన కరోనా భయం..!

ABN , First Publish Date - 2020-05-01T16:39:09+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన భయం అంతాఇంతా కాదు. ఆ భయం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి...

రూ.25 వేలను తిరిగి తెచ్చిచ్చిన కరోనా భయం..!

మధేపుర: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన భయం అంతాఇంతా కాదు. ఆ భయం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి బీహార్‌లో వెలుగుచూసిన ఈ ఘటనే తాజా ఉదాహరణ. రోడ్డుపై 10 రూపాయల నోటు కనిపిస్తేనే ఎవరూ చూడకుండా జేబులో వేసుకుని అక్కడి నుంచి మెల్లిగా జారుకునే రోజులివి. కానీ.. కళ్ల ముందు రోడ్డుపై నోట్ల కట్టలు కనిపించినా నాలుగు అడుగుల దూరంలో ఉండి నిల్చుని చూశారే తప్ప వాటిని ముట్టుకునే సాహసం చేయలేదంటే అది కరోనా వల్ల వచ్చిన భయమే.


బీహార్‌లోని సహర్స జిల్లాలో గజేంద్ర షా అనే ఒక వ్యాపారస్తుడు మధేపుర జిల్లాలో బైక్‌పై వెళుతూ ప్యాంట్ జేబులో నుంచి 25 వేల నోట్ల కట్ట జారిపోవడంతో డబ్బు పోగొట్టుకున్నాడు. అది గమనించకుండా ఓ షాపుకెళ్లి వస్తువులు కొన్న తర్వాత డబ్బు చెల్లించడానికి జేబు తడుముకోగా.. డబ్బు రోడ్డుపై పడిపోయినట్లు గ్రహించాడు.


వెంటనే వెనక్కి వెళ్లి చూడగా.. కరోనాను వ్యాప్తి చేయడానికి ఎవరో ఆ డబ్బును కావాలనే పడేసి వెళ్లారని భావించి స్థానికులు ఎవరూ డబ్బును తీసుకోలేదని అతనికి తెలిసింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు గజేంద్ర షాకు అక్కడున్న వారు చెప్పారు. పోలీస్ స్టేషన్‌లో గజేంద్ర షాను విచారించిన పోలీసులు ఆ డబ్బు అతనిదేనని నిర్ధారించుకున్న తర్వాత తిరిగి అతనికి ఆ డబ్బును అందజేశారు.

Updated Date - 2020-05-01T16:39:09+05:30 IST