ఆరుగంటలు ఆగిన బస్సులు

ABN , First Publish Date - 2022-07-05T05:02:29+05:30 IST

ఆరుగంటలు ఆగిన బస్సులు

ఆరుగంటలు ఆగిన బస్సులు
వికారాబాద్‌ డిపోలో ఆందోళనకు దిగిన కార్మికులు, నిలిచిన బస్సులు


  • ఆర్టీసీ ఉద్యోగుల మధ్య గొడవ.. డీఎం దృష్టికి వెళ్లడంతో ఒకరి సస్పెన్షన్‌
  •   నిరసనకు దిగిన ఆర్టీసీ కార్మికులు...డిపోకే పరిమితమైన బస్సులు
  •  పోలీసుల రంగప్రవేశం.. ఉన్నతాధికారులతో మాట్లాడిన డీఎం
  •  కొన్నిరోజుల తర్వాత సస్పెన్షన్‌ ఎత్తివేసేందుకు హామీ
  •  హామీతో విధుల్లోకి వెళ్లిన ఉద్యోగులు

వికారాబాద్‌, జూలై 4 : ఇద్దరు కండక్టర్ల మధ్య జరిగిన గొడవలో మరో కండక్టర్‌ కలగజేసుకోవడంతో.. అది కాస్తా డిపో మేనేజర్‌(డీఎం) దృష్టికి వెళ్లింది. దీంతో డీఎం ఓ కండక్టర్‌ను సస్పెండ్‌ చేశారు. దీనికి నిరసనగా తోటి కార్మికులు నిరసనగా దిగడంతో సుమారు ఆరు గంటలపాటు బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఈ ఘటన వికారాబాద్‌ ఆర్టీసీ డిపోలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్‌ ఆర్టీసీ డిపోలో కండక్టర్లుగా పనిచేసే పీఆర్సీ రెడ్డి, సుదర్శన్‌రెడ్డిలు జూన్‌ 12న గొడవపడ్డారు. ఈక్రమంలో జీవీకే రెడ్డి అనే మరో కండక్టర్‌ వారి గొడవ మధ్యలోకి దూరాడు. దీంతో రెండు రోజుల క్రితం ఆ ముగ్గురి గొడవ విషయం డీఎం దృష్టికి వెళ్లింది. ఆయన వెంటనే క్రమశిక్షణా చర్యల దృష్ట్యా సుదర్శన్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ముగ్గురూ గొడవపడితే.. ఒకరిని సస్పెండ్‌ చేయడం ఏమిటని, గొడవకు, ఉద్యోగానికి సంబంధం ఏమిటని, ఇంత చిన్న తప్పుకు సస్పెండ్‌ చేసి కండక్టర్‌ పొట్ట కొడుతారా? అంటూ.. సోమవారం ఉదయం ఆర్టీసీ కార్మికులందరూ నిరసన వ్యక్తం చే శారు. సస్పెన్షన్‌ ఎత్తివేసే వరకు బస్సులు నడిపేది లేదని డిపోలో ధర్నాకు దిగారు. దీంతో ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత ప్రయాణికులు ఇబ్బంది పడుతారని డీఎం మహేష్‌కుమార్‌ ఎంత చెప్పినా కార్మికులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎంతో మాట్లాడి సస్పెన్షన్‌ ఎత్తివేసే దిశగా చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరడంతో డీఎం సైతం సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారులతో మాట్లాడారు. కొన్ని రోజుల కాల వ్యవధిలో సస్పెన్షన్‌ ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆర్టీసీ కార్మికులు విధులకు వెళ్లారు.

Updated Date - 2022-07-05T05:02:29+05:30 IST