క్షణాల్లో కాలిపోయారు!

ABN , First Publish Date - 2022-05-18T06:26:15+05:30 IST

రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు టైరు ఒక్కసారిగా పేలింది. దీంతో అది అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీకొట్టింది. పెట్రోలు ట్యాంకు వద్ద మంటలు చెలరేగి కారుమొత్తాన్ని కమ్మేయడంతో క్షణాల్లో అందులో ఉన్న నలుగురు సజీవదహనమయ్యారు.

క్షణాల్లో కాలిపోయారు!
ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన కారు

ఎవరూ ఏం చేయలేని పరిస్థితి

కారు ప్రమాదంలో నలుగురు సజీవదహనం

వారిలో రెండేళ్ల చిన్నారి 

అందరిదీ తిరుపతి 

మార్కాపురం, మే 17 : రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు టైరు ఒక్కసారిగా పేలింది. దీంతో అది అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీకొట్టింది. పెట్రోలు ట్యాంకు వద్ద మంటలు చెలరేగి కారుమొత్తాన్ని కమ్మేయడంతో క్షణాల్లో అందులో ఉన్న నలుగురు సజీవదహనమయ్యారు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలతో కనీసం ఎవ్వరూ ధైర్యం చేసి కాపాడలేని పరిస్థితి. అతివేగంతోపాటు వేసవి ఎండ తోడుకావడం, గమ్యం చేరేందుకు ఆగకుండా ప్రయాణం వారిని అనంతలోకాలకు తీసుకెళ్లిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే కారుకు మంటలు అంటుకోవడం, సెంటర్‌లాక్‌ సిస్టంతో లోపలి వారు బయటకు రాలేకపోవడం కూడా  తీవ్రత పెరగడానికి ఒక కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘోరం మార్కాపురం మండలం తిప్పాయపాలెం వద్ద అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది. 


ఏం జరిగిందంటే.. 

 తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన కటారి సత్యనారాయణ కుమారుడు బాలాజి(22), రావూరి భాస్కర్‌ కుమారుడు తేజ(23), సైకిల్‌ మెకానిక్‌ షాపు నిర్వాహకుడు మస్తాన్‌ కుమారుడు ఇమ్రాన్‌(21) స్నేహితులు. తేజకు ఇటీవల తన భార్యతో మనస్పర్థలు తలెత్తడంతో రెండేళ్లలోపు వయసున్న పాపను తన దగ్గరే వుంచుకున్నాడు. ఇమ్రాన్‌ పల్నాడు  జిల్లా దాచేపల్లిలోని ఓ ట్రావెల్స్‌లో డ్రైవరుగా పనిచేస్తున్నాడు. ఉద్యోగం కోసం వెళుతున్నామని చెప్పి బాలాజీ, తేజ ఇళ్ల వద్ద బయల్దేరారు. వీరికి ఇమ్రాన్‌ జత కలిశాడు. ఈ ముగ్గురు స్నేహితులూ మంగళవారం మధ్యాహ్నం ఏపీ 39డీఈ6450 హుండాయ్‌ కారులో తిరుపతి నుంచి కడప మీదుగా బయల్దేరారు. ప్రకాశం జిల్లా తిప్పాయపాలెం సమీపంలోని మిట్టమీదపల్లె అడ్డరోడ్డు వద్ద సాయంత్రం 6గంటల సమయంలో కారు టైర్‌ పేలిపోయింది. అదుపు తప్పిన కారు మార్కాపురం వైపు నుంచి చేపల లోడుతో వెళు తున్న కేఏ14సీ2945 కంటైనర్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో కారులోని పెట్రోల్‌ ట్యాంక్‌ వద్ద మంటలు చెలరేగాయి. బాలాజి, ఇమ్రాన్‌తోపాటు తేజ అతని రెండేళ్ళ కుమార్తె మంటల్లో చిక్కుకొన్నారు. విషయం తెలుసు కున్న మార్కాపురం సీఐ ఆంజనేయరెడ్డి, కంభం ఫైరాఫీసర్‌ దుర్గాప్రసా ద్‌లు ఫైరింజన్‌తో ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అప్పటికే కారులో ఉన్న వారందరూ సజీవ దహనమయ్యారు. కారు నెంబర్‌ ఆధారంగా పోలీసులు చేసిన ప్రాఽథమిక విచారణలో కారు రొంపిచర్ల మండలం ఆదినవారిపల్లికి చెందిన ఏటిమరపు నరేంద్రదిగా గుర్తించారు. ఎస్సైలు సుమన్‌, నాగమల్లేశ్వరరావులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.  భాకరాపేట సీఐ తులసీరామ్‌ కంభం పోలీసులతో మాట్లాడి మృతుల తల్లిదండ్రులను అక్కడికి పంపే ఏర్పాట్లు చేశారు.   


Updated Date - 2022-05-18T06:26:15+05:30 IST