ఖమ్మం జిల్లాలో సాగర్‌ ఎడమకాలువకు బుంగ

ABN , First Publish Date - 2020-10-15T06:58:23+05:30 IST

నాగార్జునసాగర్‌ ఎడమకాలువకు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెం సమీపంలోని ఇన్‌ఫాల్‌ కేనాల్‌కు చిన్న

ఖమ్మం జిల్లాలో సాగర్‌ ఎడమకాలువకు బుంగ

కూసుమంచి, అక్టోబరు 14: నాగార్జునసాగర్‌ ఎడమకాలువకు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెం సమీపంలోని ఇన్‌ఫాల్‌ కేనాల్‌కు చిన్న బుంగ పడింది. దీంతో అధికారులు నీటిసరఫరాను నిలిపేశారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు కాల్వకట్టకు ఉన్న మట్టిని స్థానికులు తోడుకెళ్లడంతో ఈ కట్ట బలహీనపడిందని, దాని వల్లే బుంగపడిందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఆబుంగ మరింత పెద్దది కాకుండా ఉండేందుకు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రంగులబ్రిడ్జివద్ద గల ఎస్కేప్‌ లాకులను ఎత్తి అధికారులు నీటిని దిగువకు వదిలివేశారు. బుంగపడిన ప్రాంతాన్ని పరిశీలిచిన ఉన్నతాధికారులు వెంటనే బుంగను పూడ్పించేలా చర్యలు చేపట్టారు. 


అయితే నాయకన్‌గూడెం సమీపంలో సాగర్‌ ఎడమకాల్వకు బుంగపడగా.. అది పెద్దది కాకుండా ఎస్కేప్‌ లాకులు ఎత్తి నీటిని దిగువకు వదలడంతో ఆయకట్టులోని పంటలు నీటమునిగాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. వరి పొట్టదశలో ఉండటం, మరో నెలరోజుల్లో కోతకు రానుండటంతో తీవ్ర నష్టం వాటిల్లిందని, దీనిని పట్టించుకోకుండా అధికారులు అనాలోచితంగా నీటిని దిగువకు వదలడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తాము ఎన్నెస్పీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని పలువురు రైతులు పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-15T06:58:23+05:30 IST