పాకిస్థానీ గానకోకిలకు అశ్రునయనాలతో తుది వీడ్కోలు!

ABN , First Publish Date - 2022-08-23T01:46:14+05:30 IST

ప్రముఖ గాయని, పాకిస్థాన్‌ గానకోకిల నయ్యారా నూర్(Nayyara Noor) అశేష సంగీతాభిమానులను శోకసంద్రంలో వదిలి తిరిగిరాని లోకాలకు తరలిపోయారు.

పాకిస్థానీ గానకోకిలకు అశ్రునయనాలతో తుది వీడ్కోలు!

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ గాయని, పాకిస్థాన్‌(Pakistan) గానకోకిల నయ్యారా నూర్(Nayyara Noor) అశేష సంగీతాభిమానులను శోకసంద్రంలో వదిలి తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. ఆమె అంత్యక్రియలు ఆదివారం పూర్తయ్యాయి. వేల మంది అభిమానులు ఆమె అంతిమయాత్రలో పాల్గొని సుమధుర గాయనికి తుది వీడ్కోలు పలికారు. దాదాపు ఏడాదిన్నరగా క్యాన్సర్‌తో పోరాడిన ఆమె కరాచీ(Karachi) నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ రాజకీయనాయకులు, జర్నలిస్టులు, సంగీతాభిమానులు తండోపతండాలకు ఆమె అంతిమయాత్రలో పాల్గొన్నారు. యావత్ దేశం ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికింది. 


బుల్‌బుల్-ఏ-పాకిస్థాన్(Bulbul-e-Pakistan- పాకిస్థాన్ గానకోకిల)గా పేరు పొందిన నయ్యారా నూర్‌కు(71).. భారత్, పాకిస్థాన్‌లలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. తన గాత్ర మాధుర్యంతో నయ్యారా సంగీతాభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆ సుమధుర గాయని జన్మించింది భారత్‌లోనే! 1950 నవంబర్‌లో అసోంలోని గువహటీ నగరంలో ఆమె జన్మించారు. పాకిస్థాన్ ఏర్పడ్డ కొన్నేళ్లకు కుటుంబంతో సహా ఆమె కరాచీ నగరానికి పయనమయ్యారు. లాహోర్‌లోని ప్రఖ్యాత నేషనల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌లో(National College of Arts) ఆమె కాలేజీ విద్యను అభ్యసించారు. అక్కడే నూర్ గాత్రప్రావీణ్యం బయటపడింది. 1960వ దశకం చివర్లో టీవీ కార్యక్రమాలతో ఆమె ప్రాచుర్యం పొందారు. పాకిస్థాన్ రేడియోలో పాడుతూ తన కెరీర్ ప్రారంభించిన నూర్ ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ టీవీ రంగంలో కాలుపెట్టి ఆపై సినీ నేపథ్యగాయనిగా సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించారు. తాల్ మతోల్, సచ్ ఘుప్ వంటి టీవీ కార్యక్రమాలతో ఆమె తొలుత దేశవ్యాప్త గుర్తింపు పొందారు. ఆపై..ఘరనా, తాన్సేన్ లాంటి సినిమాలలో నేపథ్యగాయనిగా వెండితెరకూ పరిచయమయ్యారు. 


నాలుగు దశాబ్దాలకు పైబడి సాగిన నయ్యారా కెరీర్‌లో ఆమె ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలను పాడారు. నూర్ ఆలపించిన ‘వో జో హమ్‌ మే తుమ్ మే ఖరార్ థా’, ‘కభీ హమ్ భీ ఖుబ్సూరత్ థే’, ‘వతన్ కీ మిట్టీ గవాహ్ రెహ్నా’ వంటి పాటలను సంగీతాభిమానులు ఇప్పటికీ పాడుకుంటూ ఉంటారు. విప్లవకవి ఫయాజ్ అహ్మద్ ఫయాజ్ కవితల్ని వినసొంపుగా, సుమనోహరంగా ఆమె పాడిన తీరు సంగీతప్రియుల మనసులపై చెరగని ముద్రవేసింది.


కవిత్వం, సంగీతంపై సమపాళ్లల్లో అనురక్తి కలిగిన గాయని నూర్. ఆమె గొంతు నుంచి జాలువారిన ‘మేరే కాతిల్ మేరే దిల్దార్ మేరే పాస్ రహో’, ‘ఆజ్ బాజార్‌ మే పబిజోన్లా చలో’ వంటి పాటలు అటు సాహిత్యాభిమానులు, ఇటు సంగీత ప్రియులను కదిలించాయి. పాక్ దేశభక్తిగీతాలను కూడా నూర్ ఆలపించారు. సంగీతంలో ఎటువంటి శిక్షణ లేని నూర్.. స్వతసిద్ధంగా అలవడిన కళతోనే వేలసంఖ్యలో అభిమానుల్ని సంపాదించారు. సంగీతంపై భక్తిశ్రద్ధలు కలిగిన విద్యార్థిలా ఆమె.. అప్పటి ప్రముఖ కళాకారులైన లతామంగేష్కర్, బేగమ్ అఖ్తర్, కన్నన్ దేవిల స్ఫూర్తితో తన కళకు మెరుగులు దిద్దుకున్నారు. అయితే..నూర్ గాత్రంలోని ప్రత్యేకతే ఆమెకు అసంఖ్యాకంగా అభిమానులను సంపాదించి పెట్టింది. ఎందరి మనసుల్లోనే సుస్థిర స్థానం దక్కేలా చేసింది. సంగీత ప్రపంచానికి నూర్ చేసిన సేవలకు గాను పాకిస్థాన్ ప్రభుత్వం ఆమెను 2006తో బుల్‌బుల్-ఏ-పాకిస్థాన్ బిరుదుతో సత్కరించింది. అదే సంవత్సరం ఆమెను ప్రైడ్ ఆఫ్ పర్‌ఫార్మెన్స్(Pride of Performance) అవార్డు కూడా వరించింది. అయితే.. 2012లో ఆమె కెరీర్‌కు ముగింపు చెప్పారు.


నూర్ ఇకలేరన్న వార్తతో యావత్ సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. సంగీత జగత్తుకు పూడ్చుకోలేని నష్టం జరిగిందని పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ గానకోకిలకు నివాళులు అర్పించారు. ఇతర ప్రముఖులు కూడా ఆమె మృతిపట్ల సంతాపం తెలిపారు. నూర్ ఇకలేరని తెలిసి తన గుండె పగిలిందని ప్రముఖ పాకిస్థానీ సింగర్ అలీ జాఫర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మనందరి గానకోకిల అని వ్యాఖ్యానించారు. 


Updated Date - 2022-08-23T01:46:14+05:30 IST