నిర్మించు... అప్పగించు!!

ABN , First Publish Date - 2022-05-18T07:14:04+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) పనితీరు వివాదాస్పదంగా మారింది.

నిర్మించు... అప్పగించు!!

ఇదే పర్యాటకాభివృద్ధి సంస్థ విధానం

ప్రైవేటు సేవలో తరలిస్తున్న ఏపీటీడీసీ

తొట్లకొండ బీచ్‌లో ఏర్పాటుచేసిన రెస్టారెంట్‌ రాజకీయ నేతలకు అప్పగింత

రుషికొండ సమీపంలోని బీచ్‌ విలేజ్‌ కూడా ప్రైవేటు వ్యక్తుల పాలు

భీమిలి బీచ్‌రోడ్డులో కంటెయినర్‌ రెస్టారెంట్‌దీ అదే పరిస్థితి

తాజాగా తెన్నేటి పార్కును ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలని ప్రతిపాదన 


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) పనితీరు వివాదాస్పదంగా మారింది. కోట్ల రూపాయలు వెచ్చించి పర్యాటక శాఖ నిర్మిస్తున్న వాటిని నిర్వహణ కోసం ఏపీటీడీసీకి అప్పగిస్తే...వారు నిర్వహించలేక చేతులెత్తేస్తున్నారు. అక్కడితో ఆగకుండా ప్రైవేటుకు అప్పగించినా ఆశించిన ఆదాయం తేలేకపోతున్నారు. చివరకు పర్యాటకాన్ని...పరాయివారికి ఆదాయ వనరుగా మారుస్తున్నారు. 

తొట్లకొండ బీచ్‌ను పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దారు. రెస్టారెంట్‌ ఏర్పాటుచేశారు. ఇంకా పలు హంగులు అద్దారు. నిర్వహించకుండా రాజకీయ నేతల చేతికి ఇచ్చేశారు. వారు నామమాత్రపు అద్దె చెల్లిస్తూ బ్రహ్మాండమైన వ్యాపారం చేసుకుంటున్నారు.

- రుషికొండ సముద్ర తీరాన బీచ్‌ విలేజ్‌ పేరుతో ఒక గ్రామం ఏర్పాటుచేశారు. దానిని కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. అక్కడా మంచి వ్యాపారం జరుగుతోంది. అక్కడ వచ్చే ఆదాయానికి ఏపీటీడీసీకి వచ్చే అద్దెలకు పొంతన కనిపించడం లేదు. 

- భీమిలి మార్గంలో మూడేళ్ల క్రితం కంటెయినర్‌ రెస్టారెంట్‌ ఒకటి నిర్మించారు. రోడ్డును ఆనుకొని, పార్కింగ్‌ సదుపాయంతో చక్కటి లొకేషన్‌లో ఉంది. దానిని సంస్థే నడపవచ్చు. కానీ ప్రైవేటుకు ఇచ్చేశారు. 

- అరకులోయలో డ్రైవ్‌ ఇన్‌ రెస్టారెంట్‌ నిర్మించారు. నిర్వహించలేక పక్కన పెట్టేశారు. దానినీ ప్రైవేటుకు ఇవ్వాలనుకున్నారు. అయితే అందుకు గిరిజనులు అంగీకరించడం లేదు. దానిని అలాగే వదిలేయడంతో కోట్ల రూపాయల వ్యయం వృథాగా మారింది. 

పర్యాటక ప్రాజెక్టులను నిర్వహించే సమర్థత, సిబ్బంది లేనప్పుడు వాటి జోలికి పోకుండా ప్రైవేటు సంస్థలకే అవకాశం ఇస్తే, వారే నిధులు సమకూర్చుకొని ముందుకు వెళతారు. కానీ పర్యాటక శాఖ ఇంకా తప్పటడుగులు వేస్తోంది. సొంత నిధులు పెట్టి చక్కటి ఆస్తులు సమకూర్చుకుంటోంది. వాటిని ఇతరుల చేతుల్లో పెట్టి నామమాత్రపు ఆదాయంతో సరిపెట్టుకుంటోంది. ఇదో పెద్ద దోపిడీ వ్యవస్థలా మారిపోయింది.


తెన్నేటి పార్కు ప్రతిపాదనపై విమర్శల వెల్లువ

సొంత ఆస్తులనే నిర్వహించుకోలేని ఏపీటీడీసీ తాజాగా తెన్నేటి పార్కును తమకు ఇవ్వాలని వీఎంఆర్‌డీఏని కోరడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ లాభదాయకం కాదని తెలిసినప్పుడు పక్కకు తప్పుకోకుండా, ప్రైవేటు సంస్థకు లబ్ధి చేకూర్చడానికి తెన్నేటి పార్కును తమకు ఇవ్వాలని కోరడం, దానిని బంగ్లాదేశ్‌ నౌకను కొన్న సంస్థకు ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలపై పర్యావరణ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీఎంఆర్‌డీఏ అధికారులు కూడా ఈ ప్రతిపాదనను తిరస్కరించకుండా ప్రభుత్వానికి పంపడం సరికాదని పలువురు అధికారులు సూచిస్తున్నారు. శిథిల నౌకను రెస్టారెంట్‌గా మార్చే ప్రతిపాదనను తిరస్కరించి, జీవీఎంసీ ఎటువంటి వ్యాపార అనుమతులు ఇవ్వకూడదని స్థానిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Updated Date - 2022-05-18T07:14:04+05:30 IST