భవనాలు పాడుబడి

ABN , First Publish Date - 2022-04-30T06:11:49+05:30 IST

‘పాఠశాలల స్వరూపం పూర్తిగా మారిపోతోంది.

భవనాలు పాడుబడి
ప్యాపిలి: పాఠశాల పైకప్పు పెచ్చులూడిన దృశ్యం

  1. శిథిలావస్థలో పాఠశాలల భవనాలు
  2. పెచ్చులూడుతున్న పైకప్పులు
  3. గాయపడుతున్న విద్యార్థులు 
  4. గోనెగండ్ల ఘటనతో భయాందోళన
  5. తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు

‘పాఠశాలల స్వరూపం పూర్తిగా మారిపోతోంది. నాడు-నేడుతో అత్యాధునిక వసతులు సమకూరుస్తు న్నాం...పాఠశాలల పరిసరాలను అందంగా తీర్చిదిద్దుతున్నాం’...ఇదీ సర్కారు పెద్దల మాట.

  శిథిల భవనాలు. పెచ్చులూడుతున్న పైకప్పులు. బిక్కుబిక్కుమంటూ విద్యార్థుల చదువులు. బడికి వెళ్లిన పిల్లలు మళ్లీ ఇంటికి వచ్చే వరకూ ఆందోళనతో తల్లిదండ్రుల ఎదురుచూపులు...ఇదీ జిల్లాలోని వాస్తవ పరిస్థితి.

   గోనెగండ్లలోని అచ్చకట్ల వీధిలో గల అప్పర్‌ ప్రైమరీ ఉర్దూ పాఠశాలలో పెచ్చులు ఊడిపడి గురువారం ఇద్దరు విద్యార్థులు గాయపడిన సంఘటన దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. జిల్లాలోని అత్యధిక పాఠశాలల్లో ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లో ఒకే ఇరుకు గదిలో రెండు, మూడు తరగతులు నిర్వహిస్తున్న ఉదంతాలూ ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని పాఠశాలల స్థితిగతులను పరిశీలిస్తే...


 గోనెగండ్ల:  మండలంలోని అనేక పాఠశాలల్లో పైకప్పుల పెచ్చులు ఊడిపడుతున్నాయి. ఎప్పుడు  ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అయ్యకొండ  ప్రాథమిక పాఠశాలలో నాలుగేళ్లుగా పైకప్పు పెచ్చులూడుతున్నాయి. నాడు-నేడు కింద ఎంపికైనప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. అలువాల, కులుమాల ఎర్రబాడు, ఒంటెడుదిన్నె గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు.  

 ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే..

 గోనెగండ్ల: ఉర్దూ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యా యుల నిర్లక్ష్యం వల్లనే గురువారం విద్యార్థులు గాయపడ్డారని  సమగ్రశిక్ష ఆదనపు ప్రాజెక్టు అధికారి వేణుగోపాల్‌ అన్నారు. శుక్రవారం ఆయన గోనెగండ్లలోని ఉర్దూ పాఠశాలను సందర్శించారు. రాళ్లు ఊడిన గోడను, ప్రమాదకరంగా ఉన్న పైకప్పును పరిశీలించారు. సంఘ టన వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసు కున్నారు. 2011-12లో రెండు గదులు, 2014-15లో ఒక అదనపు గది మంజూరైంది. స్థలాభావంతో నూతన గదులు నిర్మించలేకపోయారని తెలిపారు. ఉర్దూ పాఠ శాలకు 8 సెంట్ల స్థలం మంజూరు చేయించేందుకు ఎంఈవో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా... విద్యార్థులు గాయపడిన ఘటనలో నిర్లక్ష్యానికి కార ణమైన ఎంఈవోపై చర్యలు తీసుకోవాలని విద్యార్ధి సంఘాల నాయకులు పీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, తహసీల్దార్‌ వేణుగోపాల్‌ పాల్గొన్నారు. 

ఆత్మకూరురూరల్‌ :  బాపనంతాపురం మండల పరిషత పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో విదార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఓ గదిలో పైపెచ్చులూడి పడుతున్నాయి. ఇక్కడ మొత్తం 60 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.  

బనగాన పల్లె: బనగానపల్లె మండలంలోని తిమ్మాపురం ప్రాథమిక పాఠశాలలో ఉన్న రెండు గదులు  కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. మూడేళ్ల కిందటే పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. వర్షం వస్తే  గదులు కారుతున్నాయి. 74 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.  ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. నాడు-నేడు కింద రూ.24లక్షలు మంజూరైనా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. 

ఎమ్మిగనూరు టౌన: ఎమ్మిగనూరు మండలంలో  దాదాపు 32 పాఠశాలలు శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు భయం భయంగా చదువులు కొనసాగిస్తున్నారు. ఈ పాఠశాలల్లో పైకప్పులు ప్రమాదకరంగా మారాయి. పాఠశాలల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని పలుమార్లు కోరినా ఫలితం కనిపించడం లేదని ఉపాధ్యాయులు అంటున్నారు. 

 హొళగుంద:  నాగరకన్వి ప్రాథమిక పాఠశాల భవనం పెచ్చులూడిపోతోంది. ఇనుపకడ్డీలు తేలి కూలేందుకు సిద్ధంగా ఉంది. ఈ పాఠశాలలో 21 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరు బడిలో కూర్చోవడానికి భయపడుతున్నారు. తరగతులను ఆరుబయట చెట్ల కింద నిర్వహిస్తున్నారు. అన్ని తరగతులకు ఒకే ఒక్క ఉపాధ్యాయురాలు పాఠాలు చెబుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. 

ఆలూరు: ఆలూరు మండలం మొలగవల్లి కొట్టాల గ్రామ మండల పరిషత ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు వంద మంది విద్యార్థులు ఉన్నారు. పాత భవనం కావడంతో పైకప్పు పెచ్చులూడిపోయింది. కడ్డీలు తేలడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళన మధ్య గడుపుతున్నారు. 

 ఆదోని(అగ్రికల్చర్‌): ఆదోని పట్టణంలోని విక్టోరియా పేట 18వ వార్డు పురపాలక ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది.  మొదటి విడత నాడు-నేడు కింద రూ.21 లక్షలు పాఠశాలకు ఖర్చు చేశారు.  రెండో విడత 5 తరగతి గదులు నిర్మించేందుకు రూ.60 లక్షలు మంజూరైందని పాఠశాల ఇనచార్జి ప్రధాన ఉపాధ్యాయురాలు ఝాన్సీరాణి తెలిపారు.  తరగతి గదిలో పెచ్చులు ఊడి కిందపడకుండా పైపై పనులు చేసి చేతులు దులుపుకున్నారు. ఈ పాఠశాలలో 306 మంది విద్యార్థులు చదువుతున్నారు. కేవలం నాలుగు గదులు మాత్రమే ఉన్నాయి. ఇందులో రెండు గదులు పూర్తిగా శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలిపోతాయోనని విద్యార్థులు, ఉపాధ్యాయులు భయపడుతున్నారు.

  కోడుమూరు (రూరల్‌): కొత్తూరు, కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలల్లో గదుల కొరత నెలకొంది. కొన్ని గదుల పైకప్పులు పెచ్చులు ఊడుతుండడంతో వాటికి తాళం వేశారు. దీంతో అరకొర వసతుల మధ్య విద్యార్థులకు బోధన సాగిస్తున్నారు. కొత్తూరు ప్రాథమిక పాఠశాలలో ఒక గదిలో పెచ్చులు ఊడుతున్నాయి. దీంతో మరో గదిలో 1 నుంచి 5 తరగతులను నిర్వహిస్తున్నారు. సుమారు 50 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలోనూ దాదాపు అదే పరిస్థితి ఉంది. మూడు తరగతి గదుల్లో ఓ గది శిథిలం కావడంతో పూర్తిగా మూసివేశారు.  

మంత్రాలయం:  సూగూరు డిపెప్‌ ప్రాథమిక పాఠశాలలో మూడు గదుల్లో పెచ్చులు ఊడిపడుతుండటంతో మూసివేశారు. ఉన్న రెండు గదుల్లో ఐదు తరగతులకు విద్యాబోధన చేస్తున్నారు. 217 మంది విద్యార్థులు ఉండగా.. దాదాపు 205 మంది హాజరవుతున్నారు. 200 మందికి రెండు గదుల్లో ఐదు తరగతులు, నలుగురు ఉపాధ్యాయులు విద్యాబోధన చేయడంతో తరగతి గదులంతా విద్యార్థులతో కిక్కిరిశాయి. ఈ పాఠశాలకు నాడు-నేడు కింద  రూ.20లక్షలు మంజూరు చేశారు. 

ప్యాపిలి: ప్యాపిలి పట్టణం డౌనసీ్ట్రట్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. 104 మంది విద్యార్థులున్న పాఠశాలలో ఆరు తరగతి గదులు ఉన్నాయి. అందులో 4 గదుల పైకప్పులు పూర్తిగా పెచ్చులూడాయి. గత ఐదారేళ్లుగా పరిస్థితి ఇలా ఉన్నా ఎవరు పట్టించుకోలేదు. కనీసం ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న నాడు-నేడు జాబితాలోనూ పాఠశాలను జాబితాలో చేర్చకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.  

శిరివెళ్ల:  యర్రగుంట్ల ఉర్దూ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 132 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలో మూడు తరగతి గదులు ఉన్నాయి. ఓ తరగతి గదిలో పైకప్పు పెచ్చులూడి ఇనుప కడ్డీలు బయటపడ్డాయి. ఎప్పుడు పెచ్చులూడి పడతాయోనని విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురవుతున్నారు. విద్యార్థులను తరగతి గదిలో ఓ పక్కన కూర్చోబెట్టి ఉపాధ్యాయులు చదువు చెబుతున్నారు.   

 చాగలమర్రి:   గొట్లూరు ప్రాథమిక పాఠశాలలో 42 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాలలోని పైకప్పు పెచ్చులూడి పడటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యాయులు ముందస్తుగా ఓ తరగతి గదికి తాళం వేసి వరండాలో విద్యాబోధన సాగిస్తున్నారు. ఐదు తరగతులకు ఒక  గది మాత్రమే ఉంది. పాఠశాలలో తాగునీరు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.  

పగిడ్యాల:పడమర ప్రాతకోట, వనములపాడు గ్రామాల్లోని పాఠశాలల తరగతి గదులు పెచ్చులూడి పడుతున్నాయి.   పడమర ప్రాతకోటలోని ఎంపీపీ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు సుమారు 161 మంది విద్యార్థులు ఉన్నట్లు ప్రధానోపాధ్యాయుడు ఇస్మాయిల్‌ తెలిపారు. 5 తరగతి గదుల్లో మూడు శిథిలావస్థకు చేరుకున్నాయి. పైకప్పు పెచ్చులు ఊడిపడుతున్నాయి.  వర్షాకాలంలో విద్యార్థులపై పెచ్చులాడినడిన సంఘటనలు కూడా ఉన్నాయి. రెండో విడత నాడు- నేడు కింద పాఠశాల ఎంపిక కావడంతో రూ. 16 లక్షలు మంజూరైనట్లు ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. ఈ నిధులతోనైనా పాఠశాల పరిస్థితి మారుతుందేమో చూడాలి.

కొత్తపల్లి: నాగంపల్లి మండల పరిషత పాఠశాల భవనం పైకప్పు పెచ్చులూడి పోతోంది. ఈ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు 40 మంది విద్యార్థులకు బోధిస్తున్నా రు. పాఠశాల పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. 



Updated Date - 2022-04-30T06:11:49+05:30 IST