బడ్జెట్...‌ ప్రకటనలకే పరిమితం!

ABN , First Publish Date - 2021-01-27T05:58:12+05:30 IST

విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోంది.

బడ్జెట్...‌ ప్రకటనలకే పరిమితం!

కొత్త రైల్వే జోన్‌కు గత ఏడాది ప్రకటించింది రూ.170 కోట్లు

ఇచ్చింది రూ.3 కోట్లే

ఈ ఏడాదైనా పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తారా?


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల పోరాటం, బీజేపీ ఎన్నికల హామీ కారణంగా 2019 ఎన్నికలకు ముందు కొత్త జోన్‌ ఏర్పాటుచేస్తామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. కొత్త జోన్‌కు దాదాపు రూ.200 కోట్లు అవసరం కాగా మొదటి బడ్జెట్‌లో కేవలం వేయి రూపాయలు మాత్రమే కేటాయించారు. పెద్దఎత్తున విమర్శలు రావడంతో జోన్‌ పేరుతో ఖాతా తెరవడానికి అలా చేస్తారని సమర్థించుకున్నారు. ఆ తరువాత ఏడాది బడ్జెట్‌ (2020-21)లో వాల్తేరు డివిజన్‌లో వివిధ అభివృద్ధి పనులకు సుమారు రూ.1,145 కోట్లు కేటాయించారు. అందులో రూ.170 కోట్లు కేవలం కొత్త జోన్‌ కోసమేనని ప్రకటించారు. కొత్తగా వచ్చే దక్షిణ కోస్తా జోన్‌లో వాల్తేరు డివిజన్‌ స్థానంలో వచ్చే రాయగడ డివిజన్‌ అభివృద్ధికి కూడా ఇందులో నిధులు వున్నాయని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి, 2021తో ముగిసిపోతోంది. ఇప్పటివరకు జోన్‌ కోసం కేవలం రూ.3 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. వీటితో ఏమి చేయాలో అర్థంకాక అధికారులు మౌనం దాల్చారు. కొత్త జోన్‌కు సంబంధించిన అవసరాలు, వనరులపై ప్రత్యేక అధికారి 2019 చివరిలోనే పూర్తి నివేదికను రైల్వే బోర్డుకు అందజేశారు. ఏడాదిన్నర అయినా దానిని ఇంకా అధ్యయనం చేయలేదనే రైల్వే వర్గాలు చెబుతున్నాయి. అనేక వివాదాల నడుమ ప్రకటితమైన కొత్త జోన్‌కు నిధులు సమకూర్చకపోవడం, కీలక నిర్ణయాలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రాంత నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై పెద్దగా స్పందించడం లేదు. జోన్‌ ప్రకటించారు కదా? అంటున్నారే తప్ప పనులు ప్రారంభించి, కార్యకలాపాలు కొనసాగించేందుకు ఏ ఒక్కరూ ప్రయత్నించడం లేదు. కొత్త ఆర్థిక సంవత్సరం 2021-22కి సంబంధించిన బడ్జెట్‌ను ఈ ఫిబ్రవరిలో ప్రవేశపెట్టనున్నారు. ఈసారైనా కొత్త జోన్‌కు సంబంధించి పూర్తిస్థాయి నిధులు ఇస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2021-01-27T05:58:12+05:30 IST