బౌద్ధారామాలకు రక్షణ కరువాయే...

ABN , First Publish Date - 2022-05-23T05:41:51+05:30 IST

రాయలసీమకే తలమానికమైన నందలూరు మండలం ఆడపూరు ముక్తికనుమ వద్ద ఉన్న ప్రాచీన బౌద్ధారామాలకు రక్షణ కరువైంది. దీంతో ఆరామాలు (స్థూపాలు) శిథిలావస్థకు గురవుతున్నాయి. బౌద్ధరామాల గుట్టపై గుప్తనిధుల ముఠా కళ్లు పడ్డాయి. పురాతన కట్టడాలు ఉండటంతో ఇక్కడ గుప్త నిధులు ఉంటాయన్న దురాశతో విధ్వంసానికి దిగుతున్నారు. చారిత్రక సంపదను రక్షించాల్సిన పురావస్తుశాఖ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

బౌద్ధారామాలకు రక్షణ కరువాయే...
బౌద్ధారామాలపై దుండగులు తవ్విన గుంత

శిథిలమవుతున్న ఆరామాలు 

పురాతన కట్టడాలను కూల్చివేస్తున్న దుండగులు 

నందలూరు, మే 22: రాయలసీమకే తలమానికమైన నందలూరు మండలం ఆడపూరు ముక్తికనుమ వద్ద ఉన్న ప్రాచీన బౌద్ధారామాలకు రక్షణ కరువైంది. దీంతో ఆరామాలు (స్థూపాలు) శిథిలావస్థకు గురవుతున్నాయి. బౌద్ధరామాల గుట్టపై గుప్తనిధుల ముఠా కళ్లు పడ్డాయి. పురాతన కట్టడాలు ఉండటంతో ఇక్కడ గుప్త నిధులు ఉంటాయన్న దురాశతో విధ్వంసానికి దిగుతున్నారు. చారిత్రక సంపదను రక్షించాల్సిన పురావస్తుశాఖ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో భావితరాలకు బౌద్ధధర్మం ఔన్నత్యాన్ని చాటుతున్న చారిత్రాత్మక కట్టడాలు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పేరిట నిధులు విడుదల చేస్తున్నా అధికారులు మాత్రం రక్షణ చర్యలు చేపట్టలేదని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బౌద్ధక్షేత్రాన్ని సందర్శించే పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన రహదారి కంపచెట్లతో మూసుకుపోయి పర్యాటకులకు వీలు లేకుండా పోయింది. ఆరామాలు ఉన్న ప్రాంతం అపరిశుభ్రం ముళ్లపొదలతో నిండి వుంది. దీంతో పాటు గతంలో మంజూరైన నిధులతో నిర్మించిన మరుగుదొడ్లు మందుబాబులకు అడ్డాగా మారి మందు సీసాలు, గాజుపెంకులతో నిండిపోయి ఉంది. 

ఆడపూరు కనుమ వద్ద కీ.శ. 1-2 శతాబ్దాల మద్య బౌద్ధ సన్యాసులు, ప్రచారకులు నివసించే వారు. చెయ్యేరు నదీ తీరంలోని గుట్టపై అప్పట్లో నిర్మించుకున్న ఆరామాలు నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. మిగతా కట్టడాలు మాత్రం శిఽథిలమయ్యాయి. ఇక్కడ ఒక మహాస్థూపం, 21 స్మారక స్థూపాలు (ఆరామాలు) ఉన్నాయి. అందులో కొన్ని ఆరామాల్లో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు. ఓ ఆరామాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. మరికొన్నింటిలో తవ్వకాలకు ప్రయత్నించారు. ఈ బౌద్ధక్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక రూ.1.30 కోట్లు మంజూరు చేసింది. ఆరామాల గుట్టపక్కనే బుద్దుని విగ్రహం, ధ్యానమందిరం, ఉద్యానవనం, సమాచార కేంద్రం, ఫుడ్‌కోర్ట్‌ తదితర భవనాల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టింది. ఆ పనులపై మాత్రమే వారు దృష్టిపెడుతున్నారు తప్ప పక్కనే ఉన్న బౌద్ధరామాల రక్షణను మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. గతంలో ప్రభుత్వం ఈ బౌద్ధరామాల వద్ద కాపలాదారున్ని నియమించారు. ఎందుకనో ఆ తరువాత తొలగించారు. గత పదేళ్లుగా కాపలాదారుడు లేకపోవడంతో అక్రమ తవ్వకాలకు, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చారిత్రాత్మక కట్టడాలకు పరిరక్షణ కల్పించి పర్యాటకులకు సౌకర్యంగా మార్చాలని స్థానికులు కోరుకుంటున్నారు.



Updated Date - 2022-05-23T05:41:51+05:30 IST