వేదాంతం బౌద్ధానికి పునాది

ABN , First Publish Date - 2020-04-09T19:21:08+05:30 IST

సిద్ధార్థ గౌతమ బుద్ధ ఒక సంపూర్ణమైన‌ వైదికవాది. (వారి కాలానికి హిందూ పదం లేదు) బుద్ధ నాస్తికులు కాదు. ఆస్తికులు.

వేదాంతం బౌద్ధానికి పునాది

|| వైదికముని‌ బుద్ధ ||


సిద్ధార్థ గౌతమ బుద్ధ ఒక సంపూర్ణమైన‌ వైదికవాది. (వారి కాలానికి హిందూ పదం లేదు) బుద్ధ నాస్తికులు కాదు. ఆస్తికులు. బుద్ధ ఒక వైదికముని‌‌ అన్న సత్యాన్ని అధారాలతో ఆలోచన చేసి అవగతం చేసుకుందాం రండి. 


సిద్ధార్థ అన్నది అసలు‌‌ పేరు. వంశం పేరు గౌతమ‌‌.‌ వారి వంశానికి మఱో పేరు శాక్య. (అందుకే స్వామి‌ వివేకానంద వంటి వారు‌ వారిని శాక్యముని‌ అనీ అంటారు) వారి జననం ఈ వ్యావహారిక శకానికి ముందు (BCE) 480వ సంవత్సరం. వారు‌‌‌ 82 ఏళ్ల వయసు వఱకూ  జీవించినట్లుగా చెప్పబడుతోంది. నిజానికి‌ వారి‌ జనన‌ మరణాల విషయంలో సందిగ్ధత ఉంది.‌ సిద్ధి పొందిన వ్యక్తిని బుద్ధ అంటారు. బోధిని పొందిన వ్యక్తిని కూడా బుద్ధ అంటారు. బోధి అంటే  మేధోపరమైన ఆపై నైతికపరమైన సిద్ధి అని అర్థం.  


సిద్ధార్థ బుద్ధ తొలి ప్రవచనం ధమ్మపదచక్ర ప్రవర్తనా సూత్ర. ఆ తరువాత ధమ్మపద. ధమ్మపద బుద్ధ స్వీయ వాక్కులు. ఇతరులు వ్రాసినవి కావు‌‌. బుద్ధ బోధనల సంకలనంగా ఉన్న 31 గ్రంథాల త్రిపీఠిక లో ఈ దమ్మపద ఒకటి. బుద్ధ ఈ ధమ్మపదను 300 వేఱ్వేరు సందర్భాల్లో చెప్పారు. ధమ్మపదను బుద్ధఘోష అని కూడా అంటారు. ఇది 26 వగ్గ (కాండ)ల్లో 423 పాళీ భాష శ్లోకాల నైతికప్రవర్తనా సిద్ధాంతం (ethical dogma). ఇది బౌద్ధుల పవిత్రపాఠం.  మానవుల దుఃఖాన్ని నివారించేందుకు చెయ్యబడ్డ బోధ. దీన్ని సవ్యంగా చదివితే ఎవరికైనా బుద్ధ నాస్తికులు కాదు  ఆస్తికులు అని తెలిసిపోతుంది.  ఇందులో‌‌ దేవతల ప్రస్తావన,‌ ‌ఇంద్రత్వం వంటివి బుద్ధ మాటల్లోనే మనకు తెలియవస్తూ వారు నాస్తికులు కాదు ఆస్తికులు అన్న నిజాన్ని మనకు తెలియజేస్తూంటాయి. వారు‌ వేదవాది. వేదాల్లో చెప్పినదాంట్లో‌ కొంత భాగాన్ని మళ్లీ చెప్పారు బుద్ధ.


ధమ్మపద 5వ వగ్గ (అధ్యాయం) 16వ శ్లోకంలో బుద్ధ ఇలా చెప్పారు: "ప్రాపంచిక లాభాలను పొందే మార్గం వేఱు, నిర్వాణంను పొందే మార్గం వేఱు. ఈ విషయం తెలిసిన బౌద్ధభిక్షువు(పరివ్రాజకుడైన బౌద్ధసన్యాసి) ప్రవర్తన సత్కారాన్ని పొంది వివేకాన్ని  పెంచుతుంది". ఇక్కడ నిర్వాణం అంటే "నిః వాన" అంటే వాసనలులేని, లేదా ఆపేక్షలులేని, లేదా వాంఛలులేని స్థితి అని అర్థం. ఇది వేదాల్లోనూ, ఇతర సనాతన విద్యాగ్రంథాల్లోనూ చెప్పబడ్డ విషయమే.


ధమ్మపద 4వ వగ్గ 2వ శ్లోకంలో బుద్ధ ఇలా చెప్పారు:‌ ‘‘ఒక యోగ‌ సాధకుడు ( సెఖ) పృధ్వినీ, యమ, దేవ లోకాల్నీ జయించగలడు. నేర్పుతో పూలమాల‌ కట్టే వ్యక్తి పూలను కోసినట్లుగా  ఒక యోగ సాధకుడు ధమ్మపదాన్ని అందిస్తాడు’’, ఇక్కడ యమ, దైవలోకాలు అంటూ వాటి ఉనికిని పరిగణించడం వల్ల ‘బుద్ధ నాస్తిక వాది కాదు’ అని తెలిసిపోతోంది.


ధమ్మపద 13వ వగ్గ 11వ శ్లోకంలో బుద్ధ ఇలా‌ చెప్పారు: ‘‘పిసినారి దేవలోకానికి వెళ్లడు. మూర్ఖుడు దానం చెయ్యడాన్ని ప్రశంసించడు. జ్ఞాని దానం‌ చేస్తూ‌ సంతోషిస్తాడు. అందువల్ల అతడు సుఖాన్ని పొందుతాడు’’. ఇక్కడ ‘‘దేవలోకానికి వెళ్లడు’’ అని‌ అనడాన్ని గమనించాలి. దీనివల్ల బుద్ధ‌‌ నాస్తికులు కాదు‌ అని‌ స్పష్టమౌతోంది. దేవలోకం‌ అన్నది‌ వేదంలో‌ ఉన్నదే కదా?‌‌‌ బుద్ధ ఒక వేదవాది. వారు‌ ఆస్తికులు.


ధమ్మపద 7వ వగ్గ 5వ శ్లోకంలో బుద్ధ ఇలా చెప్పారు: ‘‘ఒక మంచి సారథి అశ్వాలను అదుపులో ఉంచినట్లు‌ ఏ వ్యక్తి అయితే ఇంద్రియాలను నిగ్రహించి ఉంచుతాడో అట్టి నిగర్విని దేవతలు దగ్గఱికి తీసుకుంటారు’’. ఇంద్రియనిగ్రహం, ఇంద్రయనిగ్రహం కలవ్యక్తిని దేవతలు స్వీకరిస్తారు‌ అనడం సనాతన భావాల్ని మళ్లీ‌ చెప్పడమే. ఇంద్రియాల్ని గుఱ్ఱాలతో పోలుస్తూ  కఠోపనిషత్‌లో ఇలా ఉంది:‌ ‘‘ఇంద్రియాణి హయనాహుః’’.‌ బుద్ధ‌‌ దీన్ని‌ తీసుకున్నారు.


ధమ్మపద 15వ వగ్గ‌ మొదటి‌ శ్లోకంలో బుద్ధ ఇలా‌ చెప్పారు: ‘‘సుఖంగా జీవిస్తాం శోకంవల్ల కుంగిపోకుండా ఉంటే. మనం సంతోషాన్ని పొందగలం ప్రకాశించే దేవతల్లాగా’’, ఇక్కడ  ప్రకాశించే దేవుళ్లు అని చెప్పబడడం గౌతమ‌ బుద్ధ నాస్తికులు కారు‌ ఆస్తికులు అని తేటతెల్లం చేస్తోంది. 


సిద్ధార్థ గౌతమ‌ బుద్ధ  ధమ్మపద 8వ వగ్గ 5, 6 శ్లోకాల్లో గంధర్వ , బ్రాహ్మణ పదాలను వాడారు.  శ్రేష్ఠులైన వారిని బుద్ధ బ్రాహ్మణులు అని పరిగణించారు (పుట్టుకతో బ్రాహ్మణత్వం అని కాదు). ఇది‌ మనువు చెప్పినదే. ధమ్మపదం సరిగ్గా, సంపూర్ణంగా చదివితే మనువు మాటలు కొన్ని మనకు బుద్ధ మాటలుగానూ వినిపిస్తాయి. ఉదాహరణ:‌‌ 

‘‘ఇంద్రియాణాం నిరోధేన రాగద్వేషక్ష యేణచ / అహింసయాచ భూతానా మ‌ మృతత్వాయ కల్పతే’’ అని మనువు (మనుస్మృతి అధ్యాయం 2 శ్లోకం‌ 60) చెప్పినది. అంటే ఇంద్రియనిగ్రహం వల్లా,  రాగ ద్వేషాలను వదిలెయ్యడం వల్లా, ప్రాణులపట్ల అహింసతో ఉంటే అమృతత్వం వస్తుంది అని అర్థం. మాటలతో సహా బుద్ధ ఈ విషయాన్ని తీసుకున్నారు. ఇంద్రియనిగ్రహమూ, రాగద్వేషాల్ని విడనాడడమూ,‌ అహింస అన్నవి బుద్ధ ప్రధాన‌ బోధనలు.‌‌ అవి మనువు నుంచి వచ్చినవే. పాపం, పుణ్యం, యోగం,‌ సనాతన, ఆత్మ (పాళీ భాషలో అత్త) వంటి  వేద సాహిత్యంలోని‌ పదాలను వాడారు బుద్ధ.


ధమ్మపద 7వ వగ్గ,‌ 6వ శ్లోకం‌ ‘‘ఇందఖీలూ’’ (ఇంద్రపదవి లేదా‌ ఇంద్రత్వం అని అర్థం) అన్న పదం వాడుతూ ఇలా‌ చెప్పారు బుద్ధ: ‘‘భూమిలా నిబ్బరంగా ఉన్న వ్యక్తి గాయపడడు. అతని‌ స్థితి ఇంద్రపదవి లేదా ఇంద్రత్వం వంటిది. అతడు బురదలేని‌ సరస్సు‌ వంటివాడు. అతడికి జనన మరణాల పరంపర లేదా పునర్జన్మ ఉండదు’’. ఇక్కడ ఇంద్రత్వం, పునర్జన్మ‌ అన్నవి వేదంలోని విషయాలే.


బుద్ధ చెప్పిన మాటలు, జీవించిన విధానం సనాతనమైనవే లేదా వేద జనితమైనవే. వారు ఏ నూతన మతమూ స్థాపించలేదు. వారి పేరుతో తరువాతి నాళ్లలో చలామణిలోకి వచ్చిన బౌద్ధమతం ఒక‌ చారిత్రిక తప్పిదం. ప్రపంచంలో జరిగిన‌ అది పెద్ద తప్పు బౌద్ధమతం అన్నది రూపొందడం‌.  దానిలోని శాఖలైన హీనయానం, మహాయానం, వజ్రయానం వంటివి కొందఱు అల్లినవి. బుద్ధకు వాటితో  ఏ సంబంధమూ లేదు. ఎవరు నేరుగా బుద్ధను అనుసరించినా వాళ్లు వైదికాన్నో లేదా సనాతన ధర్మాన్నో అనుసరించే వాళ్లే అవుతారు. సనాతనం వేఱు, బుద్ధ వేఱు‌ కాదు.‌ తమ‌ కాలానికి సంఘంలో చెలరేగిన‌‌ అనర్థాలకూ, దోషాలకూ వ్యతిరేకంగా బుద్ధ పనిచేశారు. మానవాళి ప్రశాంతంగా బ్రతకడానికి‌ కావాల్సిన‌వి చెప్పారు. వాటిని వేద వాఙ్మయంలోంచే తీసుకున్నారు వారు.


కొన్ని‌ దశాబ్దుల క్రితం మన దేశంలో‌‌ సిద్ధార్థ‌ గౌతమ బుద్ధ నాస్తికులుగా పెద్ద ఎత్తున చిత్రించబడింది, నమ్మించబడింది.‌  అది‌ ఎంత మాత్రమూ‌ సత్యం కాదు. అంతేకాదు కుల అసమానతలకు‌ అతీతంగా సమానతను‌ ప్రవచించిన బుద్ధను కొన్ని కులాలకు చిహ్నంగా చూపించడం, పరిగణించడం బాధాకరం, శోచనీయం. మతం పరంగానూ, కులం పరంగానూ, నాస్తికత్వ‌ం పరంగానూ బుద్ధను చూడడం, పరిగణించడం చాలా తప్పు.‌ అది‌ బుద్ధ‌ ద్రోహం. అది బుద్ధి‌ దోషం. 



మహా విష్ణువు దశావతారాల్లో ఈ‌ బుద్ధ అవతారం ఒకటి అని కొందఱు అంటున్నారు.‌ అది నిజం కాదు.‌ త్రిపురాసుర సంహారం కోస‌ం త్రిపురాసురుడి భార్య పాతివ్రత్యాన్ని భంగం చెయ్యడానికి  అశ్వత్థవృక్షం (రావి చెట్టు)లో కూర్చున్న బుద్ధ అవతారం విష్ణువు దశావతారాల్లో తొమ్మిదవది.‌ అది పౌరాణికం. ఈ సిద్ధార్థ గౌతమ‌ బుద్ధ చారిత్రిక వ్యక్తి.


20వ శతాబ్ది తొలిదశలో రాజకీయ ప్రయోజనాల కోసమూ, కొన్ని వర్గాల సామాజిక లబ్ది కోసమూ బౌద్ధమతాన్ని ఒక‌ సామాజిక విప్లవం అన్న భ్రమను కలిగించారు కొందఱు. అది నిజం కాదు. బౌద్ధం ఒక సామాజిక విప్లవం అయి ఉంటే బుద్ధ పుట్టిన‌ 2300‌ ఏళ్ల తరువాత అది‌‌‌ ఒక‌ విప్లవం అవడం ఏమిటి?  ఈ ఆలోచనకు మూలం అంబేడ్కర్ అని కొందఱు అంటారు. బౌద్ధం పరంగా అంబేడ్కర్ భీంరావ్ తప్పే చేశారు, చెప్పారు. అంబేడ్కర్ బౌద్ధాన్ని‌ మనదేశంలో ప్రెంచ్ విప్లవం లాంటిదని అన్నారు. అది‌ నిజం కాదు. ఏ దశలోనూ బౌద్ధం అన్నది మన దేశంలో ఏ విధంగానూ విప్లవం కాలేదు. కొద్ది కాలం బౌద్ధం రాజమతంగా ఉండేది అంతే.‌ "నా సాంఘీకతత్త్వం‌ స్వేచ్ఛ, సమత్వం, సోదరత్వం. నేను వాటిని‌ బుద్ధ నుంచి తీసుకున్నాను" అని అంబేడ్కర్ అన్నారు. ఇవి బుద్ధకు ముందే సనాతన వైదిక చింతనలో ఉన్నాయి. బుద్ధ వాటిని అక్కడనుంచే తీసుకున్నారు‌‌. అంబేడ్కర్ నాటికి‌ బౌద్ధమతం వేఱ్వేరు శాఖలై చెల్లాచెదఱైపోయింది.‌ మన దేశంలో‌ ఏ మాత్రమూ చెప్పుకోతగ్గ స్థితిలో లేదు. కనుక‌ అది‌ సామాజిక‌ ఉద్యమమో,  విప్లవమో అయ్యే అవకాశం లేదు. ఇంకో విషయం ఏమిటంటే 1920 తరువాత బౌద్ధమతాన్ని స్వీకరించాము అన్న వాళ్లు ఆ మతంలో ఏ శాఖను స్వీకరించారో చెప్పలేదు. బౌద్ధాన్ని స్వీకరించాలి అన్న వాళ్లు ఏ శాఖను స్వీకరించాలో చెప్పలేదు. ఒక‌ సరిలేని పోకడ బౌద్ధాన్ని స్వీకరించడం అన్నది. 


ఆదిశంకరాచార్య బౌద్ధం పై పోరాటం చేశారనీ,‌‌ లేదా వారే ప్రచ్ఛన్న‌ బౌద్ధులనీ అనే వాదనలున్నాయి. కానీ ఆదిశంకరాచార్య రచనల్లో‌ ఎక్కడా బుద్ధ, బౌద్ధ ప్రసక్తి లేదు. బౌద్ధమతంలో తంత్ర‌ చింతన‌, ప్రవర్తన చాలా‌ ఉంది.‌ బౌద్ధమతంలో ధ్యానం ఉంది.‌ అంటే‌ బౌద్ధం అన్నది ఒక‌ సామాజిక  ఉద్యమం కాదు అన్నది కూడా తెలిసివస్తోంది. ధ్యానం అన్నది వైదిక అభ్యాసమే.


బుద్ధపై, బుద్ధతత్త్వంపై కొన్ని‌ సరైన, విలువైన పుస్తకాలున్నాయి. వాటిల్లో AK Coomaraswamy & I B Homer వ్రాసిన Gotama the Buddha,‌ Paul Carus వ్రాసిన the Gospal Of Buddha, Dwight Goddard వ్రాసిన  A Buddhist Bible, Bikku Kantipalo వ్రాసిన Buddhism Explained, Ven. Narada Maha Thera అనువాదం చేసిన Dhammapada, W.Y. Evans- Wentz వ్రాసిన The Tibetan book of the Great Liberation వంటి పుస్తకాలున్నాయి. ఈ పుస్తకాలవల్ల మనకు బుద్ధపైనా,‌ బౌద్ధం‌పైనా ఉండాల్సిన‌ అవగాహన వస్తుంది. గత కొన్ని దశాబ్దులుగా మనదేశంలో మతవాదులూ, కులోన్మాదులూ తమ పబ్బం గడుపుకోవడానికి బుద్ధనూ, బౌద్ధాన్నీ భ్రష్టుపట్టించారన్న బాధాకరమైన వాస్తవం ఈ పుస్తకాల వల్ల మనకు అర్థమవుతుంది.


బుద్ధపై స్వామి వివేకానంద విశేషమైన‌ విశ్లేషణలు చేశారు. "బుద్ధ వేదసారాన్ని తెలియ‌జెప్పారు" అనీ, "ఈ గురువు  (బుద్ధ)‌ సత్యం సత్యంగా ప్రకాశించేట్టు చెయ్యాలనుకున్నారు" అనీ, "ఒక్క‌ బుద్ధ మాత్రమే అన్నీ ఇతరులకు చేసి తనకంటూ బొత్తిగా ఏమీ చేసుకోని యోగి (ప్రవక్త)‌" అనీ, "బుద్ధ బోధలోని ప్రతీది వేదాంతంలో ఉంది" అనీ "వేదాంతం బౌద్ధానికి పునాది" అనీ "వేదాంతానికి బౌద్ధంతో ఘర్షణ లేదు" అనీ వివేకానంద వివరించారు.


సిద్ధార్థ గౌతమ బుద్ధ తమ మరణానికి ముందు చివరిగా పాళీ భాషలో అన్న మాటలు ‘‘ఆప దిప్పో భవ’’. అంటే నీరుగానూ, దీపంగానూ‌ ఉండు‌ అని అర్థం.‌ ఒక వ్యక్తి మఱొకరికి దాహం తీఱ్చే నీరుగానూ దారి చూపించే దీపంగానూ ఉండాలి అన్న ఉద్బోధ చేశారు బుద్ధ. ఎంత గొప్ప మాటలో కదా ఇవి? ఎంతో గొప్ప మాటలు. ఈ మాటలు కూడా వైదికమే! ఆపః అని ఒక బ్రహ్మ సూత్రం ఉంది. బ్రహ్మం అన్నది నీరుగానూ తెలియజెయ్యబడింది  బ్రహ్మసూత్రాల్లో.  దీపం లేదా జ్యోతి భావన‌ వైదికమే కదా? చివరి వఱకూ వేదవాదిగానే జీవించారు.‌ వేదవాణినే వినిపించారు బుద్ధ.


‘‘సిద్ధార్థ గౌతమ బుద్ధ ఒక వైదికముని‌’’





రోచిష్మాన్
9444012279
rochishmon@gmail.com



Updated Date - 2020-04-09T19:21:08+05:30 IST