బీటీపీ, పేరూరు డ్యామ్‌లకు పోటెత్తిన వరద

ABN , First Publish Date - 2022-08-05T06:07:53+05:30 IST

జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంది. భైరవానతిప్ప ప్రాజెక్టు, పేరూరు అప్పర్‌పెన్నార్‌ డ్యామ్‌లు తొణికిసలాడుతున్నాయి.

బీటీపీ, పేరూరు డ్యామ్‌లకు పోటెత్తిన వరద
పేరూరు డ్యామ్‌ గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు

జలకళ

బీటీపీ నుంచి చెరువులకు నీరు విడుదల.. 

పేరూరు డ్యామ్‌ ఆరు గేట్ల ఎత్తివేత

గుమ్మఘట్ట/రామగిరి, ఆగస్టు 4: జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంది. భైరవానతిప్ప ప్రాజెక్టు, పేరూరు అప్పర్‌పెన్నార్‌ డ్యామ్‌లు తొణికిసలాడుతున్నాయి. జిల్లాతో పాటు ఎగువన ఉన్న కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు ఈ ప్రాజెక్టులకు పోటెత్తుతోంది. భైరవానితిప్ప రిజర్వాయర్‌కు వారం రోజులుగా వరదనీరు భారీగా చేరుతోంది. ప్రాజెక్టు సామ ర్థ్యం 1655 అడుగులు కాగా, గురువారం సాయంత్రానికి 53.1 అడుగుల నీటి మట్టం చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీరు చేరేందుకు మరో రెండు అడుగులు మాత్రమే వుంది. దీంతో ఇరిగేషన అధికారులు ముందస్తుగా కుడి, ఎడమ కాలువల పరిధిలో చెరువులు నింపేందుకు సన్నద్ధయ్యారు. గురువారం సాయంత్రం ఎడమ కాలువకు 150 క్యూసెక్కులు, కుడి కాలువకు 50 క్యూసెక్కుల మేర నీరు విడుదల చేశారు. ఎడమ కాలువ పరిధిలో గుమ్మఘట్ట కేవీ ట్యాంకు, కలుగోడు చెరువు, భూపసముద్రం చెరువులు నింపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎగువన ఉన్న కర్ణాటక ప్రాంతం నుంచి  దాదాపు మూడు వేల క్యూసెక్కుల మేర ఇనఫ్లో కొనసాగుతున్నట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండితే, దిగువన హగరి నదికి ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తే ఆస్కారముంది. వేదావతి హగరి నదీ పరీవాహక ప్రాంతాల్లో రైతులు, ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశా రు. గ్రామాల్లో దండోరా వేయించారు. నది పరిసర ప్రాంతాల్లో సంచరించకుండా జాగ్రత్తలు వహించాలని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం రెండు టీఎంసీలు కాగా, ఇప్పటికే 1.8 టీఎంసీల నీటి మట్టం చేరుకుంది. కాగా ప్రాజెక్టులో జలకళను చూసేందుకు సమీప గ్రామాల నుంచి జనం తరలివస్తున్నారు.  


ఆరు గేట్లు ఎత్తినీరు విడుదల 

రామగిరి మండలంలోని పేరూరు అప్పర్‌పెన్నార్‌ డ్యామ్‌కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. సుమారు 20 ఏళ్ల తరువాత ఆరు గేట్ల ద్వారా నీటిని దిగువకు వదలడం ఇదే ప్రథమం. పెన్నానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో డ్యామ్‌ పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకుంది. దీంతో అధికారులు ఆరు గేట్లు ఎత్తి, 14 వేల క్యూసెక్కుల నీటిని దిగువన పెన్నానదికి వదిలారు. బుఽధవారం రాత్రికి ప్రాజెక్టులో దాదాపు 7 అడుగుల మేర నీటి మట్టం పెరగడం, గురువారం ఉదయం కూడా వరద ఉధృతి కొనసాగుతుండడంతో నీటిని కిందకు వదిలారు. డ్యామ్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 60 అడుగులు కాగా, 59 అడుగులకు నీరు చేరింది. పేరూరు డ్యామ్‌ పూర్తిగా నిండితే 1.75 టీఎంసీల నీటి సామర్థ్యం ఉంటుందనీ, అయితే పూడికతో ప్రస్తుతానికి నీటి సామర్థ్యం తక్కువగా ఉందని అధికారులు పేర్కొన్నారు. డ్యామ్‌ నిండడంతో రామగిరి, కనగానపల్లి, కంబదూరు మండలాల ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.






Updated Date - 2022-08-05T06:07:53+05:30 IST