వంగ రైతుకు బెంగ

ABN , First Publish Date - 2021-04-11T04:59:32+05:30 IST

తాడేపల్లిగూడెం మండలం దండగర్ర, లింగారాయుడుగూడెం, ఇటుకులగుంట, అమృతపురం గ్రామాల్లో వేసిన వంగ తోటలో పుచ్చు భారీగా పెరగడంతో రైతులు దిగాలు పడ్డారు.

వంగ రైతుకు బెంగ
పుచ్చు వంకాయలను ఏరుతున్న రైతులు

వంకాయల్లో అధిక శాతం పుచ్చులే.. 

రైతుల ఆశలపై నీళ్లు చల్లిన వాతావరణం

తాడేపల్లిగూడెం రూరల్‌, ఏప్రిల్‌ 10: తాడేపల్లిగూడెం మండలం దండగర్ర, లింగారాయుడుగూడెం, ఇటుకులగుంట, అమృతపురం గ్రామాల్లో వేసిన వంగ తోటలో పుచ్చు భారీగా పెరగడంతో రైతులు దిగాలు పడ్డారు. వంకాయ పంట వేసిన రైతు ఎకరాకు లక్ష రూపాయల వరకూ ఖర్చు చేయగా దిగుబడి బాగుంది అనుకుంటే పుచ్చు మాత్రం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. ఏకంగా 200 కేజీల వంకాయలు కోత కోస్తే అందులో మూడొంతులు పుచ్చు వస్తుండడంతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతోంది. వాతావరణంలో మంచు ఎక్కువగా ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. వంగ దిగుబడి అమ్మితే కూలీల ఖర్చులు కూడా రావడం లేదని రైతులు 

ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మార్కెట్‌లో వంకాయల ధర కేజి రూ.15 వరకూ లభిస్తున్నా పుచ్చు ప్రభావంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. నల్ల వంకాయలు కేజి రూ.6కే అమ్ముతున్నా.. తెల్లవంకాయ ధర మాత్రం రూ.15 పలుకుతోంది. తెల్లవంకాయ, నల్లవంకాయ తేడా లేకుండా పుచ్చు విజృంభిస్తోందని దీంతో రైతులకు తీరని నష్టం కలుగుతోందని గ్రామానికి చెందిన వంగ రైతు కాసగాని రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 



Updated Date - 2021-04-11T04:59:32+05:30 IST