మార్గంలేని మన్యం

ABN , First Publish Date - 2021-12-27T05:40:44+05:30 IST

మన్యం బిడ్డలకు బయటి ప్రపంచానికి మార్గం లేదు.

మార్గంలేని మన్యం

వంతెనలు లేని వాగులు 

పట్టించుకోని ప్రభుత్వం


బుట్టాయగూడెం, డిసెంబరు 26: మన్యం బిడ్డలకు బయటి ప్రపంచానికి మార్గం లేదు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రమాదకరంగా మారిన కొండవాగులపై వంతెనలు లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందే. వర్షాలు, వరద ల సమయంలో తలెత్తిన ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో సాధారణ సమయంలో సమస్య పరిష్కరించాల్సి ఉంది. నెల రోజుల క్రితం వరకు వర్షా లు, వరదలు గిరిజనులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. గిరిజనులు, ఉపాధ్యా యులు, యువకులు, రైతులు, అన్నివర్గాల వారు ప్రమాదాల్లో చిక్కుకున్నారు. ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆదివాసీల చిరకాల స్వప్నం వంతెనల నిర్మాణం పై పట్టించుకున్న వారే లేరు.


వరుస సంఘటనలతో ఆగ్రహించిన ఆదివాసీలు ఏజెన్సీలో కొండ వాగు లపై వంతెనలు నిర్మించాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు. ఐటీడీఏ కార్యాలయాన్ని అనేకమార్లు ముట్టడించి ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో గాడిదబోరు, నందాపురం, అంతర్వేదిగూడెం ప్రాంతాల్లో వాగుల పై వంతెనలు నిర్మించి చేతులు దులుపుకోగా ఇంకా ఏజెన్సీలో ప్రమాదకరమైన కొండవాగులు అనేకం ఉన్నాయి. బుట్టాయగూడెం, పోల వరం, జీలుగుమిల్లి, కుక్కునూరు, ఏలేరుపాడు మండలాల్లో పలు ప్రాంతాల్లో ప్రమాదకర కొండవాగులున్నాయి. మండలంలో పులిరాముడుగూడెం నుంచి గెడ్డపల్లి వరకు మధ్యలో బండరేవు కాల్వ, చిలుకూరి కాల్వ, దాటుకాల్వ, చంగల కాల్వ, చింతపల్లి కొండ కాల్వ, పందిరిమామిడిగూడెం నుంచి రేగులపాడు, తానిగూడెం, కోర్సవారిగూడెం జల్లేరు పెద్దవాగు కాల్వ, చాకిరేవు కాల్వ, రేపల్లె, రేగులపాడు వాగులు, ఉచ్చకాలువ వాగు, గానుగమామిడి కొండవాగులు, జల్లేరు కొండవాగు, అల్లికాలువ, పద్మవారిగూడెం వాగులు ఆదివాసీలను భయపెడతాయి. అడవి బిడ్డల ఆక్రందన అరణ్య రోదనగానే మిగిలిపోతున్నాయి. ప్రజాప్రతినిఽధులను ఆదివాసీలు కలిసి సమస్యను వివరిస్తే అదెంతపని అంటారు తప్ప ఆచరణ శూన్యం. పోలవరం ప్రాజెక్టుతో వేలాది మంది గిరిజన నిర్వాసితులు బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లోని కాలనీలకు వస్తున్నారు. వీరంతా కొండవాగులతో ఇబ్బందులు పడక తప్పదు. కొన్నిచోట్ల లోలెవల్‌ కల్వర్టులు నిర్మించినా వర్షాకాలంలో ప్రయోజనం లేదని గిరిజనులు వాపోతున్నారు. ప్రమాదకర వాగులపై వంతె నల నిర్మాణం ఒక్కటే మార్గమని చెబుతున్నారు. ప్రధానంగా విప్పలపాడు, రెడ్డిగణపవరం, తానిగూడెం, రేపల్లె, రేగులపాడు, రెడ్డిబోడ్డేరు, చింతపల్లి, కన్నారప్పాడు, ఉప్పరిల్ల ప్రాంతాల్లోని వాగులపై వంతెనలు నిర్మిస్తే కొంతవరకు సమస్య తీరుతుందని ఆదివాసీలు తెలియజేస్తున్నారు.

Updated Date - 2021-12-27T05:40:44+05:30 IST