స్వప్నసాకారం

ABN , First Publish Date - 2022-05-18T06:31:21+05:30 IST

కృష్ణా నదిపై ఆరు వరుసల బ్రిడ్జి నిర్మాణ పనులు ఊపందుకున్నాయి.

స్వప్నసాకారం

చురుగ్గా కృష్ణానది మధ్యన ఆరు వరుసల బ్రిడ్జి పనులు

 ప్యాకేజీ-4లో భాగంగా గొల్లపూడి నుంచి కృష్ణానది మీదుగా వంతెన 

 నది నీటి ప్రవాహన్ని కట్టడి చేసి బ్రిడ్జి నిర్మాణం 

 పిల్లర్ల దశ పనులు దాదాపుగా పూర్తి  

 క్యాస్టింగ్‌ యార్డులో వింగ్స్‌ రూపకల్పన 

కృష్ణా నదిపై ఆరు వరుసల బ్రిడ్జి నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఇప్పట్లో కావనుకున్న పనులు ఓ కొలిక్కి వచ్చి పిల్లర్ల దశకు చేరుకున్నాయి. పనులు ఇలాగే జరిగితే మరో ఏడాదిలో విజయవాడ పశ్చిమ బైపాస్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. విజయవాడ నగర ప్రజల చిరకాల స్వప్నసాకారం దిశగా  సాగుతున్న పనులపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ - గుండుగొలను ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ-4లో గొల్లపూడి, సూరాయపాలెం మధ్య నుంచి కృష్ణానది మీదుగా కాజ వరకు 18 కిలోమీటర్ల పొడవున బ్రిడ్జి కమ్‌ రోడ్డు పనులను నవయుగ - అదానీ జాయింట్‌ వెంచర్‌గా చేపట్టింది. కృష్ణానదిపై 3.12 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న ఆరు వరుసల బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి. సచివాలయానికి వెళ్లే సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు ఉత్తరాన  ఉన్న కృష్ణానదిలో ఈ పనులు జరుగుతున్నాయి. గొల్లపూడి నుంచే ప్యాకేజీ-4 పనులు ప్రారంభమౌతాయి. ఇవి ఎన్‌హెచ్‌- 65పై నిర్మించే ప్యాకేజీ-3 (విజయవాడ ఆరువరుసల బైపా్‌స)లో పనులకు కొనసాగింపుగా ప్రారంభమౌతాయి. ప్యాకేజీ-3 పనులు ఫ్లై ఓవర్‌ దిగిన తర్వాత కొద్ది దూరం నేల మీద సాగుతాయి. కృష్ణానది సమీపించే దగ్గర నుంచి ఏకబిగిన 3.5 కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మాణం చేయాల్సి ఉంది. ఆ పనులే ఇప్పుడు జరుగుతున్నాయి. 

గొల్లపూడి వైపు నుంచి కాకుండా రాజధానిలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు దిగువ నుంచి కృష్ణానదిలో ఆరు వరుసల బ్రిడ్జి పనులు చేపడుతున్నారు. బ్రిడ్జిని రెండు వరుసల్లో పక్కపక్కనే నిర్మిస్తున్నారు. ఒక్కో వరుసలో మూడు లేన్ల స్పాన్‌ ఉంటుంది. కృష్ణానదితో పాటు భవానీ ఐల్యాండ్‌ ఎగువున ఉన్న మరో ద్వీపంలో కూడా ఆరు వరుసల బ్రిడ్జి పనులు సాగుతున్నాయి.  గొల్లపూడి వైపు కృష్ణానదిలో 30 శాతం మేర మాత్రమే ఫైల్స్‌ వేయటం మిగిలి ఉంది. నది ప్రవాహానికి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఒక కెనాల్‌ గ్యాప్‌ను ఇచ్చి ఇసుక, మట్టితో చదును చేస్తున్నారు. పిల్లర్ల పనులు 50 శాతం  జరిగాయి. ఓవరాల్‌గా చూస్తే కృష్ణానదిలో చేపడుతున్న బ్రిడ్జి పనులు 35 - 40 శాతం మధ్యలో ఉన్నాయి. 

  కృష్ణా వంతెన పనులపైనే టార్గెట్‌  

కృష్ణానది వంతెన పనులపైనే కాంట్రాక్టు సంస్థ ప్రధానంగా దృష్టి సారించింది.   కృష్ణానదిలో ఈ బ్రిడ్జి రాజధాని ప్రాంతంలోని వెంకటపాలె ం ఇవతల సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు దాటి వెళుతుంది. ఆపై రోడ్డు పోర్షన్‌గా చినకాకాని, కాజ వరకు ఉంటుంది. దీంతో ప్యాకేజీ-4 సమాప్తం అవుతుంది. కిందటి వర్షాకాలంలోనే పనులు ప్రారంభించినా ఆరునెలల పాటు వరదల వల్ల పనులు పురోగతి చెందలేదు. ఇప్పుడు వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని కాంట్రాక్టు సంస్థ చేపట్టిన పనులు శరవేగంగానే జరుగుతున్నాయి. నది మొత్తం భూగర్భంలో పియర్స్‌ నిర్మాణం చేస్తే తర్వాత వరదలు వచ్చినా ఇబ్బంది లేదు. జూన్‌ నెలాఖరు నాటికల్లా మిగిలిన 30 శాతం పైలింగ్‌ కూడా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

 స్పాన్‌ వర్క్స్‌కు కూడా రంగం సిద్ధం

ఇప్పటి వరకు కృష్ణానదిలో 50 శాతం మేర నిర్మించిన పిల్లర్లకు పియర్‌ క్యాప్స్‌ పూర్తి చేసి స్పాన్స్‌ను కూడా బిగించటానికి కాంట్రాక్టు సంస్థ రంగం సిద్ధం చేసింది. కృష్ణానది దిగువన క్యాస్టింగ్‌ యార్డులో బ్రిడ్జికి అవసరమైన అన్ని స్పాన్లను పూర్తి అయ్యాయి. వీటిలో కొన్నింటిని బిగించటానికి నదికి సమీపంలోకి తీసుకువచ్చారు. ఈ స్పాన్స్‌ బిగించటం చాలా తేలిక. రెడీమేడ్‌గా చేసిన ఈ స్పాన్స్‌ను పైకి ఎక్కించి తొడుగుతారు.  

  ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌  

కాజ - గుండుగొలను రోడ్డు ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ-4లో చేపడుతున్న పనులు అత్యంత కీలకం. ఇవి విజయవాడ పశ్చిమ బైపాస్‌ పనుల్లో అతి ముఖ్యమైనవి. ప్యాకేజీ-3లో భాగంగా ఇప్పటికే మెగా సంస్థ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. ఇవి కూడా చాలా పురోగతిలో ఉన్నాయి. చిన్న అవుటపల్లి నుంచి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. గొల్లపూడి దగ్గర ఫ్లై ఓవర్‌ పనులు జరుగుతున్నాయి. ప్యాకేజీ-3, ప్యాకేజీ-4 పనులు ఏకకాలంలో అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనపడుతోంది. మరో ఏడాది కాలంలోనే రెండు ప్యాకేజీల పనులు పూర్తయితే విజయవాడ పశ్చిమ బైపాస్‌ అందుబాటులోకి వచ్చినట్టు అవుతుంది. దీంతో విజయవాడ వాసుల చిరకాల ట్రాఫిక్‌ కష్టాలు చాలా వరకు తీరిపోనున్నాయి. ప్రధానంగా చెన్నై - కలకత్తా మార్గంలో, హైదరాబాద్‌ - కలకత్తా మార్గంలోనూ వాహనాల రాకపోకలు సులువవుతాయి. 

Updated Date - 2022-05-18T06:31:21+05:30 IST