పెళ్లి మండపం నుంచి వధువుని కిడ్నాప్ చేసిన పెళ్లికొడుకు.. అతను ఎందుకిలా చేశాడంటే..

ABN , First Publish Date - 2022-02-08T05:57:23+05:30 IST

ఒక పెళ్లి వేడుకలో వరుడు ఎవరూ చేయని పనిచేశాడు. అనుకోని ఆపద ఎదురవడంతో పరారయ్యాడు. పారిపోతూ తన వెంట వధువుని కూడా తీసుకెళ్లాడు...

పెళ్లి మండపం నుంచి వధువుని కిడ్నాప్ చేసిన పెళ్లికొడుకు.. అతను ఎందుకిలా చేశాడంటే..

ఒక పెళ్లి వేడుకలో వరుడు ఎవరూ చేయని పనిచేశాడు. అనుకోని ఆపద ఎదురవడంతో పరారయ్యాడు. పారిపోతూ తన వెంట వధువుని కూడా తీసుకెళ్లాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కన్నోజ్ నగరంలో నివసించే గోపాల్ అనే యువకుడికి అదే ప్రాంతానికి చెందిన లీలా(పేరు మార్చబడినది) అనే యువతితో పెళ్లి జరగాల్సి ఉండగా.. వరుడు గోపాల్ తనకు కాబోయే భార్య లీలాను కిడ్నాప్ చేసి పారిపోయాడు. ఈ విషయం తెలిసిన పెళ్లి పెద్దలు ఒక్కసారిగా షాకయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇంతవరకు గోపాల్, లీలా ఆచూకీ తెలియలేదు.


అయితే పోలీసుల విచారణలో గోపాల్ గురించి కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. పోలీసుల కథనం ప్రకారం.. గోపాల్ కొన్ని నెలల క్రితం సమీపంలోని ఒక గ్రామానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. కానీ కొన్ని రోజుల తరువాత ఆమెతో గొడవ పడి వదిలేశాడు. దీంతో ఆమె గోపాల్‌పై కోర్టులో కేసు పెట్టింది. పెళ్లి చేసుకొని మోసం చేశాడని.. గృహహింస చేస్తున్నాడని చెప్పింది. ఈ కేసులో కోర్టు గోపాల్‌కు వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. అతని భార్యకు ప్రతినెలా ఖర్చుల కింద డబ్బు ఇవ్వాలని తీర్పునిచ్చింది. కానీ గోపాల్ కోర్టు తీర్పుని లెక్క చేయకుండా మరో పెళ్లి చేసుకున్నాడు. అయితే గోపాల్ రెండో భార్య అనారోగ్యంతో కొన్ని రోజులకే చనిపోయింది. దీంతో అతని మొదటి భార్య కోర్టు ధిక్కారం కేసు పెట్టింది. గోపాల్ కోర్టు ధిక్కారం కేసులో కొన్ని రోజులు జైలు శిక్ష కూడా అనుభవించాడు.


జైలులో ఉండగా.. గోపాల్‌కు ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. గోపాల్ భార్య మరణించిందని తెలిసి ఆ వ్యక్తి తన అన్న కుమార్తెను పెళ్లి చేసుకోవాలని చెప్పాడు. అలా గోపాల్‌కు మూడో వివాహం కుదిరింది. అయితే గోపాల్ 3వ పెళ్లి జరుగుతుండగా.. అక్కడ అతని మొదటి భార్య వచ్చేసింది. అది చూసిన గోపాల్ ఎవరితోనూ మాట్లాడకుండా వెళ్లి కల్యాణ మండపం కారులో కూర్చున్నాడు. ఆ కారులో అప్పుడే పెళ్లికూతురు లీలా బ్యూటీ పార్లర్ నుంచి వచ్చింది. అదే అదునుగా భావించి గోపాల్ పెళ్లి కూతురిని తీసుకొని కారుతో సహా పారిపోయాడు.


ప్రస్తుతం పోలీసులు గోపాల్, లీలా కోసం గాలిస్తున్నారు. గోపాల్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు.



Updated Date - 2022-02-08T05:57:23+05:30 IST