ఆకర్షణ ఆకృతి తరగకుండా.. చక్కగా తీర్చిదిద్దే చికిత్సలు

ABN , First Publish Date - 2022-04-12T16:54:09+05:30 IST

మహిళల జీవితకాలంలో వారి శరీరం ఎన్నో ఒడిదొడుకులకు లోనవుతుంది. ఆకృతి కోల్పోతుంది.

ఆకర్షణ ఆకృతి తరగకుండా.. చక్కగా తీర్చిదిద్దే చికిత్సలు

ఆంధ్రజ్యోతి(12-04-2022)

మహిళల జీవితకాలంలో వారి శరీరం ఎన్నో ఒడిదొడుకులకు లోనవుతుంది. ఆకృతి కోల్పోతుంది. వ్యాధుల బారిన పడి ఆత్మన్యూనతకు కూడా లోను చేస్తుంది. అయితే అలా ఆకృతి కోల్పోయిన అవయవాలను ఆకర్షణీయంగా మలుచుకునే వెసులుబాట్లు ఉన్నాయి. మరీముఖ్యంగా రొమ్ముల ఆకారాన్ని చూడచక్కగా తీర్చిదిద్దే చికిత్సలెన్నో అందుబాటులో ఉన్నాయి.


రొమ్ముల ఆకారం తగ్గినా, పెరిగినా, పూర్తిగా కోల్పోయినా ఆకర్షణ తగ్గిందనే భావనకు లోనయ్యే మహిళలు ఉంటారు. శరీర తత్వం, జీవనశైలి, పైబడే వయసు, వ్యాధులు... ఇలా ఎన్నో అంశాలు రొమ్ముల ఆకారంలో మార్పులకు కారణమవుతూ ఉంటాయి. కొందరికి అవసరానికి మించి పరిమాణం పెరగవచ్చు. ఇంకొందరికి అవసరానికి సరిపడా పెరగకపోవచ్చు. తల్లయిన తర్వాత బిగువు సడలి, జారిపోవచ్చు. కేన్సర్‌తో పూర్తిగా రొమ్మునే కోల్పోయే పరిస్థితీ తలెత్తవచ్చు. అయితే ఏ కారణంగా రొమ్ముల్లో లోపాలు ఎదురైనా వాటిని చికిత్సలతో సరిచేసుకునే వీలుంది. 


రొమ్ముల పరిమాణాన్ని బ్రెస్ట్‌ ఇంప్లాంట్స్‌, లేదా ఫ్యాట్‌ ఆగ్మెంటేషన్‌తో పెంచుకోవచ్చు. ఎవరికి ఏ ప్రత్యామ్నాయం ఎంచుకోవాలనేది వారి వారి శరీరాల తీరు, సాధ్యాసాధ్యాల మీద ఆధారపడి ఉంటుంది.


ఫ్యాట్‌ ఆగ్మెంటేషన్‌: ఫ్యాట్‌ ఆగ్మెంటేషన్‌లో ఓ పరిమితి మేరకే రొమ్ములను పెంచగలిగే వీలుంటుంది. పొత్తికడుపు, తొడలు, పిరుదుల నుంచి లైపోసక్షన్‌ ద్వారా కొవ్వును సేకరించి, శుద్ధి చేసి, రొమ్ముల్లో ఇంజెక్ట్‌ చేస్తారు. కాబట్టి ఆయా ప్రదేశాల్లో సరిపడా కొవ్వును కలిగి ఉండాలి. పైగా ఫ్యాట్‌ ఆగ్మెంటేషన్‌తో ఒక కప్‌ సైజు మేరకే (ఒక అంగుళం) రొమ్ములను పెంచే వీలుంటుంది. ఒకేసారి ఎక్కువ మోతాదులో కొవ్వును సేకరించి, ఇంజెక్ట్‌ చేయడం వల్ల సరిపడా రక్తప్రసరణ జరగక సిస్ట్‌లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పరిమితికి లోబడే వైద్యులు కొవ్వును ఇంజెక్ట్‌ చేస్తారు. 


బ్రెస్ట్‌ ఇంప్లాంట్స్‌: రెండు నుంచి మూడు సైజుల మేరకు రొమ్ముల పరిమాణాన్ని పెంచుకునేవాళ్లు సిలికాన్‌ ఇంప్లాంట్స్‌ను ఆశ్రయించవచ్చు. చర్మం మందం, రొమ్ముల బేస్‌ డయామీటరు ఆధారంగా ఇంప్లాంట్‌ను చర్మం అడుగున ఉంచాలా లేక కండరం అడుగున ఉంచాలా అనేది వైద్యులు నిర్ణయిస్తారు. అలాగే రొమ్ములు ఎబ్బెట్టుగా కనిపించకుండా ఉండడం కోసం కొలతలను సేకరించి, వాటిని ఇంప్లాంట్‌ కంపెనీలకు వైద్యులు పంపిస్తారు. సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా ఆయా కంపెనీలు వేర్వేరు ఇంప్లాంట్స్‌తో సమకూరే వేర్వేరు ఆకారాల నమూనాలను అందిస్తాయి. వాటిలో తగిన ఇంప్లాంట్‌తో వైద్యులు సర్జరీ ముగిస్తారు. అయితే ఇంప్లాంట్స్‌తో అవసరానికి మించి పరిమాణం పెంచుకోవాలనుకోవడం సరి కాదు. ఇలాంటి పెద్ద పరిమాణం ఇంప్లాంట్స్‌తో సర్జరీ తదనంతర సమస్యలు ఎదురుకావచ్చు. 


జారితే పైకి లేపి...

పిల్లలు పుట్టిన తర్వాత, హార్మోన్ల ఉధృతి తగ్గి రొమ్ముల పటుత్వం, బిగువు తగ్గుతుంది. దాంతో సైజు తగ్గడంతో పాటు రొమ్ములు కిందకు జారతాయి. వాటిని పూర్వ స్థితికి తీసుకురావడం కోసం ఆగ్మెంటేషన్‌ మాస్టోపెక్సీని వైద్యులు ఆశ్రయిస్తారు. సాగిన తీవ్రత ఆధారంగా గ్రేడ్‌ను అంచనా వేసి, ఇంప్లాంట్‌ అమర్చడంతో పాటు, అదే సమయంలో బ్రెస్ట్‌ లిఫ్ట్‌ను కూడా చేసేస్తారు. చనుమొన భుజం, మోచేతికి సరిగ్గా మధ్యలో ఉంటే అది సరైన రొమ్ము పొజిషన్‌. ఈ కొలతల ఆధారంగా చనుమొనలను పైకి లేపే పద్ధతిని వైద్యులు అనుసరిస్తారు. అదే సమయంలో వదులుగా మారిన చర్మాన్ని తొలగించి, అవసరం మేరకు ఇంప్లాంట్‌ను అమరుస్తారు. చిన్నగా.. చింతలేకుండా....పెద్ద పరిమాణంలోని రొమ్ములను తగ్గించడం కోసం స్థానభ్రంశం చెందిన రొమ్ము కణజాలాన్ని సరిచేయవలసి ఉంటుంది. రొమ్ము బరువు పెరిగినప్పుడు, బిగుతుగా పైకి లేపి ఉంచే కణజాలం కిందకు జారుతుంది కాబట్టి, దాన్ని తిరిగి యధాస్థానానికి తీసుకురావడంతో పాటు, జారిన నిపుల్‌ ఏరియాను కూడా పైకి తీసుకురావలసి ఉంటుంది. ఇందుకోసం కొంత మేరకు కొవ్వు, రొమ్ము గ్లాండ్‌ను కూడా తొలగించవలసి రావచ్చు. గ్లాండ్‌ను తొలగించడం వల్ల సర్జరీ తదనంతరం రొమ్ముల పరిమాణం మళ్లీ పెరిగే అవకాశం ఉండదు.


హెచ్చుతగ్గులుంటే...

ఒక రొమ్ము చిన్నగా, మరొకటి పెద్దగా ఉంటే, చిన్నగా ఉన్న రొమ్మును పెంచి, పెద్దగా ఉన్నదాన్ని తగ్గించే విధానాన్ని వైద్యులు అనుసరిస్తారు. వాల్యూమెట్రిక్‌ అసెస్‌మెంట్‌ ఆధారంగా ఏ రొమ్మును ఎంత పెంచాలో, దేన్ని ఎంత తగ్గించాలో వైద్యులు అంచనా వేస్తారు. ఆ ప్రకారం కొవ్వుతో లేదా ఇంప్లాంట్‌తో పెంచి, బ్రెస్ట్‌ రిడక్షన్‌ ద్వారా తగ్గించి, రెండు రొమ్ములూ ఆకారంలో, పరిమాణంలో సమంగా ఉండేలా సరిదిద్దుతారు. 


కేన్సర్‌తో రొమ్మును కోల్పోతే... 

కేన్సర్‌ ప్రాథమిక దశలో ఉండి, తిరగబెట్టే అవకాశాలు లేవని వైద్యులు నిర్థారించినప్పుడు కేన్సర్‌ సోకిన రొమ్మును తొలగించే సమయంలో పొట్ట దగ్గరి కొవ్వును ఫ్లాప్‌ సహాయంతో, రొమ్ము స్థానంలో భర్తీ చేస్తారు. కేన్సర్‌ సర్జరీ, రేడియేషన్‌, కీమోథెరపీలన్నీ పూర్తయి వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న ఏడాది తర్వాత కూడా బ్రెస్ట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ సర్జరీ చేయవచ్చు. ఇందుకోసం ఫ్లాప్‌ తరహా సర్జరీతో లేదా సరిపడా కొవ్వు లేని వాళ్లకు రొమ్ము ప్రదేశంలో సిలికాన్‌ బెలూన్లతో చర్మాన్ని సాగేలా చేసి, తర్వాత వాటి స్థానంలో ఇంప్లాంట్స్‌ అమరుస్తారు. కేన్సర్‌ చివరి దశలో కేన్సర్‌ సోకిన రొమ్ము రేడియేషన్‌ను తట్టుకునే స్థితిలో కూడా ఉండకపోవచ్చు. ఇతరత్రా రీకన్‌స్ట్రక్షన్‌ ప్రక్రియలకు అనువుగానూ ఉండకపోవచ్చు. కాబట్టి వైద్యులు రేడియేషన్‌ను తట్టుకోగలిగేలా వీపు కండరంతో రొమ్మును కప్పేస్తూ, రొమ్ము ఆకారాన్ని తలపించేలా రీకన్‌స్ట్రక్ట్‌ చేస్తారు. ఈ సర్జరీతో రేడియేషన్‌ను తట్టుకోగలిగే సామర్థ్యం దక్కడంతో పాటు, రోగి జీవన నాణ్యత పెరుగుతుంది. రోగి అంతిమ జీవితాన్ని సంతృప్తికరంగా, సౌకర్యవంతంగా కొనసాగించడమే ఈ రకమైన పాలియేటివ్‌ రీకన్‌స్ట్రక్షన్‌ సర్జరీ ఉద్దేశం. 


ఇన్‌ఫెక్షన్‌ కేన్సర్‌ కాదు 

గరుకైన ఉపరితలంతో కూడి ఇంప్లాంట్‌ మూలంగా శరీర కణజాలం రియాక్షన్‌కు గురై ఎఎల్‌సిఎల్‌ (అనాప్లాస్టిక్‌ లార్జ్‌సెల్‌ లింఫోమా) అనే పరిస్థితి అరుదుగా తలెత్తుతుంది. ఈ సమస్య ఇంప్లాంట్స్‌ అమర్చుకున్న 30 వేల మంది మహిళల్లో ఒకరికి తలెత్తవచ్చు. దీన్ని కేన్సర్‌గా భ్రమపడి, ఇంప్లాంట్స్‌ అమర్చుకోవడం వల్ల కేన్సర్‌ సోకుతుందనే పుకార్లు మొదలయ్యాయి. కానీ గరుకైన ఉపరితలంతో కూడి ఇంప్లాంట్‌ వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని పరిశోధనల్లో సైతం రుజువైంది. ఇన్‌ఫెక్షన్‌ మొదలైనప్పుడు, ఇంప్లాంట్‌నూ, ఇన్‌ఫెక్షన్‌కు గురైన కణజాలాన్ని తొలగిస్తే ఎటువంటి సమస్యా ఉండదు. తిరిగి మరొక ఇంప్లాంట్‌ను కూడా అమర్చుకోవచ్చు. గరుకైన ఇంప్లాంట్స్‌కు బదులుగా నునుపుగా ఉండే ఇంప్లాంట్‌ను ఎంచుకోవడం అన్నిటికంటే ముఖ్యం.


ఇంప్లాంట్‌ కేర్‌

బ్రెస్ట్‌ ఇంప్లాంట్‌ అమర్చిన తర్వాత రెండు నెలల వరకూ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే...


సర్జికల్‌ బ్రేసరీ: సర్జరీ తర్వాత మూడు వారాల పాటు వీటిని తప్పక ధరించాలి. వీటితో రొమ్ములు సరైన ఆకారంలో కదలకుండా ఉండడంతో పాటు, సౌకర్యవంతమైన భావన కూడా కలుగుతుంది. అలాగే సర్జరీ తదనంతర ద్రవాల ఉత్పత్తి, నొప్పి తగ్గుతాయి.


క్రీమ్స్‌: స్కార్‌ రిడక్షన్‌ క్రీమ్స్‌తో కోత తాలూకు మచ్చలు తొలగిపోతాయి. కాబట్టి కొంత కాలం పాటు వీటిని వాడుకోవాలి. వ్యాయామాలు: వ్యాయామంతో రొమ్ముల మీద ఒత్తిడి పడుతుంది. కాబట్టి రెండు నెలల పాటు వ్యాయామాలకు దూరంగా ఉండాలి. ఇంటిమసీ: వైద్యులు సూచించినంత కాలం శారీరక సాన్నిహిత్యానికి దూరంగా ఉండాలి.


ఇంప్లాంట్స్‌లో రౌండ్‌, ఎనాటమికల్‌ అనే రెండు రకాలుంటాయి. గుండ్రంగా కనిపించేవి ఎక్కువగా వాడుకలో ఉంటాయి. చవక కూడా. టియర్‌ డ్రాప్‌ ఆకారంలో ఉండే ఎనటామికల్‌ ఇంప్లాంట్స్‌ సహజసిద్ధమైన రూపాన్ని ఇస్తాయి. ఇవి ఖరీదైనవి. పూర్తి రొమ్ముకు గుండ్రని ఆకారాన్ని తీసుకురావడం కోసం రౌండ్‌ ఇంప్లాంట్స్‌ ఎంచుకోవచ్చు. రొమ్ము అడుగు భాగం పలుచగా ఉన్నవాళ్లు ఎనటామికల్‌ ఇంప్లాంట్స్‌ ఎంచుకోవచ్చు. వేర్వేరు పరిమాణాల్లో ఉండే ఈ ఇంప్లాంట్లనీ సెవెంత్‌ జనరేషన్‌కు చెందినవి. 1960లలో సిలికాన్‌ ఆయిల్‌తో రూపొందడం మొదలైన ఈ ఇంప్లాంట్స్‌ నేడు కొహెసివ్‌ సిలికాన్‌ జెల్‌తో తయారవుతున్నాయి. పూర్వం ఇంప్లాంట్స్‌ పొరపాటున చిరిగిపోతే, నూనె కారిపోయి, సమస్యలు ఎదురయ్యేవి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఒకసారి ఇంప్లాంట్స్‌ అమర్చిన తర్వాత 15 ఏళ్ల వరకూ ఎటువంటి సమస్యా ఉండదు. అరుదుగా 20 వేల మందిలో ఒకరిద్దరికి లీకేజ్‌ సమస్య తలెత్తవచ్చు. ఎమ్మారైలో లీక్‌ను నిర్థారించుకుని, వైద్యులు ఇంప్లాంట్‌ను తొలగిస్తారు. తిరిగి మరొక ఇంప్లాంట్‌ను కూడా అమర్చుకోవచ్చు. 


డాక్టర్‌ రాజేష్‌ వాసు,

కన్సల్టెంట్‌ ప్లాస్టిక్‌ అండ్‌ ఈస్థటిక్‌ సర్జన్‌,

కేర్‌ హాస్పిటల్స్‌, హైటెక్‌ సిటీ, హైదరాబాద్‌.

Updated Date - 2022-04-12T16:54:09+05:30 IST