సంక్షేమ పథకాలకు బ్రేక్‌!

ABN , First Publish Date - 2022-01-17T06:46:09+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ప్రకటించి ప్రచారం చేసుకున్న పథకాలు ఏవీ ముం దుకు సాగడం లేదు. జిల్లాలో రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, దళితబస్తీ మినహా అన్నింటిదీ ఇదే పరిస్థితి. నిధులతో ముడిపడి ఉండడంతో ప్లాన్‌ ప్రకారమే సర్కారు ఆలస్యం చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. దీంతో అర్హులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తు కార్యాలయాల చుట్టు తిరుగుతున్నారు.

సంక్షేమ పథకాలకు బ్రేక్‌!
మావల గ్రామంలోని న్యూహౌజింగ్‌ బోర్డులో కొనసాగుతున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులు

పత్తా లేని డబుల్‌ బెడ్‌రూంల పంపిణీ

జిల్లావ్యాప్తంగా 15వేల వరకు ఇల్లు లేని పేద కుటుంబాలు

దరఖాస్తుల దగ్గరే ఆగిన ఆసరా పింఛన్లు

57ఏళ్లు నిండిన వారి పింఛన్ల పథకం ఊసేలేదు

జాడలేని దళితబంధు, గొర్రెల పంపిణీ, నిరుద్యోగ భృతి

గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్న లబ్ధిదారులు

జిల్లాలో కొనసాగుతున్న రైతుబంధు, 

దళితబస్తీ,  కల్యాణలక్ష్మి పథకాలు మాత్రమే..

ఆదిలాబాద్‌ టౌన్‌, జనవరి 16: రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ప్రకటించి ప్రచారం చేసుకున్న పథకాలు ఏవీ ముం దుకు సాగడం లేదు.  జిల్లాలో రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, దళితబస్తీ మినహా అన్నింటిదీ ఇదే పరిస్థితి. నిధులతో ముడిపడి ఉండడంతో ప్లాన్‌ ప్రకారమే సర్కారు ఆలస్యం చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. దీంతో అర్హులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తు కార్యాలయాల చుట్టు తిరుగుతున్నారు. అలాగే అధికారులు సైతం రేపోమాపో అంటూ వెనక్కి పంపిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సమయానికి నిధులు రాకపోవడంతోనే పథకాలు మధ్యలోనే ఆగిపోతున్నాయని అంటున్నారు. దళిత కుటుంబానికి రూ.10లక్షల పంపిణీ మొదలు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, గొర్ల పంపిణీ, 57ఏళ్లు నిండిన వారికి ఆసరా పింఛన్లు, రుణమాఫీ ఇలా పథకాలన్నింటికీ దరఖాస్తుల గడువు పెంపు దగ్గరే బ్రేకులు పడ్డా యి. దళితబంధు స్కీమ్‌ ద్వారా ఇప్పటి వరకు దరఖాస్తులే ప్రారంభంకాక పోగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకాన్ని ప్రకటించి ఏడేళ్లు అవుతున్నా.. జిల్లాలో సుమారు వెయ్యికిపైగా లబ్ధిదారులు ఎదురుచూపులతోనే కాలం గడిపేస్తున్నారు. కాగా 2017లో తెచ్చిన గొర్రెల పంపిణీ స్కీమ్‌ మూడేళ్లవుతున్నా.. ముందుకు సాగడం లేదు. మొదటి విడతలో 4,800 మంది పైచిలుకు గొల్ల, కుర్మలకు పథకం అందజేసి 2018-19 నుంచి రెండో విడతలో మాత్రం దరఖాస్తు చేసుకు న్న నాలుగు వేల మంది పైచిలుకు లబ్ధిదారులకు ఇప్పటికీ గొర్లపంపిణీ చేయలేదు. 

1,853 మందికి భూ పంపిణీ

జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా ప్రవేశపెట్టిన దళితబస్తీ పథకంలో 1,853 మందికి మాత్రమే భూ పంపిణీ చేసింది. రూ.290 కోట్లతో 4718 ఎకరాల కు గాను 1,853 మందికి గడిచిన ఏడేళ్లలో భూ పంపిణీ చేసిన ఈ ప్రభుత్వం ప్రస్తుతం భూ పంపిణీ ఊసెత్తడం లేదు. ఇదిలా ఉంటే జిల్లా వ్యాప్తంగా ఇంకా వేల మంది దళితబస్తీ పథకం కోసం ఎదురుచూస్తున్నారు. లబ్ధిదారులు ఈ పథకం ఎప్పుడు ప్రారంభమవుతుందోనని ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యంగా దరఖాస్తు చేసుకున్న వారికి అకౌంట్లలో డబ్బులు జమ చేస్తారన్న ఆశతో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ఎమ్మెల్యేల ఇంటికి బారులు తీరుతున్నారు. ఉప ఎన్నికల కంటే ముందు మూడు ఎకరాల భూమి వస్తుందనుకున్న ఎమ్మెల్యేల ఇంటి చుట్టు తిరిగిన లబ్ధిదారులు నేడు మూడు ఎకరాల బూమి అటుం చితే.. రూ.10లక్షలు ఎప్పుడు ఇస్తారోనని ఆశపడుతున్నారు. అయితే జిల్లాలో ఇంకా దళితబందు పథకం రూపకల్పన కాకపోవడంతో మరో పక్క దళితబస్తీ భూములు వస్తాయోనని ఆశల పల్లకీలో లబ్ధిదారులు మునిగి తేలుతున్నారు. దీనిపై ప్రత్యేక గైడెన్స్‌ రూపొందించాల్సి ఉండ గా.. ఆ దిశగా ప్రభుత్వం సమావేశాలు గాని ప్రతిపాదనలు కాని లేకపోవడంతో జిల్లాలో అర్హులైన నిరుపేద లబ్ధిదారులు నిరాశకు లోనవుతున్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకనే దళితబంధు పథకం అమలు ఆలస్యమవుతుందనే ఆలోచన చేస్తున్నారు.

ఏడేళ్లయినా ‘డబుల్‌’ ఇల్లు రాకపాయే..

రాష్ట్రంలో నిరుపేదలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని రాష్ట్ర సర్కారు హామీ ఇచ్చి ఏడేళ్లవుతోంది. కాని ఇప్పటి వరకు బోథ్‌ నియోజక వర్గంలోని తాంసి మండలంలో గల బండల్‌నాగాపూర్‌లో వంద మందికిమాత్రమే ఈ ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇంకా వేల మంది నిరుపేదలు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇళ్లు నిర్మాణ దశలోనే ఉన్నాయని, మరికొన్ని ఇళ్లు నిర్మాణం పూర్తయినా లబ్ధిదారులకు ఇవ్వడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అలాగే జైనథ్‌ మండలంలో ఇప్పటికే పూర్తయిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వకపోవడంతో వారే స్వయంగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలోకి వచ్చి నివాసం ఉంటున్నారు. జిల్లాలోని ఆదిలాబాద్‌, బోథ్‌ నియోజకవర్గాల్లో కొన్నిచోట్ల నిర్మాణాలు పూర్తయినా.. మరికొన్ని చోట్ల నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించడంలో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులునిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం జిల్లాలో 10వేల పైచిలుకు ఇళ్లు లేని నిరుపేద లబ్దిదారులున్నట్లు తేలింది. ఇప్పుడు ఈ సంఖ్య 10 నుంచి 15 వేలకు చేరినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే జిల్లాలో వేలల్లో ఉన్న నిరుపేద లబ్ధిదారులకు ఇల్లు కట్టించేందుకు ఏడేళ్లు దాటుతుంటే... ఇంకా అర్హులైన పేదలకు ఎప్పుడు ఇళ్లు అందుతాయో తేలడం లేదంటున్నారు. సమయానికి సర్కారు నిధులు ఇవ్వక పోవడంతోనే ఇండ్ల నిర్మా ణం ముందుకు సాగడం లేదని అంటున్నారు. ఇదిలా ఉంటే  సొంత స్థలం ఉన్న వాళ్లు ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సహాయం చేస్తావని 2021-22 బడ్జెట్‌లో ప్రభుత్వం చెప్పినా.. ఇప్పటికీ దానికి సంబంధించిన ఎలాంటి గైడ్‌లైన్స్‌ రూపొందించలేదని, నిధులు విడుదల చేయలేదని ఆరోపిస్తున్నారు. దీంతో నెల రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా.. ఇక ఈ‘సారీ’.. అమలు లేనట్లేనని అధికారులు చెబుతున్నారు. 

కొత్త పింఛన్లు ఏమాయే?!

రాష్ట్రంలో గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పించన్లు మంజూరు చేయడం లేదు. దీంతో జిల్లాలో 17వేల మంది పైచిలుకు కొత్త దర ఖాస్తులు పేరుకుపోయాయి. ఓల్డెజ్‌ పింఛన్ల కోసం 57ఏళ్లు నిండిన వారి నుంచి 2021 ఆగస్టు, అక్టోబర్‌ నెలల్లో రెండు సార్లు దరఖాస్తులు తీసుకున్నారు. వారి దరఖాస్తుల పరిశీలనను ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రారంభించ లేదు. అంతేకాకుండా వాటికి సంబంధించిన గైడ్‌లెన్స్‌ను నేటికీ ప్రకటించ లేదు. 2021 ఆగస్టు నుంచే కొత్త పెన్షన్లు ఇస్తామని గత సిరిసిల్లా పర్యటనలో సీఎం కేసీఆరే స్వయంగా ప్రకటించినా.. ఇంత వరకు అమలుకు నోచుకోలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల ఓటర్‌ లిస్టు ఆధారంగా అధికారులు అర్హుల జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వం వద్ద ఉన్నప్పటికీ.. మీ సేవ కేంద్రాల ద్వారా ఆగస్టు 15నుంచి 31 వరకు దరఖాస్తులు స్వీకరించారు. దీంతో సుమారు 10 వేల మంది దరఖాస్తు చేసుకున్నా.. 57ఏళ్ల నుంచి 60 ఏళ్ల పైచిలుకు లబ్ధిదారుల దరఖాస్తులు కనీసం పరిశీలనకు నోచుకోవడం లేదు. వారందరు సెప్టెంబర్‌లో ఆసరా పింఛన్‌ మంజూరు అవుతుందని భావించినా సర్కారు పట్టించుకోలేదు. అంతేకాకుండా మరో 700 మంది కలిసి జిల్లావ్యాప్తంగా 10,700 మంది ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ గడువు ముగిసి నాలుగు నెలలు కావొస్తున్నా.. ఇప్పటి వరకు వెరిఫికేషన్‌ ప్రక్రియను ప్రారంభించ లేదు. వీటితో పాటు మూడేళ్లుగా ఏ రకమైన పింఛన్‌కు కూడా లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేయలేదు. అంతేకాకుండా గడిచిన మూడేళ్లలో ప్రమాదాల కారణంగా దివ్యాంగులుగా మారినవారు, భర్తను కోల్పోయిన వారు, బోదకాలు బాధితులు, 55ఏళ్లు నిండిన గీత, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, పాత పద్ధతి ప్రకారం 65ఏళ్లు నిండిన వృద్థులు కలిపి మొత్తం 10,700 మంది వరకు ఆసరా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారని అధికారులే చెబుతున్నారు. 

మూడు ఎకరాల భూ పంపిణీ అంతంతే..

భూమిలేని దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించి ఏడేళ్లు గడుస్తోంది. అయితే ప్రభుత్వ భూములను ఎక్కకడిక్కడ అమ్మేసుకుంటునప్పటికీ.. దళితులకు మాత్రం ఇచ్చేందుకు  ప్రభుత్వం భూమి లేదనడం పట్ల విమర్శలున్నాయి. జిల్లావ్యాప్తంగా 4,718 ఎకరాలు భూ పంపిణీ చేసినా.. ఇంకా వేల మంది నిరుపేద లబ్ధిదారులు దళితబస్తీ పథకం కోసం ఎదురు చూస్తున్నారు. 2014 ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకంలో ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 1,853 మందికి రూ.290 కోట్లతో 4718 ఎకరాలు మాత్రమే పంపిణీ చేసినట్లు ఆ శాఖ జిల్లా అధికారులు లెక్కలు చెబుతున్నాయి. ఇంకా నిరుద్యోగ భృతి విధి విధానాలకే దిక్కులేదని, 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా  నిరుద్యోగులకు ప్రతీనెల రూ.3016 చొప్పున భృతి ఇస్తామన్న హామీ నేటికీ అమలుకు నోచుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. నిరుద్యోగ భృతి కోసం 2020-21 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.1810 కోట్లు కేటాయించినా.. ఇప్పటికీ నిరుద్యోగులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని నిరుద్యోగులు గుర్రుమంటున్నారు. 2020-21 లెక్కల ప్రకారం జిల్లాలో 10 వేల మంది వరకు ఉన్న నిరుద్యోగులు 2021జనవరి 10 నాటికి 21వేల పైచిలుకు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలకు, హామీలకు ప్రాధాన్యతనిచ్చి వాటిని అమలు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. 

Updated Date - 2022-01-17T06:46:09+05:30 IST