ఆర్టీఏ అధికారుల బదిలీ కౌన్సెలింగ్‌కు బ్రేక్‌

ABN , First Publish Date - 2022-06-30T06:00:00+05:30 IST

ఆర్టీఏ అధికారుల బదిలీల కౌన్సెలింగ్‌కు అనూహ్యంగా బ్రేక్‌ పడింది. ఆ శాఖ అధికారుల బదిలీల్లో రాజకీయ నేతల ప్రమేయం ఎక్కువైన నేపథ్యంలో ట్రాన్సపోర్ట్‌ కమిషనర్‌ భాస్కర్‌ను ఉన్నట్లుండి బదిలీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి

ఆర్టీఏ అధికారుల బదిలీ కౌన్సెలింగ్‌కు బ్రేక్‌
ఆర్టీఏ కార్యాలయం

రాజకీయ పరిణామాలతో ట్రాన్సపోర్ట్‌ కమిషనర్‌ బదిలీ 

పాత పద్ధతిలోనే బదిలీలకు శ్రీకారం... 

నేడు తుది జాబితా విడుదల

అనంతపురం అర్బన, జూన 29:  ఆర్టీఏ అధికారుల బదిలీల కౌన్సెలింగ్‌కు అనూహ్యంగా బ్రేక్‌ పడింది.  ఆ శాఖ అధికారుల బదిలీల్లో రాజకీయ నేతల ప్రమేయం ఎక్కువైన నేపథ్యంలో ట్రాన్సపోర్ట్‌ కమిషనర్‌ భాస్కర్‌ను ఉన్నట్లుండి బదిలీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుధవారం వీడియోకాన్ఫరెన్స ద్వారా బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. ఆ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే రాష్ట్ర స్థాయిలో ఓ కీలక ప్రజాప్రతినిధి బదిలీల్లో జోక్యం నేపథ్యంతోనే ఆయన్ను  ఆ పదవి నుంచి తప్పించారన్న ఆరోపణలున్నాయి. కొత్త కమిషనర్‌గా రాజబాబుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో బదిలీల ప్రక్రియ సీన మారిపోయింది. ఆ శాఖ అధికారుల బదిలీల తుది దశ సమయంలో కమిషనర్‌పై బదిలీవేటు వేయడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. బుధవారం తొలి రోజు వీడియోకాన్ఫరెన్స ద్వారా ఏఎంవీఐలు, ఎంవీఐలు, ఏఓలకు జరగాల్సిన బదిలీల కౌన్సెలింగ్‌ను రద్దు చేశారు. ఇదివరకే ఒక్కో అధికారితో 10 స్థానాలతో ఆప్షనను తీసుకున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో పాత పద్ధతిలోనే ఆప్షన ఆధారంగా బదిలీలు చేయాలని నిర్ణయించారు. గురువారం సాయంత్రానికి నేరుగా అన్ని కేడర్ల అధికారుల బదిలీల జాబితాను విడుదల చేయనున్నట్లు కమిషనర్‌ కార్యాలయ వర్గాలు ఆ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ పరిస్థితుల్లో బదిలీల ప్రక్రియ ఏ మేరకు పారదర్శకంగా నిర్వహిస్తారో వేచిచూడాల్సిందే. 


Updated Date - 2022-06-30T06:00:00+05:30 IST