కీసర, జనవరి20 : కీసరగుట్ట శ్రీ భవాని శివదుర్గ సమేతశ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో అమ్మవార్లకు పూజలు నిలిపివేసేందుకు ఆలయ కమిటీ తీర్మానించినట్లు ఆలయచైర్మన్ తటాకం ఉమాపతి శర్మ, ఈవో సుధాకర్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 1986వ సంవత్సరంలో మూలవిరాట్ శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయానికి ఇరువైపుల శ్రీభవాని, శివదుర్గ అమ్మవార్లను ప్రతిష్ఠించారు. కాగా ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావడంతో నంది మండపం, అమ్మవార్ల ఆలయాల విస్తరణకు కమిటీ తీర్మానం చేసింది. దీనికి ముందుగా శ్రీశ్రీశ్రీ శృంగేరి జగద్గురువులను దర్శించి, వారి అనుమతితో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చైర్మన్ ఉమాపతి శర్మ తెలిపారు. అమ్మవార్ల ఆలయాల అభివృద్ధి ఆనంతరం అమ్మవార్లను పునఃప్రతిష్టించడం జరుగుతుందని తెలిపారు. కావున అమ్మవార్ల మూలనిర్మాణం విషయంలో భక్తులు ఎవ్వరైనా తమ సలహాలు, సూచనలు చేయాలని సూచించారు. 15 రోజుల్లోగా కీసరగుట్ట కార్యాలయంలో తెలియజేయాల్సిందిగా తెలిపారు.