Abn logo
May 29 2020 @ 04:28AM

విద్యార్థులు.. ‘సెట్‌’లయ్యేలా..

బీఆర్‌ఏయూ సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

జూలై 15 నుంచి పరీక్షలు

జూన్‌ 30 వరకు దరఖాస్తుల స్వీకరణ

అడ్మిషన్లు పెంచేందుకు అధికారుల చర్యలు

మెరుగైన విద్యా ప్రమాణాలు.. నాణ్యమైన వసతుల కల్పనకు కృషి 


(ఎచ్చెర్ల):డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ అభివృద్ధి దిశగా అడుగులేస్తోంది. గత ఏడాది జాతీయ స్థాయిలో స్వచ్ఛత అవార్డుతో రికార్డు సాధించింది. ఇటీవల 12బీ గుర్తింపు పొందగా, మరోవైపు నాక్‌ గుర్తింపునకు కృషి చేస్తోంది. ఎప్పటికప్పుడు వివిధ కోర్సులను ప్రవేశపెడుతూ.. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతోంది. నాణ్యమైన విద్యాప్రమాణాలు అందిస్తూ.. విద్యార్థి దశలోనే వారికి ఉపాధి మార్గం చూపడంలో కీలకపాత్ర పోషిస్తోంది. సొంతంగా రెండేళ్లుగా బీఆర్‌ఏయూ సెట్‌ నిర్వహిస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో అడ్మిషన్స్‌కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జూలై 15,16,17,18 తేదీల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి వచ్చే నెల 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది.   

కోర్సులెన్నో 

అంబేద్కర్‌ వర్సిటీలో ఎన్నో రకాల కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌లో సోషల్‌వర్క్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌, ఎకనామిక్స్‌, లైబ్రరీ సైన్స్‌ ఎంజేఎంసీ, ఎంఈడీ యోగా కోర్సులు ఉన్నాయి. కామర్స్‌కు వేరేగా సెట్‌ నిర్వహిస్తారు. లాంగ్వేజ్‌లో తెలుగు, ఇంగ్లీష్‌ కోర్సులు ఉన్నాయి. లైఫ్‌ సైన్స్‌స్‌లో బయోటెక్నాలజీ, మైక్రాబయాలజీ, జువాలజీ కోర్సులకు సెట్‌ నిర్వహిస్తారు. గణితంలో మేఽఽథమెటిక్స్‌, అప్లైడ్‌ మేథమెటిక్స్‌ కోర్సులు ఉన్నాయి. జియాలజీ కోర్సుకు ప్రత్యేకంగా సెట్‌ ఉంటుంది. ఫిజిక్స్‌, జియో ఫిజిక్స్‌ కోర్సులకు ఫిజిక్స్‌ విభాగంలో సెట్‌ జరుగుతుంది. కెమిస్ట్రీలో అనలెటికల్‌, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ కోర్సులకు సెట్‌ నిర్వహిస్తారు.


ఈ ఏడాది కొత్తగా ఎంఎస్సీ యోగా, అప్లైడ్‌ మేథమెటిక్స్‌ చెరొక 20 సీట్లతో ప్రవేశపెడుతున్నారు. వర్సిటీలోని ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల  సీట్లు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఐసెట్‌, లాసెట్‌ ద్వారా భర్తీ కానున్నాయి. పీజీ అడ్మిషన్లు పెంచే దిశగా వర్సిటీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వివిధ కోర్సులకు సంబంధించి జూలై 15 నుంచి ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మరోవైపు వర్సిటీలో అన్ని హంగులూ.. వసతులతో మరింత మెరుగైన విద్యాప్రమాణాలు అందించేందుకు కృషి చేస్తున్నారు. అరబిందో పరిశ్రమ ఆర్థిక సహకారంతో వర్సిటీలో ఆలా్ట్ర మోడర్న్‌ కిచెన్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం అరబిందో యాజమాన్యం వర్సిటీకి కోటి రూపాయలు కేటాయించింది. దీనివల్ల వర్సిటీ హాస్టల్‌ విద్యార్థులకు మెస్‌ బిల్లులు బాగా తగ్గనున్నాయి.   


మైలురాయిగా.. 12 బీ గుర్తింపు  

అంబేడ్కర్‌ వర్సిటీకి ఈ ఏడాది జనవరిలో దక్కిన 12బీ గుర్తింపు.. ఓ మైలురాయిగా చెప్పొచ్చు. ఈ గుర్తింపుతో యూజీసీ నుంచి నిధులు నేరుగా విడుదలయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని వివిధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొనే వీలుంది. దీనివల్ల సెమినార్‌లు, వర్క్‌షాపులు, కాన్ఫరెన్స్‌లు, పరిశోధనకు సంబంధించిన కార్యక్రమాలు విరివిగా జరగనున్నాయి. ఇప్పటివరకు అంబేడ్కర్‌ వర్సిటీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు, అంతర్గతంగా సమీకరించిన నిధులతో నెట్టుకొస్తోంది. 12బీ గుర్తింపుతో నిధుల సమస్య నుంచి గట్టెక్కనుంది. 


 ‘నాక్‌’ గుర్తింపునకు యత్నం

అంబేడ్కర్‌ వర్సిటీకి నాక్‌ (నేషనల్‌ ఎసెస్‌మెంటు అండ్‌ అక్రిడేషన్‌ ఏజెన్సీ) గుర్తింపునకు యత్నాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర మానవ వనరుల శాఖ పరిధిలో నాక్‌ గుర్తింపు లభిస్తే వర్సిటీకి చాలా ప్రయోజనం చేకూరుతుంది. లాక్‌డౌన్‌ కారణంగా నాక్‌ ప్రయత్నాలకు బ్రేక్‌ పడినా, త్వరలోనే ఇది సాధిస్తామని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 


భవన నిర్మాణాలకు సీపీడబ్ల్యూతో ఒప్పందం 

అంబేద్కర్‌ యూనివర్సిటీలో భవన నిర్మాణాలను కేంద్ర పనుల విభాగం (సీపీడబ్ల్యూ) పర్యవేక్షణలో చేపట్టేందుకు అంగీకారం కుదిరింది. వర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతో పాటు, అంతర్గతంగా సమీకరించిన నిధులు మొత్తంగా రూ.60కోట్లతో  వివిధ భవన నిర్మాణ పనులు చేపట్టనున్నారు. అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ రూ.12కోట్లతో, అకడమిక్‌ బ్లాక్‌లో లైబ్రరీ, క్లాస్‌ రూమ్స్‌, ఎడ్యుకేషన్‌ బిల్డింగ్‌ రూ.14 కోట్లతో, ఇండోర్‌ స్టేడియం, జిమ్‌ రూ.2.5 కోట్లతో నిర్మించనున్నారు. ఎగ్జామినేషన్‌ బ్లాక్‌ రూ.3.5 కోట్లతో, అదనంగా హాస్టల్స్‌ నిర్మాణానికి రూ.3 కోట్లు, గెస్ట్‌ హౌస్‌కు ఒక కోటి రూపాయలు ప్రభుత్వ నిధులు, వర్సిటీ నిధులు 3 కోట్లు, ప్రత్యేకించి బాలుర హాస్టల్స్‌ రూ.10 కోట్లు, బాలికల హాస్టల్స్‌ రూ.5 కోట్లు, వర్సిటీ నిధులు రూ.2 కోట్లతో స్పోర్ట్స్‌ అభివృద్ధికి కేటాయించనున్నారు. 


ఉన్నత విద్యతో భవిత.. ప్రొఫెసర్‌ కూన రాంజీ, వీసీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ 

విద్యార్థులు డిగ్రీతో చదువుకు సరిపెట్టకుండా ఉన్నత విద్యను అభ్యసించి ఉజ్వల భవిత పొందాలి. అంబేడ్కర్‌ వర్సిటీలో చాలా వరకు కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చాం. ఇప్పటికే 12బీ గుర్తింపు రావడంతో వర్సిటీకి జాతీయస్థాయిలో ఖ్యాతి లభించింది. 


అడ్మిషన్ల పెంపుపై దృష్టి .. ప్రొఫెసర్‌ గుంట తులసీరావు, డైరెక్టర్‌ ఆఫ్‌ డైరెక్టరేట్‌ అడ్మిషన్స్‌, అంబేడ్కర్‌ యూనివర్సిటీ 

2020-21 విద్యా సంవత్సరంలో పీజీ అడ్మిషన్లను గణనీయంగా పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. అన్ని వసతులు, డిజిటల్‌ లైబ్రరీని వర్సిటీలో ఏర్పాటు చేస్తున్నాం. పీజీ సర్టిఫికేటుతో పాటు ఉద్యోగం పొందేలా నైపుణ్యాన్ని పెంపొందిస్తాం. 

Advertisement
Advertisement
Advertisement