ఎల్‌ఏసీకి బ్రహ్మోస్‌ క్షిపణి

ABN , First Publish Date - 2020-09-29T07:47:15+05:30 IST

నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించే డ్రాగన్‌ దేశం చైనాకు దాని భాషలోనే భారత్‌ సమాధానం చెబుతోంది. గల్వాన్‌ ఉద్రిక్తత తర్వాత వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి డ్రాగన్‌ భారీగా యుద్ధవిమానాలు, సైన్యం, శతఘ్నులను మోహరించింది...

ఎల్‌ఏసీకి బ్రహ్మోస్‌ క్షిపణి

  • ఆకాశ్‌, నిర్భయ్‌ కూడా.. డ్రాగన్‌ చర్యకు ప్రతిచర్య!
  • కీలక ప్రాంతాల్లో మోహరింపు
  • ఆయుధాల కొనుగోలుకు కేంద్రం ఆమోదం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 28: నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించే డ్రాగన్‌ దేశం చైనాకు దాని భాషలోనే భారత్‌ సమాధానం చెబుతోంది. గల్వాన్‌ ఉద్రిక్తత తర్వాత వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి డ్రాగన్‌ భారీగా యుద్ధవిమానాలు, సైన్యం, శతఘ్నులను మోహరించింది. భారత్‌ కూడా అదే స్థాయిలో సైనిక, వైమానిక దళాలను సరిహద్దుల్లో పెట్టింది. తాజాగా.. బ్రహ్మోస్‌, ఆకాశ్‌, నిర్భయ్‌ లాంటి క్షిపణులను చైనా సరిహద్దుల్లోని వ్యూహాత్మక ప్రదేశాలకు తరలించింది. హిందూ మహాసముద్రంలోని కార్‌ నికోబర్‌ ఎయిర్‌బేస్‌ వద్ద కూడా సుఖోయ్‌ యుద్ధ విమానాలతోపాటు.. ఆకాశ్‌ వంటి క్షిపణులను సిద్ధంగా పెట్టింది. డ్రాగన్‌ చర్యలకు వెంటనే ప్రతిచర్యలు ఉంటాయని గట్టి సంకేతాలను పంపించింది. బ్రహ్మోస్‌ క్రూయిజ్‌ మిసైల్‌ గగనతలం నుంచి గగనతలం, భూతలాల్లోని 500 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగలదు. ఇది 300 కిలోల బరువున్న వార్‌హెడ్‌ను మోసుకుపోగలదు. జింగ్‌జియాన్‌, టిబెట్‌లోని చైనా యుద్ధ విమాన స్థావరాలు బ్రహ్మోస్‌ పరిధిలో ఉండేలా భారత్‌ వ్యూహాత్మక ప్రదేశాల్లో వాటిని మోహరించింది. ఇక ఆకాశ్‌ కూడా భారత అమ్ముల పొదిలో ఉన్న ప్రత్యేకమైన క్షిపణి. ఇది భూతలం నుంచి గగనతలంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదిస్తుంది. దీని పరిధి 40 కిలోమీటర్లు. ఎల్‌ఏసీ వెంబడి దౌలత్‌ బేగ్‌ ఓల్డీ, కారాకోరమ్‌ పాస్‌ వైపు వచ్చే చైనా విమానాలే లక్ష్యంగా ఆకాశ్‌ను సిద్ధం చేశారు. నిర్భయ్‌.. భూతలం నుంచి భూతలానికి ఏకంగా 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని తుత్తునీయలు చేస్తుంది.

చైనా సైన్యం ఇప్పటికే.. 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే క్షిపణులను టిబెట్‌, జిన్‌జియాంగ్‌, ఆక్సాయ్‌చిన్‌, కాస్ఘర్‌, హోటాన్‌, లాసా, నీంగ్చీ ప్రాంతాల్లో పెట్టింది. అంటే.. ఎల్‌ఏసీ వెంబడి లద్దాఖ్‌ మొదలు, తూర్పు ప్రాంతం దాకా చైనా సన్నద్ధంగా ఉందని స్పష్టమవుతోంది. చైనా కుయుక్తలను ఎదుర్కొనేందుకు భారత్‌ కూడా సరిహద్దుల్లో క్షిపణులను మోహరించక తప్పలేదని అధికారులు అంటున్నారు.




అమెరికా నుంచి ఆయుధాలు



8 వీటి విలువ సుమారు 2,290 కోట్లు

చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో.. భారత సైన్యం కోసం అమెరికా నుంచి రూ. 2,290 కోట్లు విలువ చేసే ఆయుధాలను కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని రక్షణ ఉత్పత్తుల కొనుగోలు మండలి(డీఏసీ) సోమవారం ఉత్తర్వులిచ్చింది. ఈ ఆయుధాల్లో 72 వేల అధునాతన రైఫిళ్లు(సిగ్‌ సౌయెర్‌) ఇప్పటికే భారత సైన్యానికి చేరాయి. వీటి విలువ రూ. 780 కోట్లు. దీంతోపాటు.. రూ. 970 కోట్లతో దేశీయంగా తయారైన యాంటీ-ఎయిర్‌ ఫీల్డ్‌ ఆయుధాలను కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. మరో రూ.880 కోట్లతో ఇజ్రాయెల్‌ నుంచి లైట్‌ మెషీన్‌ గన్‌ (ఎల్‌ఎంజీ)లను కొనుగోలు చేయనుంది. ఇవేకాకుండా.. రష్యా సాంకేతిక పరిజ్ఞానంతో 6.71 లక్షల ఏకే-203 రైఫిళ్లను అమేఠీలోని కోర్వా ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో తయారు చేస్తోంది. వీటి విలువ రూ. 4,358 కోట్లుగా ఉంటుందని అంచనా.


Updated Date - 2020-09-29T07:47:15+05:30 IST