రూ.90 కోట్లు ఇస్తేనే..!

ABN , First Publish Date - 2020-07-05T10:51:07+05:30 IST

రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన్‌ ద్వారా కృష్ణా జలాలు కరువు పల్లెలకు మళ్లించి సస్యశామలం చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.

రూ.90 కోట్లు ఇస్తేనే..!

బ్రహ్మం సాగర్‌ ఆనకట్ట లీకేజీ

డయాఫ్రం వాల్‌ నిర్మించాలని నిపుణుల సూచన

రూ.50 కోట్లకు ప్రతిపాదనలు

అసంపూర్తి కాలువ నిర్మాణాలకు మరో రూ.40 కోట్లు

ప్రభుత్వం స్పందించకపోతే 17 టీఎంసీల నిల్వ అసాధ్యం

1.50 లక్షల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకమే


(కడప - ఆంధ్రజ్యోతి): రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన్‌ ద్వారా కృష్ణా జలాలు కరువు పల్లెలకు మళ్లించి సస్యశామలం చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. కొత్త ప్రాజెక్టుల ముసుగులో పాత ప్రాజెక్టులను విస్మరిస్తున్నారు. కాస్త నిధులిచ్చి మరమ్మతులు చేపడితే వేల ఎకరాలకు సాగునీరు.. లక్షల జనాభాకు తాగునీరు ఇవ్వవచ్చు. వాటి జోలికి వెళ్లడం లేదు. ఫలితంగా వందల కోట్లు వెచ్చించి నిర్మించిన కాల్వలు ముళ్ల పొదలతో శిథిలావస్థకు చేరుతున్నాయి. ఆయకట్టకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. తెలుగుగంగ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్రహ్మంసాగర్‌ జలాశయం, కుడి, ఎడమ కాలువలే ఇందుకు దర్పణం. జలాశయం లీకేజీ మరమ్మతులు, అసంపూర్తి కాల్వలకు దాదాపుగా రూ.90 కోట్లు నిధులిస్తే 1.50 లక్షల ఎరకాలకు సాగునీరు ఇవ్వవచ్చు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు శూన్యం. ఆ వివరాలపై ప్రత్యేక కథనం.


తెలుగుగంగ ప్రాజెక్టులో భాగంగా 17 టీఎంసీల సామర్థ్యంతో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి (ఎస్‌పీవీబీ) జలాశయానికి (బ్రహ్మం సాగర్‌) ఎన్టీఆర్‌ రూపకల్పన చేశారు. జిల్లాలో బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాల్లో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు, ఆయా గ్రామాల ప్రజలకు తాగునీరు అందించాలని ప్రధాన లక్ష్యం. బ్రహ్మంసాగర్‌ నిర్మాణం 1983-84లో చేపట్టి, 2006లో పూర్తి చేశారు. ప్రధాన మట్టి ఆనకట్ట పొడవు 2.50 కి.మీలు. ఎత్తు 50 మీటర్లు. హెడ్‌ సూయిస్‌, రక్షణ గోడలు, కుడి, ఎడమ వైపుల్లో హెడ్‌ స్లూయిస్‌, రాతిపరుపు వంటి నిర్మాణాలు పూర్తి చేశారు. 


మరమ్మతులకు రూ.50 కోట్లు అవసరం

2007లో తొలిసారిగా 208 మీటర్ల లెవల్‌లో 13 టీఎంసీలు నిల్వ చేయగా.. ఆనకట్ట నుంచి లీకేజీలు ఏర్పడ్డాయి. పలుమార్లు నిపుణుల కమిటీ పరిశీలించి మరమ్మతులకు పలు సూచనలు చేశారు. 13 ఏళ్లుగా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. తాజాగా ఫిబ్రవరి నెలలో నిపుణుల కమిటీ మరోమారు డ్యాంను పరిశీలించారు. లీకేజీ ప్రాంతంలో గరిష్ట నీటి మట్టం 216.5 మీటర్ల నుంచి దిగువ బాటమ్‌ లెవల్‌ వరకు 100 మీటర్లు పొడవు, 50 మీటర్ల ఎత్తులో ‘డయాఫ్రం వాల్‌’ నిర్మాణం, ఆనకట్ట బయట వైపున శాండ్‌ ఫిల్టర్‌ నిర్మించాలని సూచించారు. సుమారుగా రూ.50 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదిక పంపారు. నెలలు గడుస్తున్నా నిధుల ఊసే లేదు. దీంతో ఈ ఏడాది కూడా 17 టీఎంసీల నిల్వ ఆసాధ్యమే.


అసంపూర్తిగా పంట కాలువలు

బ్మహ్మం సాగర్‌ కుడి, ఎడమ ప్రధాన కాలువలు, పంట కాలువల నిర్మాణాలను 2004-05లో రూ.200 కోట్లతో ప్యాకేజీ-3 కింద చేపట్టారు. ఐవీఆర్‌సీఎల్‌, ఎస్‌ఈడబ్ల్యూ సంస్థలు జాయింట్‌ వెంచర్‌గా ఈ పనులు దక్కించుకున్నాయి. 15 ఏళ్లు గడిచినా పంట కాలువ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ప్యాకేజీ -3 కింద సీసీ లైనింగ్‌ కోసం 2010-11లో రూ.122 కోట్లతో టెండర్లు పిలిస్తే.. ఆ సంస్థలు దక్కించుకుని పనులు చేపట్టారు. 90 శాతం పనులు పూర్తి అయ్యాయని ఇంజనీర్లు అంటున్నారు.


పిల్ల కాలువలు ఎక్కడికక్కడ అసంపూర్తిగా వదిలేశారు. కాంట్రాక్ట్‌ సంస్థ ప్రీక్లోజర్‌ (కాంట్రాక్ట్‌ రద్దు) కోసం దరఖాస్తు చేసిందని ఇంజనీర్లు తెలిపారు. ఐదారేళ్ల క్రితమే పనులు ఆపేయడం, నిర్వహణ లేక ముళ్లపొదలు, మట్టితో నిండిపోయి శిథిలావస్థకు చేరాయి. అసంపూర్తి పంట కాలువల నిర్మాణాలు, మరమ్మతులు చేసి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలంటే సుమారుగా రూ.30-40 కోట్లు అవసరమని ఇంజనీర్ల అంచనా. కాంట్రాక్ట్‌ సంస్థ నిర్వహణ పనులు చేయక.. ప్రభుత్వం కాంట్రాక్ట్‌ను రద్దు చేసి నిధులు ఇవ్వక పంట కాల్వలు చీలికలు పేలికలుగా మారుతున్నాయని రైతుల ఆవేదన.


ప్రభుత్వానికి నివేదించాం- శివారెడ్డి, ఈఈ, తెలుగుగంగ ప్రాజెక్టు, బద్వేలు 

బ్రహ్మంసాగర్‌ లీకేజీ అరికట్టేందుకు డయాఫ్రం వాల్‌ నిర్మించాలని నిపుణుల కమిటీ సూచించింది. ఇందుకు సుమారుగా రూ.50 కోట్లు నిధులు కావాలి. కుడి, ఎడమ ప్రధాన కాల్వలు, పంట కాలువలు 90 శాతం వరకు పూర్తి అయ్యాయి. కాంట్రాక్ట్‌ సంస్థలు ప్రీక్లోజర్‌ కోసం దరఖాస్తు చేశాయి. కాలువల నిర్వహణ పనులు చేయమని నోటీసులు జారీ చేశాం. బ్యాలెన్స్‌ పనులు చేయడానికి దాదాపుగా రూ.30-40 కోట్లు అవసరం అవుతుంది. నిధులిస్తే గడువులోగా పనులు పూర్తి చేస్తాం. ప్రస్తుతం కుడి, ఎడమ కాల్వల పరిధిలో చెరువులకు నీళ్లు నింపుతున్నాం. 30 వేల ఎకరాల వరకు సాగునీరు ఇస్తున్నాం.

Updated Date - 2020-07-05T10:51:07+05:30 IST