మధ్యాహ్నం భోజనం చేస్తుండగా ఒంటినిండా రక్తంతో గదిలోకి వచ్చిన విద్యార్థిని చూసి టీచర్లకు షాక్.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-08-26T18:28:58+05:30 IST

ఆ స్కూల్లో మధ్యాహ్నం బెల్ మోగింది. పిల్లలందరూ క్లాసురూమ్స్‌లో నుంచి బయటకు వచ్చి అల్లరి చేస్తున్నారు. టీచర్లు స్టాఫ్ రూంలో భోజనాలు చేస్తున్నారు.

మధ్యాహ్నం భోజనం చేస్తుండగా ఒంటినిండా రక్తంతో గదిలోకి వచ్చిన విద్యార్థిని చూసి టీచర్లకు షాక్.. అసలేం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఆ స్కూల్లో మధ్యాహ్నం బెల్ మోగింది. పిల్లలందరూ క్లాసురూమ్స్‌లో నుంచి బయటకు వచ్చి అల్లరి చేస్తున్నారు. టీచర్లు స్టాఫ్ రూంలో భోజనాలు చేస్తున్నారు. ఇంతలో ఒక విద్యార్థి పరిగెడుతూ స్టాఫ్ రూం వద్దకు వచ్చాడు. అతను వచ్చిన మార్గం మొత్తం రక్తమే! అలా స్టాఫ్ రూంకు వచ్చిన ఆ విద్యార్థి ఏమీ చెప్పకుండా అలానే కిందపడిపోయాడు. భోజనాలు చేస్తున్న టీచర్లకు ఏం జరుగుతుందో అర్థంకాలేదు. అయితే అతని శరీరం మొత్తం రక్తసిక్తమై ఉండటంతో వాళ్లు వెంటనే అప్రమత్తమయ్యారు. అప్పటికే అక్కడకు చేరుకున్న ఇతర విద్యార్థులు కూడా సహకరించడంతో.. సదరు విద్యార్థిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్రమైన గాయంతో ఉన్న అతనికి మెరుగైన వైద్యం అవసరమని భావించిన డాక్టర్లు అతన్ని జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ సదరు విద్యార్థి తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో వెలుగు చూసింది.


రాయ్‌గఢ్‌లోని కైలాష్ నాథ్ కాట్జూ ప్రభుత్వ పాఠశాలలో సాగర్ టాండన్ (14) అనే కుర్రాడు చదువుకుంటున్నాడు. 9వ తరగతి చదివే సాగర్.. మధ్యాహ్నం గంట మోగగానే తరగతి గది నుంచి బయటకు వచ్చాడు. స్కూల్ బయట అతనితో ఇద్దరు యువకులు గొడవపడ్డారు. పైతరగతికి చెందిన అమ్మాయి వెంటపడటం మానుకోవాలంటూ సాగర్‌ను బెదిరించారు. పిచ్చి చేష్టలు చేయొద్దంటూ అతన్ని కొట్టారు. ఆ సమయంలో సదరు అమ్మాయి కూడా అక్కడే ఉంది. సాగర్‌ను కొట్టడ చూసిన ఆమె.. ‘‘వాడిని భయపెడతారని మిమ్మల్ని తీసుకొచ్చా. ఎందుకలా కొడుతున్నారు’’ అని అడిగింది. ఈ సమయంలో కోపం తెచ్చుకున్న సాగర్.. ‘‘మనం మాట్లాడుకున్న మాటలు వీళ్లకెందుకు చెప్పావ్?’’ అంటూ ఆమెపై చెయ్యిచేసుకున్నాడు. ఇలా ఆ అమ్మాయిని అతను కొట్టడాన్ని చూడగానే.. బెదిరిస్తున్న యువకుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.


అదే సమయంలో సాగర్ స్కూల్లోకి పరిగెత్తాడు. అతన్ని వెంబడించిన ఇద్దరు యువకుల్లో ఒకడు.. తన వద్ద ఉన్న కత్తితో సాగర్‌ను పొడిచేశాడు. అనంతరం నిందితులిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన సాగర్.. రక్తం ధారలు కారుతుండగా  స్టాప్ రూం చేరుకున్నాడు. అతని వెనకే రక్తం గుర్తులు పడటాన్ని గమనించిన విద్యార్థులు కూడా అతన్ని వెంబడించారు. స్టాఫ్ రూంలో రక్తపు మడుగులో పడిపోయిన సాగర్‌ను కాపాడేందుకు వాళ్లంతా కలిసి అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అతని పరిస్థితిని చూసిన వైద్యులు.. సాగర్‌ను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ సాగర్ కన్నుమూశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సాగర్‌పై దాడి చేసిన ఇద్దరు యువకుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ గొడవకు కారణమైన అమ్మాయిని కూడా ప్రశ్నిస్తున్నారు. మరో యువకుడిని కూడా గుర్తించామని, అతన్ని కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. సదరు యువకులిద్దరూ మైనర్లని తెలుస్తోంది.

Updated Date - 2021-08-26T18:28:58+05:30 IST