పేదింట పుట్టి ఐఏఎస్‌గా ఎదిగి

ABN , First Publish Date - 2021-02-25T06:01:55+05:30 IST

నిరుపేద దళిత కుటుంబంలో పుట్టినా కష్టపడి ఉన్నత చదువులు చదివి ఐఏఎ్‌సగా రాణించి గ్రామానికి వన్నె తెచ్చిన మాజీ ఐఏ ఎస్‌ అనుములపురి రామలక్ష్మణ్‌(76) ఇకలేరు.

పేదింట పుట్టి ఐఏఎస్‌గా ఎదిగి
రామలక్ష్మణ్‌ (ఫైల్‌)

రిటైర్డ్‌ ఐఏఎస్‌ రామలక్ష్మణ్‌ కన్నుమూత 

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగానూ సేవలు

ఉమ్మడి రాష్ట్రంలో తొలి దళిత ఐఏఎస్‌గా గుర్తింపు


నల్లగొండ క్రైం, ఫిబ్రవరి 24: నిరుపేద దళిత కుటుంబంలో పుట్టినా కష్టపడి ఉన్నత చదువులు చదివి ఐఏఎ్‌సగా రాణించి గ్రామానికి వన్నె తెచ్చిన మాజీ ఐఏ ఎస్‌ అనుములపురి రామలక్ష్మణ్‌(76) ఇకలేరు. హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో బుధవారం కన్నుమూశారు. ఉమ్మడి రాష్ట్రంలో తొలి దళిత ఐఏఎస్‌ అధికారిగా పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నారు. నల్లగొండ మండల పరిధిలోని చిన్నసూరారం గ్రామానికి చెందిన అనుములపురి రామచంద్రయ్య-లక్ష్మమ్మ దంపతులకు 5వ తేదీ ఆగస్టు 1944లో జన్మించారు. కట్టంగూరు మండలం మునుకుంట్ల గ్రామంలో అమ్మమ్మ, తాతయ్య గాలి లక్ష్మమ్మ-వెంకయ్యల వద్ద పెరిగారు. మునుకుంట్లలోనే మూడో తరగతి వరకు చదివారు. 1954లో నాలుగో తరగతి చదివేందుకు నల్లగొండకు వచ్చి సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో ఉంటూ 12వ తరగతి వరకు చదివారు. 1962లో నిజాం కళాశాలలో బీఏ చదివి ఆర్ట్స్‌ కళాశాలలో ఎంఏ పబ్లిక్‌ అడ్మినిస్ర్టేషన్‌ను 1967లో పూర్తిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే మొదటి దళిత ఐఏఎస్‌ (1976బ్యాచ్‌)గా ఎంపికయ్యారు. వివిధ రాష్ర్టాల్లో కలెక్టర్‌గా, ఉమ్మడి ఏపీలో దేవాదాయశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. 9వ తరగతి చదివేటప్పుడు బాబు జగ్జీవన్‌రావు, తన హాస్టల్‌కు వచ్చారని రామ్‌లక్ష్మణ్‌ తన బయోగ్రఫీలో తెలిపారు.

ప్రభుత్వ సలహాదారుడిగా నియమించిన సీఎం కేసీఆర్‌

ఉద్యోగ విరమణ అనంతరం రామలక్ష్మణ్‌ రెవెన్యూ శాఖలో పనిచేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రాష్ట్రసాధనలో తనవంతు పాత్ర పోషించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్‌ రామలక్ష్మణ్‌కు ప్రభుత్వ సలహాదారుడి(సంక్షేమం) బాధ్యతలు అప్పగించారు. నాలుగేళ్లపాటు ఆ పదవిని సమర్థంగా నిర్వర్తించారు. రామలక్ష్మణ్‌కు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు హర్యానాలో ఐఏఎ్‌సగా పనిచేస్తున్నారు. స్వగ్రామం చిన్నసూరారంలో ఐదు ఎకరాల వ్యవసాయ భూమి, ఇల్లు ఉండటంతో ఏడాదికి ఒకసారి వచ్చివెళ్లేవారు. ఆయన మృతితో చిన్నసూరారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రామలక్ష్మణ్‌ అంత్యక్రియలు గురువారం హైదరాబాద్‌లోని రోడ్‌ నెం.10 పంచవతి కాలనీ నుంచి మొదలై మహాప్రస్థానంలో పూర్తి చేయనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Updated Date - 2021-02-25T06:01:55+05:30 IST