తగ్గేదేల్యా..!

ABN , First Publish Date - 2022-04-23T06:23:44+05:30 IST

క్రికెట్‌ బెట్టింగ్‌కు ప్రొద్దుటూరు పుట్టినిల్లు. అప్పట్లో ప్రొద్దుటూరుకే పరిమితమైన క్రికెట్‌ బెట్టింగ్‌ జిల్లా వ్యాప్తంగా విస్తరించింది. నగరాలు, పట్టణాల నుంచి పల్లెపల్లెకు ఈ బెట్టింగ్‌ జాడ్యం పాకింది. ఈజీ మనీకి అలవాటు పడ్డ కొందరు పందేలు కాస్తూ జీవితాలను నాశనం చేసుకుంటుంటే,

తగ్గేదేల్యా..!

ఐపీఎల్‌ టోర్నీలో బుకీల హాల్‌చల్‌

బుకీలకు పుష్కలంగా రాజకీయ అండదండలు

రూ.కోట్లల్లో పందేలు

బైండోవర్లతో బెట్టింగ్‌కు చెక్‌ పడేనా..?


ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లకు ఉన్న క్రేజ్‌ చెప్పనక్కరలేదు. దీన్నే తమకు అనుకూలంగా చేసుకుని బుకీలు చెలరేగిపోతున్నారు. పోలీసు దాడులు, హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా బడా బుకీలు తమ అనుచరగణంతో క్రికెట్‌ బెట్టింగ్‌ కార్యకలాపాలకు పాల్పడుతూ తగ్గేదేలే.. అనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. బుకీలు రెచ్చిపోవడానికి కారణం రాజకీయ అండదండలు పుష్కలంగా ఉండటమే అనే వాదన విన్పిస్తోంది.


ప్రొద్దుటూరు క్రైం, ఏప్రిల్‌ 22: క్రికెట్‌ బెట్టింగ్‌కు ప్రొద్దుటూరు పుట్టినిల్లు. అప్పట్లో ప్రొద్దుటూరుకే పరిమితమైన క్రికెట్‌ బెట్టింగ్‌ జిల్లా వ్యాప్తంగా విస్తరించింది. నగరాలు, పట్టణాల నుంచి పల్లెపల్లెకు ఈ బెట్టింగ్‌ జాడ్యం పాకింది. ఈజీ మనీకి అలవాటు పడ్డ కొందరు పందేలు కాస్తూ జీవితాలను నాశనం చేసుకుంటుంటే, బుకీలు మాత్రం లక్షలు ఆర్జిస్తూ విలాసవంతమైన జీవనం సాగిస్తున్నారు. ప్రొద్దుటూరు విషయానికి వస్తే, పదుల సంఖ్యలో ఉండే బుకీలు ఇపుడు వందల్లోకి చేరారు.


ఐపీఎల్‌ టోర్నీతో..

ఐపీఎల్‌ టోర్నీమెంట్‌ గతనెల 26న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే పాతిక మ్యాచ్‌లు జరిగాయి. మే 29తో ఐపీఎల్‌ టోర్నీ ముగియనుంది. అంటే.. ఇంకా నెలరోజులకు పైగా క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. ఎక్కడో జరుగుతున్న ఈ మ్యాచ్‌లు ప్రొద్దుటూరులో బుకీలకు కాసులు కురిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజూ రూ.కోట్లల్లో పందేలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ టోర్నమెంట్‌లో ప్రతి మ్యాచ్‌లో రూ.అర కోటి పైగానే పందేలు జరుగుతున్నట్లు సమాచారం. కొందరు బుకీలకు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉండటంతో పోలీసు హెచ్చరికలను ఖాతరు చేయడం లేదన్న వాదన విన్పిస్తోంది.


ప్రొద్టుటూరులోనే ఉంటూ..

గతంలో మ్యాచ్‌లు ప్రారంభానికి వారం, పది రోజుల ముందే బుకీలు సురక్షిత నగరాల్లో మకాం వేసి, అక్కడ నుంచి బెట్టింగ్‌ కార్యకలాపాలు సాగించే వారు. ఇపుడు అందుకు భిన్నంగా కొందరు బడా బుకీలు ఊర్లో ఉంటూనే భారీ స్థాయిలో బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా జిన్నారోడ్డు, దస్తగిరిపేట, మోడంపల్లి, నడింపల్లి, ఆర్ట్స్‌కాలేజీ రోడ్డు, వినాయకనగర్‌, గాంధీరోడ్డు ప్రాంతాల్లో పేరు మోసిన బడా బుకీలు తమ అనుచరులతో యథేచ్ఛగా క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతూ పోలీసులకే సవాలుగా మారారన్న విమర్శలు ఉన్నాయి. వీరిని కట్టడి చేస్తే, పసిడిపురిలో క్రికెట్‌ బెట్టింగ్‌ చాలా వరకు నివారించినట్లేనని పలువురు పేర్కొంటున్నారు.


కఠిన చర్యలు ఉంటేనే..

గతంలో క్రికెట్‌ మ్యాచ్‌లు జరిగే సమయంలో బుకీలందరిని సంబంధిత పోలీ్‌సస్టేషన్‌లో ఉంచి, మ్యాచ్‌ ముగిసాక ఇంటికి పంపించేవారు. దీంతో అప్పట్లో క్రికెట్‌ బెట్టింగ్‌ కొంత మేర తగ్గింది. అయితే ఆ చర్యలు లేకపోవడం, బుకీలకు రాజకీయ నాయకులు వత్తాసు పలికే పరిస్థితి రావడంతో క్రికెట్‌ బెట్టింగ్‌ మరింత ఎక్కువైందనే వాదన ఉంది. ఈ క్రమంలో ఇక్కడి పోలీసు అధికారులు బుకీల బైండోవర్లపై దృష్టి పెట్టారు. తాజా పలు పోలీ్‌సస్టేషన్‌లో కొందరిని ఇదివరకే బైండోవర్‌ చేశారు. దీని వల్ల క్రికెట్‌ బెట్టింగ్‌కు చెక్‌ పడేనా అని పలువురు పెదవి విరుస్తున్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌ వల్ల ఇప్పటికే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆత్మహత్య ఘటనలు కూడా గతంలో చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో క్రికెట్‌  బెట్టింగ్‌ను సమూలంగా ఇక్కడి నుంచి పారదోలేలా కఠిన చర్యలు తీసుకోవాలని ఇక్కడి ప్రజలు పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. 


క్రికెట్‌ బెట్టింగ్‌ కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం

- వై.ప్రసాదరావు, డీఎస్పీ

క్రికెట్‌ బెట్టింగ్‌ కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే కొందరు బుకీలను బైండోవర్‌ చేశాం. బుకీలపై నిఘా ఉంచాం. దాడులు చేస్తున్నాం. చాలావరకు బెట్టింగ్‌ తగ్గుముఖం పట్టింది. క్రికెట్‌ బెట్టింగ్‌కు స్వస్తి చెప్పమని బుకీలను హెచ్చరిస్తున్నాం. కాదని బెట్టింగ్‌లకు పాల్పడితే వారిపై శాఖాపరంగా చర్యలు తప్పవు.

Updated Date - 2022-04-23T06:23:44+05:30 IST