మ్యాక్స్‌ కాఫీ రైతులకు రూ.90 లక్షలు బోనస్‌

ABN , First Publish Date - 2022-08-20T06:11:25+05:30 IST

గిరిజన కాఫీ ఉత్పత్తిదారుల పరస్పర సహాయక పరిమిత సంఘం (మ్యాక్స్‌) రైతులకు రూ.90 లక్షల బోనస్‌ పంపిణీ చేయనున్నట్టు అధ్యక్షుడు సెగ్గె కొండలరావు తెలిపారు.

మ్యాక్స్‌ కాఫీ రైతులకు రూ.90 లక్షలు బోనస్‌
డైరెక్టర్ల సమావేశంలో మాట్లాడుతున్న మ్యాక్స్‌ అధ్యక్షుడు కొండలరావు

మ్యాక్స్‌ అధ్యక్షుడు సెగ్గె కొండలరావు


చింతపల్లి, ఆగస్టు 19: గిరిజన కాఫీ ఉత్పత్తిదారుల పరస్పర సహాయక పరిమిత సంఘం (మ్యాక్స్‌) రైతులకు రూ.90 లక్షల బోనస్‌ పంపిణీ చేయనున్నట్టు అధ్యక్షుడు సెగ్గె కొండలరావు తెలిపారు. వైసీటీ మ్యాక్స్‌ కార్యాలయంలో శుక్రవారం డైరెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ సహాకారంతో మ్యాక్స్‌ పరిధిలోని చింతపల్లి, జీకే వీధి, జి.మాడుగుల మండలాల గిరిజన రైతులు పండించిన కాఫీ గింజలను మార్కెటింగ్‌ చేసినట్టు చెప్పారు. మూడు మండలాల్లో 3,500 మంది రైతుల నుంచి 1,087 మెట్రిక్‌ టన్నుల కాఫీ గింజలను సేకరించామన్నారు. రైతులు పండించిన కాఫీ పండ్లను మ్యాక్స్‌ సేకరించి చింతపల్లి ఎకో పల్పింగ్‌ యూనిట్‌ వద్ద పప్పు తయారు చేయడం జరిగిందన్నారు. రైతులకు కిలో కాఫీ పండ్లకు రూ.32 ధర తొలివిడతగా చెల్లించామన్నారు. కాఫీ పండ్లను శుద్ధి చేసి క్లిన్‌ కాఫీ గింజలను ఈ ఏడాది రూ.294 ధరకు విక్రయించామన్నారు. ఖర్చులు పోనూ వచ్చిన లాభంలో రూ.90 లక్షలు బోనస్‌ రూపంలో రైతులకు అందజేసేందుకు ఐటీడీఏ పీవో, బోర్డు డైరెక్టర్లు నిర్ణయించినట్టు చెప్పారు. కిలోకి రూ.8 చొప్పున రైతుల వ్యక్తిగత ఖాతాల్లో బోనస్‌ జమ చేస్తామన్నారు.  కాగా,  చింతపల్లి వైటీసీలో ఈ నెల 29న ఐటీడీఏ పీవో అధ్యక్షతన మ్యాక్స్‌ సర్వసభ్య సమావేశం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మ్యాక్స్‌ చింతపల్లి ఉపాధ్యక్షుడు గాం సింహాచలం, జీకే వీధి అధ్యక్షుడు కంకిపాటి గిరి ప్రసాద్‌, ఉపాధ్యక్షుడు అడపా విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-20T06:11:25+05:30 IST