బొండార్స్‌ విజృంభణ

ABN , First Publish Date - 2021-04-19T05:34:30+05:30 IST

కొబ్బరి రైతులను వరుస కష్టాలు వేధిస్తున్నాయి. కొబ్బరి మార్కెట్‌ ధరలు పతనమై తీవ్రంగా నష్టపోతున్న రైతులను ఇప్పుడు కొత్త కొత్తగా ఆశిస్తున్న తెగుళ్లు నష్టాలకు గురి చేస్తున్నాయి. రూగోస్‌ (తెల్లదోమ) తెగులు పాటు తాజాగా అదే సంతతికి చెందిన బొండార్స్‌ నెస్ట్‌ఫ్లై సోకడంతో ఇప్పుడు చెట్ల ఆకులన్నీ తెల్లగా మారిపోతున్నాయి.

బొండార్స్‌ విజృంభణ
బండారులంకలో కొబ్బరి ఆకులు తెల్లగా మారిన దృశ్యం

  • కొబ్బరి ఆకులు  తెల్లగా మారి చనిపోతున్న చెట్లు
  • భారీగా నష్టపోతున్నామని రైతుల ఆవేదన
  • రూగోస్‌, బొండార్స్‌ తెగుళ్ల నివారణకు రంగంలోకి దిగిన శాస్త్రవేత్తలు

కొబ్బరి రైతులను వరుస కష్టాలు వేధిస్తున్నాయి. కొబ్బరి మార్కెట్‌ ధరలు పతనమై తీవ్రంగా నష్టపోతున్న రైతులను ఇప్పుడు కొత్త కొత్తగా ఆశిస్తున్న తెగుళ్లు నష్టాలకు గురి చేస్తున్నాయి. రూగోస్‌ (తెల్లదోమ) తెగులు పాటు తాజాగా అదే సంతతికి చెందిన బొండార్స్‌ నెస్ట్‌ఫ్లై సోకడంతో ఇప్పుడు చెట్ల ఆకులన్నీ తెల్లగా మారిపోతున్నాయి. తలలు వాల్చేస్తూ చెట్లకు ఉన్న కాయలన్నీ రాలిపోతున్నాయి. ఈ తెగులు ఇప్పుడు కోనసీమలోని సముద్ర తీర ప్రాంతాలతో పాటు అనేక గ్రామాల్లో విస్తృతంగా వ్యాపిస్తున్నందున ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా రక్షణ చర్యలు చేపట్టడానికి ఉద్యానవన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. 

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో 1.25 లక్షల ఎకరాల్లో కొబ్బరి పంట సాగవుతోంది. అందులో 90వేల ఎకరాలు కోనసీమలోనే వున్నాయి. కొన్నేళ్లుగా కొబ్బరి తోటలను రూగోస్‌ తెల్ల దోమ విస్తృతంగా వ్యాపించి కొబ్బరి రైతులను తీవ్ర కష్ట, నష్టాలకు గురిచేస్తోంది. కోనసీమ నలుమూలలా ఈ తెగులు వ్యాపించినప్పటికీ ప్రభుత్వ శాఖల అధికారుల సహకారంతో నిర్మూలనకు కొంత కృషి చేశారు. రూగోస్‌ కంటే ప్రమాదకరమైన బొండార్స్‌ తెగులు వల్ల ఇప్పుడు రైతులు పంటలను నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడింది. రూగోస్‌ వ్యాపించి తగ్గుతున్న చోటే బొండార్స్‌ విజృంభించడం వల్ల ఆ ప్రాంతంలో కొబ్బరి చెట్లన్నీ సర్వనాశనం అయిపోతున్నాయి. తెల్లదోమ నివారణకు హిస్సారియా కల్చర్‌ (లేదా) వేప నూనె వాడవచ్చు. ఎనకార్షియా డ్రైకోక్రైసా బదనికలతో బొండార్స్‌ నివారణ సాధ్యమవుతుందని అంబాజీపేట ఉద్యానవన పరిశోధనా కేంద్రం ముఖ్య శాస్త్రవేత్త చలపతిరావు పేర్కొన్నారు. ఎకరా తోటలో తెగులు వ్యాపిస్తే సగానికి పైగానే చెట్లు నాశనమవుతున్నాయి. ఈ తెగులు కొబ్బరి చెట్లతో పాటు ఆయిల్‌పామ్‌ పంటలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో రైతులు సంఘటితమై శాస్త్రవేత్తల సహకారంతో రూగోస్‌తో పాటు బొండార్స్‌ నివారణకు రక్షణ చర్యలు చేపడుతున్నారు. అయితే కొన్నిచోట్ల ఫలించినప్పటికీ మరికొన్నిచోట్ల సత్ఫలితాలు ఇవ్వట్లేదు. ఈ తెగుళ్ల నివారణకు ఉన్నత స్థాయిలో ప్రణాళికలు రూపొందించి తమను ఆదుకోవాలని కొబ్బరి రైతులు వేడుకుంటున్నారు. 


Updated Date - 2021-04-19T05:34:30+05:30 IST