‘వి’ చిత్ర నిర్మాతలకు బాంబే హైకోర్టు నోటీసులు

ABN , First Publish Date - 2021-03-05T11:59:40+05:30 IST

అమెజాన్‌ ప్రైమ్‌లో గత ఏడాది సెప్టెంబరులో విడుదలై.. ఓటీటీ సినిమాల్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన తెలుగు చిత్రం ‘వి’ నిర్మాతలకు బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నటి, మోడల్‌ సాక్షి మాలిక్‌ దాఖలు చేసిన పరువునష్టం కేసులో అఫిడవిట్‌

‘వి’ చిత్ర నిర్మాతలకు బాంబే హైకోర్టు నోటీసులు

పరువునష్టం దావా దాఖలు చేసిన సాక్షిమాలిక్‌

అఫిడవిట్‌ సమర్పించాలని ఆదేశించిన ధర్మాసనం


ముంబై, మార్చి 4: అమెజాన్‌ ప్రైమ్‌లో గత ఏడాది సెప్టెంబరులో విడుదలై.. ఓటీటీ సినిమాల్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన తెలుగు చిత్రం ‘వి’ నిర్మాతలకు బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నటి, మోడల్‌ సాక్షి మాలిక్‌ దాఖలు చేసిన పరువునష్టం కేసులో అఫిడవిట్‌ దాఖలు చేయాలని చిత్ర నిర్మాణ సంస్థ వెంకటేశ్వర క్రియేషన్స్‌, నిర్మాత వి.వెంకట రమణారెడ్డిలకు సూచించింది. సాక్షిమాలిక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి ఆమె ఫొటోను తీసుకుని, ఈ చిత్రంలో వినియోగించిన విషయం తెలిసిందే. ఆమె ఫొటోను ‘కమర్షియల్‌ సెక్స్‌ వర్కర్‌’గా చూపించడంతో తన పరువుకు భంగం వాటిల్లిందంటూ ఆమె తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. దీనికి నష్టపరిహారాన్ని కోర్టే సూచించాలని, ఆ మొత్తాన్ని నిర్మాతలు కోర్టులో డిపాజిట్‌ చేయడమో.. సామాజిక సేవకు ఉపయోగించడమో.. లేదా తన పేరిట జమ చేసేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు.


ఈ చర్య పరువునష్టం కిందకు వస్తుందని నిర్ధారించిన జస్టిస్‌ గౌతమ్‌ పటేల్‌.. ఒక వ్యక్తి అనుమతి లేకుండా ఫొటోను ఎలా వాడుకుంటారని ప్రశ్నించారు. ‘‘ఇది పరువుగా బతికే హక్కు, ప్రైవసీ హక్కును హరించే చర్య’’ అని వ్యాఖ్యానించారు. అమెజాన్‌ ప్రెమ్‌ నుంచి ఆ చిత్రాన్ని తొలగించాలంటూ గురువారం ఇచ్చిన తీర్పుపై చిత్ర యూనిట్‌ తరఫు న్యాయవాది శుక్రవారం కోర్టుకు వివరణ ఇచ్చారు. సాక్షిమాలిక్‌ ఫొటోను వినియోగించిన సన్నివేశాలను తొలగించామని చెప్పారు. దాంతో.. ఆ చిత్రాన్ని తిరిగి విడుదల చేసుకోవడానికి కోర్టు అనుమతినిచ్చింది.

Updated Date - 2021-03-05T11:59:40+05:30 IST