రోజుకో మలుపు తిరుగుతున్న బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు

ABN , First Publish Date - 2020-09-29T16:36:42+05:30 IST

బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.

రోజుకో మలుపు తిరుగుతున్న బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు

ముంబై: బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. బాలీవుడ్ సినీ తారల విచారణ.. ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ ముంబై రాక.. కరణ్ జోహార్ ఖండన వంటి అంశాలు తాజా అప్ డేట్‌లో భాగమయ్యాయి. మరోవైపు శాండిల్ వుడ్ హీరోయిన్‌ల బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం తోసిపుచ్చింది. ముంబై కేంద్రంగా సాగుతున్న బాలీవుడ్ సినీతారల డ్రగ్స్ వాడకం, సరఫరా అంశాలపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సీరియస్‌గా దర్యాప్తు సాగిస్తోంది. ఇందులో భాగంగానే విడతలవారీగా పలువురు బాలీవుడ్ నటీమణులను ప్రశ్నించింది. డ్రగ్స్ కేసు దర్యాప్తులో అవసరమైన వివరాలు సేకరించే పనిలో పడింది.


డ్రగ్స్ కేసులో బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనె, సారా ఆలీఖాన్, శ్రద్ధాకపూర్‌తోపాటు రకుల్ ప్రీత్ సింగ్‌లను ఎన్సీబీ విచారించింది. విచారణలో భాగంగా ఈ హీరోయిన్లు పలు ఆసక్తికర అంశాలు తెలియజేసినట్లు సమాచారం. తమపై వచ్చిన అభియోగాలను మాత్రం తోసిపుచ్చారని, డ్రగ్స్ అసలు తాము వాడలేదని చెప్పినట్లు సమాచారం. కొందరు సిగరెట్లు తాగే అలవాటు ఉంది తప్ప.. డ్రగ్స్ ఎప్పుడూ తీసుకోలేదని, మరికొందరు అసలు సిగరెట్ అలవాటుకూడా లేదని బదులిచ్చినట్లు ఎన్సీబీ  వర్గాలు చెబుతున్నాయి. చేతితో చుట్టిన హ్యాండ్ రోల్డ్ సిగరెట్ గురించి తాము వాట్సాప్ చాటింగ్‌లో చర్చ జరిపామని వారు చెప్పినట్లు సమాచారం. హ్యాండ్ రోల్డ్ సిగరెట్స్‌కు ‘డూబ్’ అనే పదం వినియోగించామని వారు చెప్పినట్లు తెలియవచ్చింది. ఆ నలుగురి ఫోన్లను ఎన్సీబీ అధికారులు సీజ్ చేశారు. వాటిని విశ్లేషించే పనిలో టెక్నికల్ టీమ్ నిమగ్నమైంది.

Updated Date - 2020-09-29T16:36:42+05:30 IST