బోడుప్పల్‌ కార్పొరేషన్‌ ‘చెత్త’ శిక్ష

ABN , First Publish Date - 2022-06-06T18:01:05+05:30 IST

బోడుప్పల్‌ కార్పొరేషన్‌ అభాగ్యులపై ‘చెత్త’ శిక్ష అమలు చేస్తోంది. కేవలం రోడ్డుపై చెత్త వేస్తున్నారనే ఆరోపణతో అభం శుభం తెలియని పదేళ్ల చిన్నారిపైనా, ఓ దివ్యాంగురాలైన

బోడుప్పల్‌ కార్పొరేషన్‌ ‘చెత్త’ శిక్ష

దివ్యాంగురాలు, బాలిక రోజంతా కార్యాలయంలోనే.. 

హైదరాబాద్/ఉప్పల్‌: బోడుప్పల్‌ కార్పొరేషన్‌ అభాగ్యులపై ‘చెత్త’ శిక్ష అమలు చేస్తోంది. కేవలం రోడ్డుపై చెత్త వేస్తున్నారనే ఆరోపణతో అభం శుభం తెలియని పదేళ్ల చిన్నారిపైనా, ఓ దివ్యాంగురాలైన వృద్ధురాలిపైనా కార్పొరేషన్‌ సిబ్బంది కర్కశంగా వ్యవహరించారు. రోడ్డుపై చెత్త వేస్తున్నారంటూ పదేళ్ల చిన్నారిని ఆమె సోదరుడిని, అదే ప్రాంతం నుంచి దివ్యాంగ వృద్ధురాలిని బోడుప్పల్‌ కార్పొరేషన్‌ కార్యాలయానికి తీసుకొచ్చారు. వారి ద్విచక్ర వాహనాలను కూడా తీసుకొచ్చారు. కమిషనర్‌ వచ్చే వరకూ ఇక్కడి నుంచి కదలొద్దంటూ గేటు లోపల కూర్చోబెట్టారు. దీంతో ఏం చేయాలో పాలుపోని వారు బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉండిపోయారు. తాము చెత్త వేయడం లేదని, నీళ్ల కోసం బయటకు వచ్చామని చెబుతున్నప్పటికీ వినిపించుకోవడం లేదని ఆ చిన్నారి కార్పొరేషన్‌కు వచ్చిపోయిన వారందరితో వాపోయింది. మధ్యాహ్నం 1 గంట అవుతోంది ఇప్పటి వరకు ఏమీ తినలేదని, కళ్లు తిరుగుతున్నాయని ఆ చిన్నారి ఆవేదన వ్యక్తం చేసింది.


ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదు.  జిల్లా అధికారి పద్మజారాణికి కొందరు చెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదని బాధితులు ఆరోపించారు. కార్పొరేషన్‌కు పనిమీద వచ్చిన కొందరు సలహా ఇవ్వడంతో ఆ బాలిక కార్పొరేషన్‌ మేయర్‌ సామల బుచ్చిరెడ్డికి ఫిర్యాదు చేసింది. ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాను ఏమీ తినలేదు. తాము రోడ్డుపై చెత్త వేయకున్నా కార్పొరేషన్‌ సిబ్బంది తీసుకొచ్చి కార్యాలయంలో కదలకుండా కూర్చోబెట్టారని వాపోయింది. దీంతో సిబ్బందిని విచారించిన మేయర్‌ చిన్నారిని, ఆమె సోదరుడిని, దివ్యాంగురాలిని వారి ఇంటికి పంపించమని ఆదేశించారు. దీంతో ఎట్టకేలకు వారిని మధ్యాహ్నం 1 గంటకు వదిలిపెట్టారు. 

Updated Date - 2022-06-06T18:01:05+05:30 IST